- 30 ఏళ్లు పూర్తి చేసుకున్న టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్
- నెలకు కేవలం రూ.వెయ్యి సిప్‌తో
- భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రిస్క్, టెన్షన్.. రెండూ తక్కువ
న్యూఢిల్లీ: మార్కెట్‌లో ఓపిక ఉన్నవారికి లక్ష్మీ దేవి వరిస్తుందంటారు. దీనిని కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రుజువు చేస్తున్నాయి. గత 30 ఏళ్లుగా నెలకు కేవలం రూ. వెయ్యి ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ప్రస్తుతం రూ. కోట్లకు చేరుకోవడమే ఇందుకు కారణం. లాంగ్ టెర్మ్ ఇన్వెస్టర్లకు కాంపౌండింగ్ ఫ్రెండ్ అనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) బాగా పాపులర్ అయ్యాయి. ఈ విధానాన్ని మొదటిసారిగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (గతంలో కొటారి పియనీర్) 1993 లో ప్రవేశ పెట్టింది. ప్రస్తుత రూ.65 లక్షల కోట్ల విలువైన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 14 ఈక్విటీ స్కీమ్‌లు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఏస్‌ఎంఎఫ్ డేటా ప్రకారం, ఇవి ఏడాదికి 21 శాతం వరకు రిటర్న్ ఇచ్చాయి.
1. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్..
గతంలో కొటారి పియనీర్ ప్రైమాగా ఈ ఫండ్ స్కీమ్‌ను పిలిచే వారు. డిసెంబర్ 1, 1993 లో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ప్రస్తుతం రూ.12,529 కోట్లను (కార్పస్) మేనేజ్ చేస్తోంది. మిడ్ క్యాప్ ఫండ్ అయిన ఈ స్కీమ్ గత 30 ఏళ్లలో ఏడాదికి (ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ – ఎక్స్ఐఆర్‌ఆర్) 21.4 శాతం రిటర్న్ ఇచ్చింది. నెలకు రూ.1,000 చొప్పున గత 30 ఏళ్ల పాటు సిప్ చేసి ఉంటే, ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ రూ.3.6 లక్షల నుంచి రూ.2.1 కోట్లకు పెరిగేది.
2. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్..
ఫ్లాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సెప్టెంబర్ 24, 1994 లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రూ.17,417 కోట్ల కార్పస్ (ఫండ్స్) ను మేనేజ్ చేస్తోంది. గత 30 ఏళ్లలో ఏడాదికి 20.5 శాతం రిటర్న్ ఇచ్చింది. ఇన్వెస్టర్లు నెలకు రూ.1,000 సిప్ చేసి ఉంటే, వీరి పోర్టుఫోలియో విలువ రూ.1.7 కోట్లకు పెరిగేది.
3. ఎస్‌బీఐ లాంగ్ టెర్మ్ ఈక్విటీ ఫండ్
మార్చి 31, 1993 లో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్, గత 30 ఏళ్లలో ఏడాదికి 19.3 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) కేటగిరీలో ఉంది. ప్రస్తుతం రూ.27,527 కోట్ల కార్పస్‌ను మేనేజ్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, వారి పోర్టుఫోలియో విలువ ప్రస్తుతం రూ.1.37 కోట్లకు పెరిగేది.
4. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్..
గతంలో కొటారి పియనీర్ బ్లూచిప్‌గా ఉన్నఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్ ప్రస్తుతం రూ.8,257 కోట్ల కార్పస్‌ను మేనేజ్ చేస్తోంది. ఈ స్కీమ్‌ను డిసెంబర్ 1, 1993 లో ప్రవేశ పెట్టారు. ఏడాదికి 18.6 శాతం రిటర్న్ ఇచ్చింది. 30 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 చొప్పున సిప్ చేసి ఉంటే, ఇన్వెస్టర్ల పోర్టుఫోలియో రూ. 1.2 కోట్లకు చేరుకునేది. లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో ఈ స్కీమ్ ఉంది.
5. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ స్కీమ్ ప్రస్తుతం రూ. 13,921 కోట్ల కార్పస్‌ను మేనేజ్ చేస్తోంది. అక్టోబర్ 1, 1994 లో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ఇప్పటి వరకు ఏడాదికి 18.1 శాతం రిటర్న్‌ను ఇచ్చింది. ఇన్వెస్టర్లు రూ.1,000 చొప్పున సిప్ చేసి ఉంటే వారి పోర్టుఫోలియో విలువ ప్రస్తుతానికి రూ. 1.05 కోట్లకు చేరుకునేది.
6. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ బిల్డర్ వాల్యూ ఫండ్ స్కీమ్
గత 30 ఏళ్లలో ఏడాదికి 18 శాతం రిటర్న్ ఇవ్వగా, నెలకు రూ.1,000 సిప్ చేస్తే ఇన్వెస్టర్ల పోర్టుఫోలియో రూ.1.06 కోట్లకు చేరుకునేది. అలానే ఎస్‌బీఐ లార్జ్ క్యాప్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్, కెనరా రొబెకో ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్, ఎస్‌బీఐ ఈఎస్‌జీ ఎక్స్‌క్లూజనరీ స్ట్రాటజీ ఫండ్, యూటీఐ ప్లెక్సీ క్యాప్ ఫండ్, యూటీఐ లార్జ్ క్యాప్ ఫండ్‌లు కూడా గత 30 ఏళ్లలో ఏడాదికి 13.5 శాతం నుంచి 17.4 శాతం మధ్య రిటర్న్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌లలో నెలకు రూ.1,000 సిప్ చేసి ఉంటే వీరి పోర్టుఫోలియో విలువ ప్రస్తుతం రూ. 42 లక్షల నుంచి రూ.93 లక్షల మధ్య ఉండేది.