- మార్కెట్ యార్డు గోడౌన్లలో కాలేజీ ఏర్పాటుపై ఎన్ఎంసీ అసంతృప్తి
- టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు పూర్తి
- వారం రోజుల్లో నీట్ రిజల్ట్
- పది రోజుల్లో పర్మిషన్ వస్తేనే ఫస్టియర్ అడ్మిషన్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలకు మంజూరైన మెడికల్ కాలేజీ అన్ని ఏర్పాట్లతో ప్రారంభానికి సిద్ధమైంది. అగ్రికల్చర్ మార్కెట్ యార్డు గోదాముల్లో కాలేజీని ఏర్పాటు చేశారు. రూ.14 కోట్ల ఖర్చుతో కాలేజీకి అనుగుణంగా నిర్మాణాలు చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టారు. లెక్చర్ హాల్స్, ల్యాబ్‌లు, హాస్టళ్లు అన్నీ రెడీ చేశారు. అడ్మిషన్ల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్ఎంసీ ప్రతినిధులు కాలేజీని గోడౌన్లలో నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పనులన్నీ అయినప్పటికీ ఈసారైనా పర్మిషన్ ఇస్తారా, లేదా అన్నదే అనుమానంగా మారింది.
పూర్తయిన ఏర్పాట్లు...
కాలేజీ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, క్లరికల్ స్టాఫ్‌ను ఇప్పటికే నియమించారు. 54 టీచింగ్ పోస్టులలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి 48 పోస్టులను భర్తీ చేశారు. ఈ నెల 23న 42 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించారు. వీళ్లంతా ఈ నెలాఖరులో జాయిన్ కానున్నారు. 148 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇందులో శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ టేకర్లు, తదితర నియామకాలను త్వరలోనే పూర్తి కానున్నాయి. అలాగే ఎంబీబీఎస్ ఫస్టియర్‌కు సంబంధించిన బయోకెమిస్ర్టీ, అనాటమీ, ఫిజియాలజీ డిపార్ట్మెంట్లు, లెక్చర్ హాళ్లు, ల్యాబ్‌ల ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. మెన్, ఉమెన్ హాస్టళ్ల కోసం కాలేజ్ రోడ్లో రెండు ప్రైవేట్ బిల్డింగ్లు రెంట్‌కు తీసుకున్నారు. వీటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. క్యాంటీన్ టెండర్లు సైతం పూర్తయ్యాయి.
పది రోజుల్లో పర్మిషన్ వచ్చేనా?
నిరుడు రాష్ర్టంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు శాంక్షన్ కాగా, ఐదింటికి ఎన్ఎంసీ అనుమతులు వచ్చాయి. మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్ కాలేజీలకు ఇంకా పర్మిషన్ రాలేదు. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో నీట్రిజల్ట్ రానుంది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఎంబీబీఎస్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి కాలేజీలో ఫస్టియర్‌లో 150 సీట్లను భర్తీ చేయనున్నారు.
కౌన్సెలింగ్ నాటికి ఎన్ఎంసీ పర్మిషన్ వస్తే స్టూడెంట్లు వెబ్ ఆప్షన్ల ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంచుకొనే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ నుంచి క్లాస్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు ఎన్ఎంసీ పర్మిషన్ రాకుంటే ఈ ఏడాది 150 సీట్లను కోల్పోయినట్టే. అడ్మిషన్లకు మరో ఏడాది ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ విషయమై లోకల్ ఎమ్మెల్యేలు, హెల్త్ మినిస్టర్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం...
మంచిర్యాల మార్కెట్ యార్డు గోడౌన్లలో మెడికల్ కాలేజీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముగ్గురు ప్రతినిధుల ఎన్ఎంసీ బృందం ఫిబ్రవరిలో ఏర్పాట్లను పరిశీలించారు. రెండోసారి జూలైలో వర్చువల్‌గా పరిశీలించారు. వారు సూచించిన విధంగా మార్పులు చేర్పులు చేసి రిపోర్టు పంపించాం. త్వరలోనే పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నాం. - డాక్టర్ ఎండీ. సులేమాన్, ప్రిన్సిపల్
గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: పీస్ కమిటీ మీటింగ్‌లో డీఎస్పీ జీవన్ రెడ్డి
ఖానాపూర్, వెలుగు: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, నిమజ్జనానికి డీజేలను నిషేదిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణ శివారులోని సీఎం రావు ఫంక్షన్ హాల్లో బుధవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల పీస్ కమిటీ సమావేశానికి అయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వహకులు పోలీసులకు సహకరించాలని అన్నారు.
