ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ యత్నం
హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఏరియాలపై ఫోకస్
ఓట్లు చీల్చుతూ వేరే పార్టీలకు ఛాన్స్ ఇవ్వని అధికార పార్టీ
హైదరాబాద్, వెలుగు: పొలిటికల్ గా ఓల్డ్ సిటీ ఎంఐఎం కు కంచుకోట. మిని ఇండియాను తలపించే విధంగా అన్ని మతాలు, ప్రాంతాల వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో ముస్లింలతో పాటు క్యాండిడేట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా మిగతా వర్గాలకు కూడా ఓట్లు ఉన్నాయి. పొలిటికల్ గా మాత్రం ఎంఐఎం తప్ప ఏ పార్టీ అక్కడ పాగా వేయలేకపోతున్నాయి. ఈసారి కచ్చితంగా ఎంఐఎం కంచుకోటకు బీటలు వారేలా చేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కానీ ఇక్కడే ఎంఐఎం పక్కా ప్లాన్ గా వ్యవహరిస్తూ మరో పార్టీకి చాన్స్ ఇస్తలేదు. దశాబ్దాలుగా ఇంకో పార్టీ గెలవకుండా జాగ్రత్త పడుతోంది.
అధికార పార్టీతో దోస్తానా
ఎంఐఎం కంచుకోట బలంగా ఉండేందుకు ప్రధాన కారణం ఆ పార్టీ నేతలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో దోస్తానా చేయటమే. గతంలో కాంగ్రెస్ తో ఇప్పుడు టీఆర్ఎస్ తో జతకట్టి పోటీ లేకుండా చూసుకుంటోంది. ఫ్రెండ్లీ పోటీ అనే పేరుతో ఎంఐఎం కు పోటీగా ఉండే బీజేపీకి వచ్చే ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు అధికార పార్టీ సహకారం పొందుతోంది. ఎక్కడైతే హిందూ ఓట్లు ఎక్కువగా ఉంటాయో…ఎంఐఎం కు కాస్త బలం తక్కువగా ఉంటోందో అదే ప్రాంతంలో ఓట్లు చీల్చేందుకు కావాలనే అధికార పార్టీ క్యాండిడేట్‌ను పోటీలో ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఓల్డ్‌సిటీలో ఎంఐఎం కు సహకరిస్తూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు తమకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.
ప్రత్యర్థుల అవకాశాలకు గండి
ప్రత్యర్థి పార్టీ గెలుపును ప్రభావితం చేయడంతో ఎంఐఎం ఎక్స్ పర్ట్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేసి, ఇతర పార్టీలకు గెలిచే అవకాశాలను లేకుండా దెబ్బతీస్తోంది. కుర్మగూడ డివిజన్ పరిధిలో బీజేపీకి బలం ఉంది. కానీ ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పోటీ పేరుతో రెండు పార్టీలు కంటెస్ట్ చేశాయి. దీంతో బీజేపీకి రావాల్సిన చాలా ఓట్లు టీఆర్ఎస్ చీల్చిందని చెబుతారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 4,637 ఓట్లు రాగా, బీజేపీ 5,679 ఓట్లను గెలుచుకుంది. బీజేపీ ఓట్లు చీలడంతో ఇక్కడ బలం ఉన్నప్పటికీ ఎంఐఎం గెలిచింది.
రియాసత్ నగర్ లో ఎంఐఎంపై పోటీ చేసిన ఎంబీటీ ఓట్లను కూడా చీల్చేందుకే టీఆర్ఎస్ బరిలో నిలిచిందన్న ఆరోపణలున్నాయి. ఎంఐఎం వ్యతిరేక ఓటు ఎంబీటీకి వెళ్లకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోటీలో ఉందంటారు. ఉప్పుగూడ స్థానంలో హిందూ, ముస్లింల ఓట్లు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్ పోటీ లో ఉందంటారు. దాదాపు 4 వేలకు పైగా ఓట్లు టీఆర్ఎస్ కు పోలయ్యాయి. దీంతో బీజేపీ ఓట్లు చీలి ఓటమి పాలైంది. జంగంమెట్ లోనూ ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య గత ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరిగింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ బరిలో ఉండటంతో బీజేపీ ఓటమి పాలైంది. ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అయ్యేలా హిందూ ఓట్లు చీల్చిచేలా ఎంఐఎం, టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఈసారి తక్కువ సీట్లలో పోటీ..
2016లో 53 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఈసారి మాత్రం పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గించుకుంది. 42 డివిజన్ల పరిధిలోనే పోటీ చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ఎంఐఎం సిట్టింగ్ స్థానాలే. ఈ డివిజన్లపై బీజేపీ దృష్టి పెట్టింది. ఎంఐఎం స్థానాలు తగ్గించేందుకు టీఆర్ఎస్, ఎంఐఎం వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆయా స్థానాల్లో క్యాండిడేట్లను రంగంలో ఉంచింది. ఐతే ఎఫెక్ట్ ఎలా ఉంటున్నది వేచి చూడాలి. ఇక్కడ బీజేపీ గెలవాలంటే ఓ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడితే గాని సాధ్యం కాదు.
for more News….
నామ్‌కే వాస్తే ఎంబీసీ కార్పొరేషన్
గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే
సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్ ఏజెంట్లు
కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ
V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు