
అమరావతి: ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మే నెలలో ‘తల్లికి వందనం’ ప్రారంభిస్తామని, ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంతాన ఉత్పత్తిని పెంచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని, ఈ నెలలో పీ4 విధానం ప్రారంభిస్తామని -తెలిపారు. పేదరికాన్ని తగ్గిస్తూ సమాజ నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని, మహిళల భద్రత కోసం శక్తి యాప్ తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాబు సూపర్ 6ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ‘తల్లికి వందనం’ పథకం కూడా సూపర్ సిక్స్లో ఒకటి కావడం గమనార్హం. ఈ పథకం ఇప్పటికీ అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. విద్యార్థుల తల్లులను బాబు ప్రభుత్వం మోసం చేసిందని, బూటకపు హామీలతో కూటమి పార్టీలు అధికారం దక్కించుకున్నాయని వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
మే నెలలో ‘తల్లికి వందనం’ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో అమలుపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే.. అంతమంది పిల్లలకు సంవత్సరానికి తలో రూ.15 వేలు ఇస్తామని బాబు సూపర్ సిక్స్లో ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో ఈ హామీ కూడా కీలక పాత్ర పోషించింది.