వచ్చే ఒలింపిక్స్‎లో గోల్డ్ మెడల్ తీసుకొస్తా: దీప్తి జివాంజి

వచ్చే ఒలింపిక్స్‎లో గోల్డ్ మెడల్ తీసుకొస్తా: దీప్తి జివాంజి

హైదరాబాద్: వచ్చే పారాలింపిక్స్‎లో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తానని పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జివాంజి ధీమా వ్యక్తం చేశారు. పారిస్ పారాలింపిక్స్‏లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న దీప్తి.. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో దీప్తికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారాలింపిక్స్లో- మెడల్ రావడం సంతోషంగా ఉందన్నారు. 

ఈ మెడల్ కోచ్ రమేష్ సర్‎కి అంకితం ఇస్తానని.. ఆయన వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నానని.. అయినప్పటికీ మా అమ్మ నాకు సర్దిచెప్పి నాలో ధైర్యం నింపేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది దీప్తి. నాకోసం మా అమ్మనాన్న అర ఎకరం పొలం అమ్ముకున్నారని.. ఆసియన్ ఛాంపియన్ షిప్‏లో వచ్చిన డబ్బుతో మళ్ళీ మా ల్యాండ్ మేము కొనుక్కున్నామని తెలిపారు. 


కాగా, వరంగల్‎ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‎లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్‎లో 55.82 సెకన్‌లలో రేస్‏ని కంప్లీట్ చేసి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్‎లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‍గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోను 400ల మీటర్ల పరుగు పందెంని 55.07 సెకన్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. 

Also Read :-పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి హైదరాబాద్‍లో గ్రాండ్ వెల్ కమ్

కాగా, చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి.. ఖమ్మం డిస్ట్రిక్ అథ్లెటిక్ మీట్‭లో కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది. దీప్తి అద్భుత టాలెంట్ ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరబాద్‭కి తీసుకొచ్చారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. హైదరాబాద్ లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్ లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మోరు మోగిపోయింది.