
బంగారం ఒక వినియోగదారు వస్తువుగానే కాకుండా పెట్టుబడి ఆస్తిగా కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడుదొడుకులు కారణంగా జరిగే నష్టాలతో పోలిస్తే బంగారం ఆర్థిక సంక్షోభ సమయాలలో మంచి లాభాలను ఇవ్వగలిగింది. అంతేకాకుండా అవసరాలలో నగదుగా మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. బంగారం నిల్వ ఉంచుకున్న వ్యక్తుల శక్తి సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలపైన కాకుండా.. బంగారం సహజసిద్ధమైన తన సొంత విలువతోనే మార్కెట్లో నిలబడుతోంది. తద్వారా పెట్టుబడిదారులు, వినియోగదారులు బంగారాన్ని కలిగి ఉండడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 1971 నుంచి బంగారంపై రాబడులు ఈక్విటీలు, బాండ్లతో సమానంగా వస్తున్నాయి. ఇతర పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే బంగారం మంచి ఆదాయాన్ని ఇస్తోంది.
ప్రతి సంవత్సరం గ్లోబల్‌గా బంగారంపై పెట్టుబడి డిమాండ్ సగటున 10% పెరుగుతోంది. ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్ఛితి, మార్కెట్ల పతనం ఇలాంటి అస్థిరతల సమయంలో బంగారం అనేది అనాదిగా ప్రజలకు భరోసా కల్పిస్తున్నది. అమెరికా ప్రపంచ దేశాలపైన టారిఫ్ లను పెద్ద ఎత్తున ప్రక టించడంతో పెట్టుబడుదారులు బంగారంపై పెట్టు బడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. బంగా రానికి ఎప్పుడూ కూడా సేఫ్ హెవన్ అసెట్‌గా గుర్తింపు ఉంది.
స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు లేదా కరెన్సీ విలువలు తగ్గిపోతున్నప్పుడు, మదుపుదారులు ప్రత్యామ్నాయంగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. బంగారం ధరలు అమెరికన్ డాలరుతో ఔన్స్‌కు 3220 డాలర్లు నమోదు కాగా, భారత్ కరెన్సీలో రూ.93000 వరకు 11 ఏప్రిల్ 2025 నాటికి చేరింది. ప్రపంచ దేశాలలోని అన్ని కరెన్సీల్లో కూడా రికార్డ్ స్థాయిలో బంగారంపై ధరల పెరుగుదల కనిపించింది. ఇది ప్రపంచ స్థాయిలో బంగారంపై పెరుగుతున్న పెట్టుబడి విశ్వసనీయతను కనబరుస్తుంది.
బంగారం నిల్వ ఉన్న దేశాలు
ప్రపంచంలో అత్యధిక బంగారం నిలువలు కలిగిన దేశం అమెరికా. అమెరికా మొత్తం 8,133.46 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇది అమెరికా విదేశీమారక నిల్వలలో 72.41% కలిగి ఉంది. అమెరికా తర్వాత జర్మనీ 3351.52 టన్నులు, ఇటలీ 2451.84 టన్నులు, ఫ్రాన్స్ 2436.97 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా వారికి ఉన్న విదేశీ నిల్వలలో ఎక్కువ శాతం బంగారాన్ని పెట్టుకోవడం గమనించదగిన ముఖ్య విషయం.
గత కొన్ని సంవత్సరాల కాలంలో చైనా 2289.52 టన్నులు, రష్యా 2039.63 టన్నుల బంగారు నిల్వలను కొనుగోలు ద్వారా కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా రెండూ కూడా డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చైనాలో బంగారం మొత్తం విదేశీ నిల్వల శాతంలో కేవలం 4. 80% మాత్రమే. భారతదేశం కూడా బంగారు నిలువలను పెంచుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది.
భారత్ ప్రస్తుతం బంగారం నిల్వలు మొత్తం భారతదేశానికి ఉన్న విదేశీమారక నిల్వలో 9.57% మాత్రమే. ప్రజలు వ్యక్తిగతంగా ఎక్కువ బంగారం కలిగి ఉన్నా, కేంద్ర బ్యాంక్ స్థాయిలో ఇంకా నిల్వలు పెంచాల్సిన అవసరం ఉంది.
నాలుగు కారణాలు
గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరగటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒక్కరోజులోనే బంగార ధరలు ఎగబాగడానికి ప్రధాన కారణాలు పరిశీలించినప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం. రెండోది అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన, భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కూడా కనబడుతోంది.
మూడోది ఈ వారంలో భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం. చివరగా అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లను తగ్గించి నగదు ప్రజల చేతుల్లో పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుందనే వార్త కూడా బంగారంపై పెట్టుబడులకు గిరాకీకి కారణమైంది.
అమెరికా వర్సెస్ చైనా టారిఫ్‌ల వార్
ప్రపంచ దేశాలలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఆయిన అమెరికా, -చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రమవుతూ 145 శాతం వరకు చైనా వస్తువులపై, 125 శాతం వరకు అమెరికా వస్తువులపై విధించడం జరిగింది. సుంకాల యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఉద్వేగాలు ఏర్పడుతున్నాయి.
ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ రాజకీయ ఉద్వేగాలు యూరప్‌లో నాయకత్వ మార్పులు కూడా బంగారం విలువను పెరిగేవిధంగా ప్రధాన కారకాలుగా ఉన్నాయి. బంగారంపై ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. చైనా, ఇండియా, రష్యా వంటి దేశాలు గోల్డ్ రిటర్న్ పెంచుకుంటూ ఉన్నాయి.
కొంతకాలానికి నిలదొక్కుకునే అవకాశం
ప్రపంచ దేశాల మధ్య సుంకాల యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు
ఈ సమయంలో బంగారంపైన పెట్టుబడులు పెట్టకపోవడం శ్రేయస్కరం. సామాన్య వినియోగదారులు సైతం కొంత సమయం వేచి ఉన్నట్లయితే.. సుంకాల యుద్ధ వాతావరణం తొలగిపోయిన తర్వాత బంగారం ధరలు నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈనేపథ్యంలో బంగారం సగటు ధరలో పెద్ద వ్యత్యాసాలు రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు. కావున, బంగారం అవసరమైనవారు మాత్రమే కొనుగోలు చేయాలి. కానీ, పెట్టుబడి దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం అత్యధిక రిస్క్‌ను కలిగి ఉంటుంది.
- చిట్టెడ్డి కృష్ణా రెడ్డి,
అసోసియేట్ ప్రొఫెసర్,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