లక్నోకు లక్‌‌ కలిసొస్తుందా.. మరో 4 రోజుల్లో ఐపీఎల్‌‌–18

లక్నోకు లక్‌‌ కలిసొస్తుందా.. మరో 4 రోజుల్లో ఐపీఎల్‌‌–18

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: కేఎల్‌‌ రాహుల్‌‌ కెప్టెన్సీలో వరుసగా రెండు సీజన్లు ప్లే ఆఫ్స్‌ చేరిన లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ గత ఐపీఎల్‌‌లో ఫ్లాప్ అయింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో ఏడో స్థానంలో నిలిచిన లక్నో ఈ సీజన్‌‌ కోసం సరికొత్తగా రెడీ అవుతోంది. కొత్త కెప్టెన్‌‌, డాషింగ్‌‌ హిట్టర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ను తీసుకుని మరింత బలంగా తయారైన లక్నో ఈసారి ‘లక్‌‌’ను మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఈ నేపథ్యంలో పంత్‌‌ కోసం రికార్డు స్థాయిలో భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన ఫ్రాంచైజీ బ్యాటింగ్‌‌ బలోపేతం కోసం యంగ్‌‌స్టర్స్‌‌కు పెద్ద పీట వేసింది. కెప్టెన్ మారడంతో ప్లేయర్ల ఆట తీరు కూడా మారుతుందని నమ్ముతున్న ఫ్రాంచైజీ ఎలాగైనా తొలి టైటిల్‌‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

బలాలు

ఈసారి లీగ్‌‌ కోసం లక్నో బ్యాటింగ్‌‌ బలాన్ని బాగా పెంచుకుంది. ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌, మిచెల్‌‌ మార్ష్‌‌, నికోలస్‌‌ పూరన్‌‌, డేవిడ్‌‌ మిల్లర్‌‌లాంటి అత్యుత్తమ టీ20 ప్లేయర్లను టీమ్‌‌లోకి తీసుకుంది. ఈ ఫార్మాట్‌‌లో ఎంతో అనుభవం ఉన్న వీళ్లు ఆట గమనంతో పాటు టీమ్‌‌ అదృష్టాన్ని కూడా మార్చే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. డొమెస్టిక్‌ ప్లేయర్లుగా ఆయుష్‌‌ బదోనీ, అర్షిన్‌‌ కులకర్ణి, అబ్దుల్‌‌ సమద్‌‌లో మంచి నైపుణ్యం ఉంది. 

వీళ్లను సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్లందర్ని ఒకే తాటిపై నడిపించేందుకు రిషబ్‌‌ పంత్‌‌ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. తన పవర్‌‌ హిట్టింగ్‌‌ బ్యాటింగ్‌‌తో టీమ్‌‌పై స్పష్టమైన ప్రభావం చూపించడంలో పంత్‌‌ దిట్ట. అనుభవం, యంగ్‌‌ స్టర్స్‌‌తో కూడిన జట్టుకు కెప్టెన్‌‌గా, ఓ ప్లేయర్‌‌గా  పంత్‌‌ సక్సెస్‌‌ అయితే ఐపీఎల్‌‌ రికార్డులు బద్దలుకావడం ఖాయం.
 

బలహీనత

పేస్‌‌ బౌలింగ్‌‌లో అనుభవం లేకపోవడం అతిపెద్ద బలహీనత. టీమిండియా ప్రధాన పేసర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకపోవడం ప్రతికూలాంశం. ఫ్యూచర్‌‌ స్టార్‌‌గా భావిస్తున్న  ఎక్స్‌ప్రెస్ పేసర్ మయాంక్‌‌ యాదవ్‌‌తో పాటు అవేష్‌ ఖాన్‌, మోసిన్ ఖాన్‌ గాయాల నుంచి ఇంకా పూర్తి కోలుకోలేదు.  ఇంకా ఎన్‌సీఏలోనే ఈ ముగ్గురు లీగ్‌కు దూరం అయితే లక్నోకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. 
 

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్‌ మార్ష్‌‌ ఫిట్‌నెస్‌పైగా సందేహాలు ఉన్నాయి. 

తను ఎంతవరకు అందుబాటులో ఉంటారనేది కూడా ప్రశ్నగా కనిపిస్తున్నది.స్పిన్‌‌ కేటగిరీలో రవి బిష్ణోయ్‌‌కు మ్యాజిక్‌‌ చేసే సత్తా ఉన్నా  అతనికి తోడు మరో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం మైనస్‌‌గా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో లక్నో  తుది జట్టు ఎంపికలో కొన్ని ఇబ్బందులు తప్పవు.  

అవకాశం

విదేశీ ప్లేయర్లతో పాటు యంగ్‌‌స్టర్స్‌‌ కూడా రాణిస్తే నాకౌట్‌‌ దశ వరకు వెళ్లొచ్చు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో పంత్‌‌ తర్వాత జట్టును కాపాడే ప్లేయర్లు తక్కువగా ఉండటం కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఐపీఎల్‌‌లాంటి గట్టి పోటీ ఉండే లీగ్‌‌లో ఆల్‌‌రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతానికి టీమ్‌‌లో నిఖార్సైన, నిలకడతో కూడిన ఆల్‌‌రౌండర్లు కనిపించడం లేదు. 

ఇండియన్‌‌ డొమెస్టిక్‌‌ ప్లేయర్లు కూడా ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే టీమ్‌‌ ఇండియాలో చోటు ఆశించొచ్చు. టీమ్‌‌ పెర్ఫామెన్స్‌‌ కంటే ఎక్కువగా రిషబ్‌‌ పంత్‌‌పై ఫోకస్‌‌ ఉంది. కాబట్టి లక్నో జయాపజయాలన్నీ పంత్‌‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

రిషబ్‌‌ పంత్‌‌ (కెప్టెన్‌‌), నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్‌‌ ఖాన్‌‌, మిల్లర్, మార్‌‌క్రమ్‌‌, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్‌‌, ఆకాష్ దీప్, హిమ్మత్‌‌ సింగ్‌‌, ఎం. సిద్ధార్థ్‌‌, దిగ్వేష్‌‌ సింగ్‌‌, షాబాజ్‌‌ అహ్మద్‌‌, ఆకాశ్‌‌ సింగ్‌‌, షామేర్‌‌ జోసెఫ్‌‌, ప్రిన్స్‌‌ యాదవ్‌‌, యువరాజ్‌‌ చౌదరి, హంగార్గేకర్‌‌, అర్షిన్‌‌ కులకర్ణి, మాథ్యూ బ్రెట్జ్‌‌కీ.