- వానాకాలం నో పంపింగ్.. ఎండాకాలం నో వాటర్
- ఇప్పటికీ పూర్తికాని మల్లన్న సాగర్ రిజర్వాయర్
- మిడ్ మానేరు నుంచి నీళ్లున్నా ఎత్తిపోసుకోలేని పరిస్థితి
- గడిచిన రెండేళల్లో పాత ఆయకట్టుకే సాగునీరు
- కొత్త ఆయకట్టుకు నీళ్లు లేక ఎండుతున్న పంటలు
‘‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.. లింక్‒1 కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌లు నిర్మించారు.. ఈ ప్రాజెక్టు పూర్తయితే తొలిఫలితం భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకే దక్కుతుందని, ఈ రెండుచోట్లా 30 వేల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రకటించారు.. పంపింగ్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు. ’’
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమై రెండేళ్లు పూర్తయినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ప్రధానంగా 50 టీఎంసీల నీటిని నిల్వ చేసే మల్లన్నసాగర్ సహా పలు రిజర్వాయర్లు ఇంకా పూర్తికాలేదు. ఇంకొన్ని రిజర్వాయర్ల కింద పంట కాలువల నిర్మాణం జరగలేదు. కాళేశ్వరం నుంచి ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి 37 లక్షల ఎకరాలకు పైగా సాగునీరిస్తామని సర్కారు చెప్పింది. కానీ గత రెండేళ్లుగా పాత ఆయకట్టుకే తప్ప ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు కు నీళ్లివ్వలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసి, గోదావరి, ప్రాణహిత పోటెత్తినప్పటికీ ప్రభుత్వం కేవలం 36 టీఎంసీలకు మించి లిఫ్టు చేయలేకపోయింది. ఫలితంగానే కిందటి వానకాలం కాళేశ్వరం పరిధిలోని అన్ని రిజర్వాయర్లలో నీళ్లున్నప్పటికీ13 జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
ఈసారీ డౌటే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 37.08 లక్షల పాత, కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందులో 13 జిల్లాల పరిధిలో18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంది. కానీ కాళేశ్వరంలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న 17 రిజర్వాయర్లలో పలు రిజర్వాయర్లు నేటికీ పూర్తికాకపోవడం, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌లో ఉండడంతో ఈసారి కూడా కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వడం అనుమానంగానే ఉంది. మరీ ముఖ్యంగా కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ఇంకా పూర్తికాలేదు. గతేడాది మేడిగడ్డ వద్ద ప్రాణహితలో పుష్కలంగా వరద ఉన్నా, మిడ్‌మానేరు ప్రాజెక్టులో కావాల్సినన్ని నీళ్లున్నా వినియోగించుకోలేకే13 జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. 50 టీఎసీంల కెపాసిటీతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కోసం సిద్దిపేట జిల్లా తోగుట, కొండపాక మండలాలకు చెందిన 8 గ్రామాల్లోని 2,819 ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. చాలామంది నిర్వాసితులు న్యాయమైన పరిహారం కోసం కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం రిజర్వాయర్ ఎర్త్ బండ్ పనులు 95 శాతం, బండ్ రివిట్మెంట్ పనులు 60 శాతం, అఫ్టెక్ స్లూయిస్ వాల్స్ పనులు దాదాపు 70 శాతం పూర్తయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో వానకాలం మొదలుకానున్నందున ఈసారి మల్లన్నసాగర్పూర్తికావడం అనుమానమేనని తెలుస్తోంది.
అప్పుడట్ల.. ఇప్పుడిట్ల..
వానాకాలం భారీ వర్షాలు పడితే ఒక్కపెట్టున ఎల్లంపల్లి నిండుతోంది. పై నుంచి ఇన్‌ఫ్లో పెరిగితే ఆ స్థాయిలో నీటిని పైకి ఎత్తిపోయలేక ఫ్లడ్‌ను దిగువకు వదలాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక ఎల్ఎండీ, మిడ్‌మానేరు కూడా నిండితే మల్లన్నసాగర్పూర్తికాకపోవడం వల్ల నీటిని ఎటు లిఫ్టు చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వం అత్యుత్సాహంతో జూన్‌లో మోటర్లు స్టార్ట్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీల్లో ఎత్తిపోసినా, తర్వాత గట్టి వానలు కురిస్తే తిరిగి గేట్లను తెరిచి వృథాగా వదిలేయాల్సి వస్తోంది. 2019, 2020 సీజన్లలో కరెంట్ రూపంలో వందల కోట్ల నష్టం మిగిలింది అందువల్లే 2019 జూన్ నుంచి 2020 మే నాటికి 60 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తే గతేడాది 33 టీఎంసీల నీటి లిఫ్టింగ్‌కే పరిమితం అయ్యారు. ఇక రూ.20 వేల కోట్లతో మరో 6 మోటార్లు ఏర్పాటు చేసినా కెనాల్స్, పైపులైన్ పనులు జరుగుతున్నాయి.
జిల్లా కొత్త ఆయకట్టు (ఎకరాల్లో)
కామారెడ్డి 1,84,108
సంగారెడ్డి 2,69,744
మెదక్ 2,47,418
మేడ్చల్ 29,473
యాదాద్రి 2,49,105
నల్గొండ 29,169
సిరిసిల్ల 1,53,539
సిద్దిపేట 3,29,616
జగిత్యాల 19,979
కరీంనగర్ 800
పెద్దపల్లి 30,000
నిర్మల్ 1,00,000
నిజామాబాద్ 1,82,749
మొత్తం 18,25,700