
ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. తిండికి లోటు లేదు. కోరుకున్న వస్తువు క్షణాల్లో ముందుంటుంది. అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. అయినా ఇంకా మనిషికి దేవుడితో పనేం ఉంది? నాటి నుంచి నేటివరకు ఏ కాలంలో చూసినా.. మనిషి ఎందుకు మతం వైపు అడుగులు వేస్తున్నాడు?.. ఈ ప్రశ్ననే ఒకసారి జిడ్డు కృష్ణమూర్తిని అడిగారు ఆయన ఫాలోయర్స్, దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు
గుడికి ఎందుకు వెళ్ళాలి? అని కొందరికి. గుడికి వెళ్ళే అలవాటు కొందరికి ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగులు,ఇబ్బందులు ఉంటే వాటిని మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
'ఇక చాలు.. నాకిది సరిపోతుంది.. అని మనిషి ఎప్పుడూ అనుకోడు. నాకు కావాల్సిన ఫుడ్ ఉంది. వేసుకోవడానికి బట్టలున్నాయి. ఉండటానికి ఇల్లుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో బతుకుతున్నాను. ఏదో ఒకరోజు చనిపోతాను. కానీ, కచ్చితంగా ఇంకేదో కావాలి. ఈ ప్రశ్నను తెలివైనవాడు... తెలివి లేనివాడు ఎప్పుడో ఒకప్పుడు అడుగుతుంటాడు లేదా తనను తానే ప్రశ్నించుకుంటాడు. కమిటెడ్ కమ్యూనిస్ట్ కూడా ఏదోఒక సందర్భంలో ఇలాంటి ప్రశ్ననే అడుగుతాడు. అసలేంటిది? బాధా? కష్టమా? లేక అసలు ఏమీ లేదా? ఈ ప్రశ్నతాలూకు అంశాల్ని చాలా లోతుగా ఆలోచించాలి.
మనసులో కొంచెం కూడా భయం లేనప్పుడు.. మెదడు స్థితి ఎలా ఉంటుంది? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పూర్తిగా భయం లేని టైమ్ లో మెదడు స్థితి ఎలా ఉంటుందో కనుక్కోండి. అప్పుడు, దేనినో రక్షించాలనే కోరిక ఉంటుందా దానికి? దేనికోసమైనా అడిగే అవసరం ఉంటుందా?.. ప్రార్ధన చేయాలి. సాయం కోరాలి. పూజ చేయాలి అనే ఆలోచనైనా వస్తుందా? మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేదంటే రకరకాల డైట్ బుక్స్ ముందేసుకొని చదువుతారా? పొద్దున్నే లేచి టీవీలో ఎక్స్పర్ట్స్ చేసే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ చూస్తారా? ఇదే ఆరోగ్యంగా ఉన్న మనసుకూ వర్తిస్తుంది. ఇక్కడ మనసు ఆరోగ్యంగా ఉండటం అంటే.. భయం లేకుండా ఉండటం... పూర్తిగా భయం లేకుండా ఉండటం... ఇదే బాధ అంతమయ్యే స్థితి కూడా!
ALSO READ | ఆధ్యాత్మికం: మనిషి బతికున్నంతవకు అనుభవించేవి ఏమిటో తెలుసా..
ఆరోగ్యంగా ఉన్నారు, మంచితనంతో మెలుగుతున్నారు, మెదడులో కొంచెం కూడా భయం లేదు ఇలాంటి సమయంలో గుడికి పోవాల్సిన అవసరం ఉంటుందా? మనసు అల్లకల్లోలం అయినప్పుడు, మనసు రూల్స్ మధ్య బందీ అయినప్పుడు, ఆరోగ్యంగా లేనప్పుడు, భయం భయంగా ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు సహజంగానే ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి సాయం కోరుకుంటారు. ఆ సమయంలో దేవుడు కనపడతాడు. ఆ కష్టాన్ని బాధని ఆ ఒంటరితనాన్ని తనంతట తాను పరిష్కరించుకోలేనప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఇదే మతానికి, మతం వైపు మళ్లడానికి కారణమవుతుంది.
నాటి నుంచి నేటి వరకు మనకు ఎంతోమంది గొప్ప గొప్ప రక్షకులూ, నాయకులు ఉన్నారు. ఎంతోమంది గురువులు, మతబోధకులూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా.. వాళ్లు మనుషుల్ని ఈ బాధల నుంచి తప్పించలేకపోయారు! అందుకే సైకలాజికల్‌గా ఎవరి మీద ఆధారపడకుండా మన జ్ఞానాన్ని మనం వెలిగించుకున్నామా?" అనే ప్రశ్న పుడుతుంది.
బాధలు, కష్టాలు రాకుండా ఉండేందుకు మనమేమైనా చేశామా? అంటే మనల్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోగలిగామా? అర్ధం చేసుకోవడం సాధ్యమయ్యే పనేనా? అంటే, ఇటువైపు మనం ఎప్పుడూ ప్రయత్నించలేదు. మన మెదడుకు అద్భుతమైన కెపాసిటీ ఉంది. కానీ, దాన్ని మనం ఎప్పుడూ. ఉపయోగించే ప్రయత్నం చేయం. ఎందుకంటే దానికి బదులుగా ఎప్పుడూ ఎవరి (దేవుడు కూడా) సాయాన్నో కోరుకుంటాం. అందుకే. ఇలా ఉన్నాం! మాట్లాడేవాడు (నేను) మీకు సాయం చేయడం లేదు. ..బోధించడమూ లేదు. నీలో నువ్వు చూసుకో... నీలో ఉన్న నిన్ను చూసుకో.. నిన్ను నువ్వు అర్థం చేసుకో.. అని మనమంతా చెప్తున్నాం!
–వెలుగు, లైఫ్–