దాడి చేసినోళ్లను, చేయించినోళ్లను ఎవరినీ వదలం: సీఎం రేవంత్​రెడ్డి

దాడి చేసినోళ్లను, చేయించినోళ్లను ఎవరినీ వదలం: సీఎం రేవంత్​రెడ్డి
  • ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే
  • లగచర్ల ఘటనపై సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరిక
  • అధికారులపై దాడిని కేటీఆర్​, బీఆర్​ఎస్​ సమర్థించడమేంది? 
  • రేపు మీపైనా ఇట్ల జరిగితే సమర్థిస్తరా?
  • దాడులు చేసినా, ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం.. అందరి సంగతి తేలుస్తం
  • కేసుల విచారణ నుంచి తప్పించు
  • కునేందుకే ఢిల్లీలో కేటీఆర్​ చక్కర్లు
  • బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు
  • అమృత్​ టెండర్ల వ్యవహారంలో ఎక్కడైనా
  • పోరాటం చేసుకోవచ్చని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: వికారాబాద్​ కలెక్టర్​, అధికారులపై దాడికి పాల్పడ్డవాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు.  దాడులను ఖండించాల్సింది పోయి దాడి చేసినవాళ్లనే బీఆర్​ఎస్​ నేతలు పరామర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి దాడులు బీఆర్​ఎస్​ నేతలపై జరిగితే కేటీఆర్​ సమర్థిస్తరా? అని ఆయన నిలదీశారు. 

‘‘అధికారులపై దాడులను బీఆర్​ఎస్​ ఎందుకు ఖండించడం లేదు? దాడి చేసినవాళ్లను ఎలా పరామర్శిస్తరు? దాడులను ప్రోత్సహించేందుకేనా మీ పరామర్శలు? భూసేకరణ చేయాల్నా వద్దా అనేదానిపై బీఆర్​ఎస్ సహా ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు.. భూమి కోల్పోతున్నవాళ్లు నిరసన తెలుపొచ్చు.. అందులో తప్పు లేదు. కానీ.. అధికారుల మీద పాశవికంగా దాడి చేసి, వారిని చంపేందుకు ప్రయత్నించడాన్ని  బీఆర్ఎస్​ ఏ రకంగా సమర్థించుకుంటుంది?” అని ఫైర్​ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ అవినీతిపై విచారణకు గవర్నర్​ ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ చుట్టూ కేటీఆర్​ చక్కర్లు కొడ్తున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​, బీజేపీ చీకటి బంధం కేటీఆర్​ ఢిల్లీ టూర్​తో మరోసారి బయటపడుతున్నదని అన్నారు.  ‘‘బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై ఇప్పుడు విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురు దాడికి కేటీఆర్​ ప్రయత్నిస్తున్నడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏ విషయం మీదైనా చర్చకు సిద్ధం

అధికారులపై దాడులను ఎవరైనా సమర్థిస్తారా? అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. కానీ, బీఆర్​ఎస్​ నాయకులు, కేటీఆర్​  మాత్రం సమర్థిస్తున్నారని.. ఇదే దాడి రేపొద్దుగల్ల బీఆర్​ఎస్​ నాయకులపై జరిగితే కూడా ఇట్లనే సమర్థిస్తరా? అని నిలదీశారు. ‘‘పదేండ్లు అన్యాయం చేసిన్రని మీపై(బీఆర్​ఎస్​ నేతలపై) ఎవరైనా దాడి చేస్తే సమర్థిస్తరా? ఖచ్చితంగా దాడులను ఖండించాల్సిందే. దాడులు చేసినవాళ్లపై, ప్రోత్సహించినవాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంతవారున్నా ఎంత పెద్దోళ్లున్నా ఊచలు లెక్కపెట్టక తప్పదు. 

దాడులు చేసేవాళ్లకు అండగా నిలబడ్తామని కేటీఆర్​, బీఆర్​ఎస్​ నాయకులు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు. బీఆర్​ఎస్​పైనే దాడి జరిగితే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు అడగరా? ఏ విషయం మీదనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ప్రత్యక్షంగా దాడులు చేసినవాళ్లను, దాడులను ప్రోత్సహించినోళ్లను, ప్రోత్సహించినోళ్ల వెనుక అండగా నిలబడ్డోళ్లను ఎవరినీ వదలం. అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తుంది” అని ఆయన హెచ్చరించారు. 

బీఆర్​ఎస్​ నేతలు మెదళ్లు కూడా కోల్పోయిన్రు

బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంటే దానిపై చర్చ జరగొద్దన్న ఉద్దేశంతోనే కేటీఆర్​ తనపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అమృత్​ టెండర్ల వ్యవహారంపై లీగల్​ ఫైట్​ చేసుకోవచ్చని కేటీఆర్​కు సూచించారు. ‘‘ఈ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్​ చెప్తున్న సృజన్​రెడ్డి అనే వ్యక్తి ఉపేందర్​రెడ్డికి అల్లుడు. ఉపేందర్​రెడ్డి బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే సృజన్​రెడ్డి కంపెనీకి బీఆర్​ఎస్​ హయాంలో వేల కోట్ల రూపాయల వర్క్స్​ ఇచ్చారు. ఇది ఆన్​ రికార్డ్​. ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్..  ఎక్కడైనా వాటిపై విచారణకోసం చెప్పుకోవచ్చు. కోర్టులో కేసు వేసుకోవచ్చు. న్యాయపరమైన పోరాటం చేసుకోవచ్చు. కేవలం ఆయన కుటుంబం దోచుకున్న వాటిపై చర్చ జరగకుండా ఉండేందుకే నాపై ఆరోపణలు చేయాలనుకుంటున్నడు” అని సీఎం అన్నారు. 

బీజేపీని అతిపెద్ద అవినీతి పార్టీ అంటూ చెప్పిన కేటీఆరే ఇప్పుడు అదే పార్టీ నేతల దగ్గరకు వెళ్లి లెటర్లు ఇవ్వడాన్ని ఎట్ల అర్థం చేసుకోవాలని  ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీజేపీకి బీఆర్​ఎస్​ వంతపాడుతున్నదని.. అక్కడ కాంగ్రెస్​కు ఓటు వేయొద్దని గులాబీ నేతలు చెప్పడం వెనుక బీజేపీకి ఓటు వేయాలని చెప్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ చీకటి ఒప్పందానికి ఇది మరో నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు అధికారం  కోల్పోయిన్రు.. రెండోసారి డిపాజిట్లు కోల్పోయిన్రు.. మూడోసారి మెదళ్లు కూడా కోల్పోయిన్రు. వాళ్లను చూసి జాలిపడటం తప్ప వాళ్ల గురించి చర్చించుకోవడంలో ప్రయోజనం లేదు” అని బీఆర్​ఎస్​ నేతలపై విమర్శలు చేశారు.

ట్వంటీ-ట్వంటీ ఫార్మాట్​కు కాంగ్రెస్​ మారాలి

దేశంలో బీజేపీ హిట్ ఔట్ లేదా గెట్ ఔట్ పాలిటిక్స్ చేస్తున్నది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నరు.  పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటరు. పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మాట్​ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్న. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నరు. ట్వంటీ– ట్వంటీ ఫార్మాట్​కు మారాల్సిన అవసరం ఉంది. ఫార్మాట్​ను అప్ గ్రేడ్ లేదా రీ డిజైన్ చేసుకోవాలి. సీఎం రేవంత్​రెడ్డి