దళితుల బతుకుల్లో మార్పొస్తదా?

ప్రపంచం మొత్తం ఆధునికతవైపు పరుగులు పెడుతోంది. టెక్నాలజీ పెరిగి అన్ని రంగాల్లో కొత్త కొత్త సౌలతులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ తరతరాలుగా దళితుల తలరాత మాత్రం మారడం లేదు. వారి జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా పరంగా ఇలా ఎన్నో రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్న దళితుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. తాత్కాలిక స్కీములతో దళితుల ఓట్లు దక్కించుకుని గద్దెనెక్కడానికే పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత సాధికారత విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇప్పటికీ వారిని అభివృద్ధికి, అవకాశాలకు దూరం చేస్తోంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దళితులకు సరైన ప్రాధాన్యత దక్కనట్లయితే వారి బతుకులు మారేదెలా?

దళితులంటే ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. అధికారం చేపట్టడానికి ముందు ఒక మాట అధికారం చేపట్టిన తర్వాత మరో మాట చెబుతున్నాయి. దీనికి ఉదాహరణలే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, దళితబంధు మొదలైనవి. నిజంగా దళితుల సాధికారత గురించి మాత్రం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన దళిత వర్గాలకు ఆర్థిక, రాజకీయ అవకాశాలు కల్పించి మార్పు తీసుకురావడానికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు తాత్కాలిక పథకాలతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఇవి తాత్కాలిక పథకాలు కావడంతో దళితుల స్థితిగతుల్లో మార్పురావడం లేదు. రాజ్యాంగం దళితులకు రిజర్వేషన్లు కల్పించడం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన కొంత మంది ఆయా రంగాల్లో రాణిస్తున్నప్పటికీ.. దేశంలోని మెజారిటీ జనాలు మాత్రం ఇంకా దుర్భరమైన జీవితాలనే గడుపుతున్నారు.

ఇప్పటికీ వెనుకబాటే
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా దళితులు అన్ని రకాలుగా వెనుకబడే ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి విషయంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులను సమాజంలోని మిగతా వారితో సమాన స్థాయికి తీసుకురావాలని రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. కానీ మన దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ సరిగ్గా అమలు చేయకపోవడంతో దళితుల జీవితాలు ఇంకా చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. దళితులుగా పుట్టడమే వారి పాలిట శాపంగా మారినట్లుగా భావించాల్సి వస్తోంది. దళితులు రిజర్వేషన్ల మీద ఆధారపడి ఉద్యోగాలు, పదవులు పొందుతారని.. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన నేతలు చిన్న చూపుతో మాట్లాడిన తీరును మనం అనేకం చూశాం. చట్టాల రూపకల్పన చేసే వారి మెదళ్లలోనే ఇంతటి వివక్ష ఉన్నప్పుడు దళితుల బతుకులు ఎలా మారుతాయి. 

పాలకవర్గాల నిర్లక్ష్యం
అది జరగకపోగా రిజర్వేషన్ల కారణంగా దళితులకు ఉద్యోగాలు రావడం సులువు అనేది సహజంగా అనేక మందిలో ఉన్న అపోహ. కానీ, ఆ రిజర్వేషన్లు సైతం సక్రమంగా అమలుకాకపోవడంతో ఏటేటా పెరుగుతూ వస్తున్న జనాభాలో దళితులు మరింత వెనుకబడిపోతున్నారు. సొంత ప్రతిభతో ఎదిగిన దళితులను కూడా గుర్తించడానికి ఈ సమాజం సిద్ధపడటం లేదు. అసమానతలు లేని సమాజం నిర్మించడంలో పాలకవర్గాల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఇన్ని సంవత్సరాల భారతావనిలో దళితుల్లో గుణాత్మకమైన మార్పును తేలేకపోయింది. ఇంకా మురికివాడల బతుకుల నుంచి దళితులు బయటపడలేకపోతున్నారు. మురికివాడలే ఇప్పటికీ వారికి ఆశ్రయమై నిలుస్తున్నాయి. ఊరి అవతలి బతుకుల వెక్కిరింపులతో దళితులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారనే దానికి నిదర్శనం. 