నిమజ్జనం రోజున కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ కోరారు. హిందూ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి గోదావరి వద్ద క్రేన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ బాబు, ఎస్ఐ రజినీకాంత్, తహసీల్దార్ రాజమోహన్ , మాజీ జడ్పీటీసీ రామునాయక్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం పాల్గొన్నారు.
బీపీ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
మంచిర్యాల, వెలుగు: ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు డిమాండ్ చేశారు. బీపీ మండల్ 104వ జయంతిని గురువారం స్థానిక చార్వాక హాల్లో ఘనంగా నిర్వహించారు. బీసీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, బీసీలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజమౌళి, చంద్రమౌళి, మల్లేశ్, రఘురాములు, వెంకటేశ్ పాల్గొన్నారు.
గంజాయిని అరికట్టాలి
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో గంజాయిని పూర్తిగా అరికట్టాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. శాంతిభద్రతలు, నేరాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రేవ్ కేసెస్, నాన్ గ్రేవ్ కేసెస్, మాదకద్రవ్యాల, పోక్సో యాక్ట్, పలు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, వినియోగం పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని చెప్పారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్ రావు, అదనపు ఎస్పీ ఏఆర్ భీమ్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల దీక్ష
ఆసిఫాబాద్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని గత 31 రోజులు వీఆర్ఏలు నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా 32వ రోజు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదన్నారు. 31 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి కొడప వినోద్, ఉపాధ్యక్షుడు విజయ్, నాయకులు కేదారి, స్పందన, చందు, ప్రేమ్ సాగర్, సుధాకర్, స్పందన, శారద, శంకర్, బాలాజీ, నాయకులు పాల్గొన్నారు.
కవితపై ఆరోపణలు సహించం: ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్, వెలుగు : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ , కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూన్నమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జెడ్పీటీసీ రాము నాయక్, నాయకులు గజేందర్, రాజ గంగన్న, చింటు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం ఆయన అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని , ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11 డెంగీ కేసులు నమోదయ్యాయని, టైఫాయిడ్, మలేరియా కేసులు ఉన్నాయన్నారు.
పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాదుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. 12 నుంచి 18 ఏండ్ల పిల్లలకు మొదటి, రెండవ డోసులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోస్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి పాల్గొన్నారు.
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం: డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్
భైంసా, వెలుగు: దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ విధానాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న ఢిల్లీలో నిరసన పోరాటం ఉంటుందన్నారు. ఇందుకోసం నిర్మల్ జిల్లాలోని 19 మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరినీ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమూల్, వెంగల్రావు, ఫిరోజ్ ఖాన్, సాహెబ్రావు పాల్గొన్నారు.
ఓవర్ లోడ్ లారీలు సీజ్
మంచిర్యాల, వెలుగు: ఎపీ నుంచి మహారాష్ట్రలోని బల్లార్షా పేపర్ మిల్లుకు, సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లుకు ఓవర్‌లోడ్ కర్ర తీసుకెళ్తున్న పది లారీలను మంచిర్యాల బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ నరేశ్‌కుమార్, ఎంవీఐ వివేకానందరెడ్డి పట్టుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్‌ను ఉల్లంఘించి ప్రమాదభరితంగా వెళ్తున్నాయని అన్నారు. లారీలను సీజ్ చేసి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి
మంచిర్యాల, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాల అమలు కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుతో పాటు పలు హామీలు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు.
ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తారని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల కలెక్టరేట్ ముట్టడి భగ్నం
స్టూడెంట్ రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
ఆసిఫాబాద్, వెలుగు : ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో చనిపోయిన పదోతరగతి విద్యార్థి అలం రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం స్కూళ్ల బంద్ నిర్వహించి, కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ కు కొద్ది దూరంలో నాయకులను, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐలు రమేశ్, గంగన్న, రాజేశ్వర్ వారిని అదుపు చేశారు. కలెక్టర్ రావాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోలీస్ దౌర్జన్యాలతో ఉద్యమాలు ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు.
జిల్లాలో ఆదివాసి విద్యార్థి మృతి చెందితే కనీసం ప్రజాప్రతినిధులు ,అధికారులు స్పందించకపోవడం దారుణం అన్నారు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం రూ. 15 లక్షల చెల్లించి ,ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సాయికృష్ణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల్కర్ సాయిరాం, కాంగ్రెస్ యువజన సంఘం నాయకుడు మహమ్మద్ ఆసిఫ్, గుండ శ్యామ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
సింగరేణి ఎస్టీపీపీకి మరో అవార్డు
జైపూర్, వెలుగు: పర్యావరణ పరిరక్షణలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు మరో జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అస్సాంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో గ్రీన్ టెక్ ఫౌండేషన్ ద్వారా సింగరేణి ఎస్టీపీపీకి కాలుష్య నియంత్రణ, యంత్రాలు, సామగ్రి విభాగంలో గ్రీస్ టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డు--22 దక్కించుకుంది. ఈ అవార్డును అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్ రవిశంకర్ ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డ్ చైర్మన్ డాక్టర్ అరోప్ కుమార్.. ఎస్టీపీపీ జీఎం(ఈఎం) డీవీఎన్ రాజుకు అందించారు.
