ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి హామీలిస్తున్నాయి. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం(మార్చి 4) టీడీపీ-జనసేన కూటమి మంగళగిరిలో 'జయహో బీసీ' సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు.
జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారన్న టీడీపీ అధినేత, ఈ నిర్ణయం వల్ల చాలా మంది బీసీలు పదవులు కోల్పోయారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్దరిస్తామని మాటిచ్చారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ.. తెదేపా అని, బీసీల డీఎన్‌ఏలోనే తెదేపా ఉందని అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని, ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తామని మాటిచ్చారు.
బీసీ డిక్లరేషన్ లోని కీలక అంశాలు ఇవే..
- బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం
- ప్రస్తుతం ఉన్న రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతాం
- బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం
- సామాజిక న్యాయ పరిశీలన కమిటీల ఏర్పాటు
- బీసీ సబ్ ప్లాన్ ద్వారా రాబోవు ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం
- స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం
- చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం
- అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు
- బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు ఇస్తాం
- జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
- చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం
- రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్దరిస్తాం.
- పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు
- శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం
- విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
- షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
- బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.