స్కావెంజర్లలో 73% మంది ఎస్సీలే
దేశంలోని మొత్తం పారిశుధ్య కార్మికుల్లో(మాన్యువల్‌‌‌‌ స్కావెంజర్లు) 73 శాతం మందికి పైగా షెడ్యూల్డ్‌‌‌‌ కులాలకు చెందినవారే ఉన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్​ సాక్షిగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి రామ్​దాస్ అథవాలె వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యువల్‌‌‌‌ స్కావెంజింగ్‌‌‌‌ చట్టం, 2013లోని నిబంధనల ప్రకారం దేశంలోని మాన్యువల్‌‌‌‌ స్కావెంజర్లపై కేంద్రం అనేక సర్వేలు నిర్వహించింది. వీరిలో ఎక్కువ మంది ఎస్సీలే ఉన్నారన్న విషయాన్ని ఈ సర్వేలు ధ్రువీకరించాయి. కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలో మొత్తం 58,098 మంది మాన్యువల్‌‌‌‌ స్కావెంజర్లు ఉన్నారు. వీరిలో 42,594 మంది ఎస్సీ కులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ లెక్కలు చూస్తే ఆరోగ్య భారతం కోసం పాటుపడుతున్నది దళితులేననేది స్పష్టమైపోయింది. 

కలిసికట్టుగా గొంతు విప్పాలి
దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెపుతున్న పార్టీలు.. వాస్తవానికి వారిని ఒక్కటి కాకుండా చేస్తున్నాయి. అధికారం దళితుల చేతికి అందకుండా చేయడంలో అగ్రకులాల నాయకులు రాజకీయాలకతీతంగా ఐక్యంగా పనిచేస్తున్నారు. యాచించే స్థానం నుంచి శాసించే స్థాయికి దళితులు ఎదగాలి. ఆ ప్రయత్నంలో మొదటగా ఆధిపత్య వర్గాల కుట్రలను ఛేదించాలి. దళితుల మీద కులం పరంగా, దళిత మహిళల మీద లైంగికపరంగా జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలి. సామాజిక సమానత్వం కోసం పోరాడుతూనే రాజకీయ, ఆర్థిక సమానత్వం లక్ష్యం దిశగా పయనించాలి. అంబేద్కర్ భావజాలాన్ని గ్రామీణ పునాదుల మీద నిర్మించాలి. చట్టాల అమలులో, అధికారంలో, ఉద్యోగాల్లో చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా కలిసికట్టుగా గొంతు విప్పాలి. అలాగే దళితులను మురికివెతల నుంచి బయటపడేసే చర్యలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాలి. దళితుల బతుకులను మార్చడానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. మురికివాడల నుంచి ఆధునికతవైపు దళితులు అడుగులు వేస్తేనే సమసమాజం ఏర్పాటుకు పునాదులు పడతాయి.

అభివృద్ధికి దూరమైన బతుకులు
2013లో మాన్యువల్‌‌‌‌ స్కావెంజింగ్‌‌‌‌ రద్దయింది. అప్పటి నుంచి మాన్యువల్‌‌‌‌ స్కావెంజర్ల నియామకానికి ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పడింది. లేకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రిజర్వేషన్లు అంటేనే దళితుల కోసమనే భావనలో ఉన్న వారు ఈ స్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తూ పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా స్వచ్ఛత, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న వీరి బతుకులకు భరోసా కల్పించాలి. ఎన్నికల సమయాల్లో.. దళితుల పేరిట రాజకీయాలు చేసే ప్రభుత్వాలు వారి జీవన ప్రమాణాలు పెంచడంలో విఫలమయ్యాయి. చాలీచాలని జీతాలతో ప్రాణాలను పణంగా పెట్టి మురికి కూపాల్లో పనులు చేస్తూ అనారోగ్యాలకు గురయ్యే వారెందరో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దళితుల సామాజిక స్థితిగతులను మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తరాలు మారినా.. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని చెబుతున్నా ఏ చర్యలూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. రైలు పట్టాల పక్కన, మురికివాడల్లోనే దళిత సామాజిక వర్గం చైతన్యానికి, అక్షరాలకు, ఆర్థికపరమైన సౌలతులకు దూరంగా బతుకులు వెళ్లదీస్తున్న దుస్థితి.