
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న వక్ఫ్ చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులో మాదిరిగానే.. ముస్లింలను హిందూ మత ట్రస్ట్‌లో భాగం చేయడానికి అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీసింది. కాగా, వివాదస్పద వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన 73 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం (ఏప్రిల్ 16) విచారణ చేపట్టింది.
ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. వక్ఫ్ చట్టంలోని అభ్యంతరాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్ కొత్త చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం కలెక్టర్‌కు ఇచ్చే అధికారాలను కూడా సిబల్ ఎత్తి చూపారు.
కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగమని, ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలాగే.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను కూడా ఆయన కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ముస్లింల హక్కలను కాలరాసే విధంగా పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించారని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులో మాదిరిగానే.. ముస్లింలను హిందూ మత ట్రస్ట్‌లో భాగం చేయడానికి అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా..? వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి..?
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం.. హింసాత్మక ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చట్టంపై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. కేసు తదుపురి విచారణను రేపటకి (2025, ఏప్రిల్ 17) వాయిదా వేసింది.