కోఠి మహిళా వర్సిటీకి కావాల్సినన్ని నిధులిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

కోఠి మహిళా వర్సిటీకి కావాల్సినన్ని నిధులిస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • హెరిటేజ్ బిల్డింగ్స్‌‌‌‌ను పరిరక్షిస్తాం

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీని తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నగరంలోని కోఠిలో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి ఉమెన్స్ కాలేజీ)ని గురువారం ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్స్‌‌‌‌ను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరణ చేయడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, వసతి గృహాలు, వీసీ బిల్డింగ్, గెస్టు హౌస్, ఆడిటోరియం, అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్ తదితర భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన భవన నిర్మాణ నమూనాలను భట్టి తిలకించారు. ఇటీవల పునరుద్ధరణ చేసిన దర్బార్ మహల్ హెరిటేజ్ బిల్డింగును సైతం పరిశీలించారు. 

దర్బార్ మహల్ పైఅంతస్తులో 1779-– 1947 మధ్య, హైదరాబాద్ లో పనిచేసిన 57 మంది బ్రిటీష్ రెసిడెంట్లకు సంబంధించిన చిత్రపటాలు, వారి పదవీ కాలంలో హైదరాబాద్ నగర రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రదర్శించిన చిత్రపటాలను ఆసక్తిగా తిలకించారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్వహించే భవనాలకు సంబంధించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. వర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు భట్టి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, యూనివర్సిటీ ఇన్‌‌‌‌చార్జ్ వీసీ సూర్య ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.