మేం అడ్డుకుంటే బీజేపీ నేతలు ఎక్కడా తిరగలేరు
మంత్రి సత్యవతి రాథోడ్
బాసర, వెలుగు : బండి సంజయ్ పాదయాత్రను తాము అడ్డుకోలేదని, అడ్డుకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరుగలేరని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం బాసర అమ్మవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఉన్మాదంతో వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాం డైవర్ట్ కోసమే యాత్రను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోందని, ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాసరకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బాసర సర్పంచ్ లక్ష్మణ్‌రావు పటేల్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.
హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ
భైంసా, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకొనేందుకు వాహనదారులు హెల్మెట్ తప్పకుండా వాడాలని సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. కుభీర్ మండలం పార్డి (బీ) గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడు ఇటీవల మృతి చెందగా.. గురువారం ఆయన బర్త్‌డే కావడంతో అయోధ్య భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భైంసాలోని ఓల్డ్ చెక్‌పోస్టు వద్ద 50 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎం అమృత, ఎస్సైలు శివ, మహేశ్, అయోధ్య భారతి ఫౌండర్ రోహిత్ ధర్మసేన, మధు, యోగేశ్
పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సీపీఎం ధర్నా
మందమర్రి, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రి చెరువు భూములు, సీలింగ్ భూములను కాపాడాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సీపీఎం దాని అనుబంధ సంఘాల లీడర్లు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా సెక్రటరీ సంకె రవి మాట్లాడుతూ ఊరు మందమర్రి చెరువు శిఖం భూములను టీఆర్ఎస్ లీడర్ల అండతో ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. చెరువు విస్తీర్ణం ఇప్పటికే సగానికి తగ్గిందని, భూములు కబ్జాకు అవుతున్న రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వందల ఎకరాల సీలింగ్ ల్యాండ్‌ను ఇండ్లు లేని పేదలకు పంపినీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం మండల సెక్రటరీ దూలం శ్రీనివాస్, లీడర్లు మారపల్లి తిరుపతి, శ్రీపతి రమేశ్, ఉప్పరి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే గిరిజన విద్యార్థి మృతి కారణం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్
కాగజ్ నగర్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోందని, అందుకే పెంచికల్లో రాజేశ్ అనే విద్యార్థి అనారోగ్యంతో చనిపోయాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. స్టూడెంట్ కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. రాజేశ్ మూడు రోజులపాటు జ్వరంతో ఉన్నా స్కూల్ , హాస్టల్ స్టాఫ్ ఎవరూ పట్టించుకోలేని అన్నారు.
సరైన వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి రాజేశ్ మృతికి అధికారులు కారణమయ్యారని ఆరోపించారు. కుటుంబాన్ని ఆదుకొని కుటుంబం లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సోయం చిన్నన్న, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కుమ్మరి తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ తాళ్ల రామయ్య, బీ జె వై ఎం జిల్లా ఉపాధ్యక్షుడు మందాడే సుధాకర్ ఉన్నారు.
స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ పంపిణీ
దండేపల్లి, వెలుగు: మండలంలోని ద్వారక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ స్టడీ మెటీరియల్ గురువారం పంపిణీ చేశారు. వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్లు (బ్యాగులు, బుక్స్) అందించారు. కార్యక్రమంలో ద్వారక సర్పంచ్ గీతారాని,హెచ్ఎం జయప్రద, బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, జిల్లా నాయకులు గుండం రాజలింగం,నవీన్ పాల్గొన్నారు.
సింగరేణి ఎస్టీపీపీకి మరో అవార్డు
జైపూర్, వెలుగు: పర్యావరణ పరిరక్షణలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు మరో జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అస్సాంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో గ్రీన్ టెక్ ఫౌండేషన్ ద్వారా సింగరేణి ఎస్టీపీపీకి కాలుష్య నియంత్రణ, యంత్రాలు, సామగ్రి విభాగంలో గ్రీస్ టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డు--22 దక్కించుకుంది. ఈ అవార్డును అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్ రవిశంకర్ ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డ్ చైర్మన్ డాక్టర్ అరోప్ కుమార్.. ఎస్టీపీపీ జీఎం(ఈఎం) డీవీఎన్ రాజుకు అందించారు.