హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. వరంగల్ నగరంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు , టెక్స్ టైల్ పార్కు, జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 6,100 కోట్ల రూపాయల పనుల కోసం శంకుస్థాపనలు జరిగే ఈ మీటింగ్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరవుతారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నరలో ప్రధాన మంత్రి నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఏ అధికారిక కార్యక్రమంలోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం స్వాగతం కూడా పలుకలేదు. ప్రతి సారీ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రొటోకాల్ మంత్రి హోదాలో ప్రధానికి వెల్ కం చెప్పారు.
గతేడాది ఫిబ్రవరి 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చినజీయర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ కు వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. జ్వరం కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గత ఏడాది జూలై 8వ తేదీని హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి సీఎం స్వాగతం పలకాల్సి ఉంటుంది. అప్పుడు కూడా గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని మాత్రమే పీఎంకు వెల్ కం చెప్పారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 8న దాదాపు 11 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా తిరుపతి-హైదరాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ లో 750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భవనానికి శంకుస్థాపన చేశారు. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేకంగా కుర్చీ వేశారు. ఈ మీటింగ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. అదే రోజున సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనలు చేసింది. ఈ ఏడాది మే 26న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇదే రోజున సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. జేడీఎస్ నేత కుమారస్వామితో భేటీ అయ్యారు.
సమాధానం ఒక్కటే!!
కరోనా సమయంలో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ లో కొవిడ్ 19 వ్యాక్సిన్ తయారీని పరిశీలిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు. భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చిన సమయంలో ప్రధాని కార్యాలయం రావొద్దని స్పష్టమైన సందేశం పంపించిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రొటోకాల్ పాటించనందునే తాము అదే పద్ధతిని అవలంబిస్తున్నామని అంటున్నారు. దీనికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని కార్యాలయం అలాంటి సందేశం పంపలేదని, అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోతున్నారని సీఎంవో నుంచే తమకు సమాచారం వచ్చిందన్నారు.
కేసీఆర్ వరంగల్ వెళ్తారా..?
ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ వెళ్తారా..? లేదా..? అన్నది మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులైన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, టెక్స్ టైల్ పార్కుకు, పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు నరేంద్ర మోదీ. వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన అనంతరం వరంగల్ లోని కేయూ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ వెళ్లినా.. వర్చువల్ శంకుస్థాపనల అనంతరం హైదరాబాద్ కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాలుగు పర్యటలనకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఈ సారి వరంగల్ సభకు వెళ్తే బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని కాంగ్రెస్ చేస్తున్న వాదనకు బలం చేకూరే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
- తేదీ కార్యక్రమం కారణం
- ఫిబ్రవరి, 5, 2022 సమతామూర్తి విగ్రహావిష్కరణ, ముచ్చింతల్ జ్వరం
- జూలై 3, 2022 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, నోవాటెల్ ===
- ఏప్రిల్ 8, 2023 వందే భారత్ రైలు ప్రారంభం, పరేడ్ గ్రౌండ్ లో సభ వెళ్లడం లేదని ముందస్తు ప్రకటన
- మే 26,2023 ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవం, గచ్చిబౌలి కుమారస్వామితో భేటీ కోసం బెంగళూరుకు