జాతీయ పరిణామాలు ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా?

జాతీయ పరిణామాలు ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా? చూపుతాయనే చరిత్ర చెబుతోంది. అదే నిజమైతే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఎలా ఉంటాయి? చూపిస్తే చరిత్ర పునరావృతమవుతుందా? పాలకపక్షాలకి 1985 నుంచీ కన్నడ ప్రజలు వరుసగా తిరిగి అధికారం కట్టబెట్టడంలేదు. పరంపర అలాగే సాగితే, భారతీయ జనతాపార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌‌కు పట్టం కట్టాలి. అదే జరగబోతోందని అన్ని సర్వేలూ చెబుతున్నాయి. కాదు, మళ్లీ గెలుపు మాదే అని బీజేపీ ఢంకా భజాయిస్తోంది. మే10న ఎన్నికలు,13న ఫలితాలని భారత ఎన్నికల సంఘం నగారా మోగించడంతో అందరి చూపూ అటు వైపు మళ్లింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలక-ప్రతిపక్షాలూ కర్ణాటకలో తమకు అనుకూలించే ఫలితాలొస్తాయనే ఆశతో ఉన్నాయి. ఇంతకీ కన్నడనాట ప్రజానాడి ఏంటి ?

తత్వవేత్తల నుంచి తార్కికుల వరకు అందరూ అంగీకరించే అంశం కాలం మహా మహిమగలదని. అంతటి మహత్తు కలిగిన కాలం.. కీలక ప్రస్థానంలో కర్నాటక శాసనసభకు ఎన్నికలొచ్చాయి. దేశంలో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌లు ముఖాముఖి ఎన్నికలకు తలపడే రాష్ట్రమిది. జనతాదళ్‌‌ (ఎస్‌‌) కూడా రాష్ట్రంలో ఒక శక్తిగా ఉన్నా.. ప్రధానంగా ఒక ప్రాంతానికి, ఆధిపత్యపరంగా ఓ సామాజికవర్గానికి ఆ పార్టీ పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్త ప్రభావమున్న పార్టీయేం కాదు. ఎలా చూసినా, ఈ రాష్ట్ర ఎన్నిక గెలవటం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌‌కు అత్యవసరం. అందుకే, ఆ రెండు పార్టీల నాయకత్వమే కాక మొత్తం దేశం అటు చూస్తోంది. ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. గడచిన అయిదేళ్లుగా అక్కడి పరిణామాలకు తోడు అఖిల భారతస్థాయిలో ఇటీవలి తాజా ఘటనలు, పర్యవసానాలు ఈ ఎన్నికల నేపథ్యంలో చర్చకు వస్తున్నాయి. మున్నెన్నడు లేనంత బలంగా దేశమంతటికీ విస్తరించిన బీజేపీ దక్షిణాదిన పాలనలో ఉన్నది కర్ణాటకలోనే! ఈ క్షేత్రం నుంచే చుట్టుపక్కల రాష్ట్రాలకు విస్తరించాలన్నది వ్యూహం. అలాంటిది, ఇక్కడే ఓడితే.. మొత్తం దక్షిణాదిలోనే లేనట్టవుతుంది. పైగా కిందటి సారి, ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని (మ్యాజిక్‌‌ ఫిగర్‌‌ 113/224) స్థానాలు రాక, గద్దెనెక్కీ వెనువెంటనే అధికారానికి బీజేపీ దూరమైంది. తర్వాత ఎత్తులు -వ్యూహాలతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందనే విమర్శ ఉంది. దాన్ని తుడిపేసుకోవడానికి ఇప్పుడు నేరుగా సర్కారు ఏర్పాటుకు సరిపోయే సంఖ్య కావాలి. కానీ, పరిస్థితి అలా లేదని, కాలం గడుస్తున్న కొద్దీ ప్రజాదరణ తగ్గి తక్కువ స్థానాలే దక్కే వాతావరణం కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌‌ వెలువడ్డ రోజే వచ్చిన తాజా, సీ-ఓటర్‌‌ సర్వే కూడా అదే చెప్పింది. 115-–127 స్థానాలు కాంగ్రెస్‌‌కు, 68–80 స్థానాలు బీజేపీకి దక్కవచ్చని చెప్పింది. ఇప్పట్నుంచి పోలింగ్‌‌ రోజులోపైనా పరిస్థితిని మార్చుకోవాలన్నది బీజేపీ ప్రయాస. అవినీతి, నిరుద్యోగిత, ధరల పెరుగుదల ఇప్పటికీ ప్రతికూలంగా పనిచేయొచ్చు!

కలిసొచ్చే అంశాలే ఎక్కువ

ఇవాళున్న పరిస్థితిలో సొంత శక్తియుక్తులకన్నా కలిసొచ్చే అంశాలే కాంగ్రెస్‌‌కు లాభించనున్నాయి. గత డిసెంబరు చివర్లో జరిపిన ‘పీపుల్స్‌‌ పల్స్‌‌’ సర్వే నాటికే కాంగ్రెస్‌‌ ఆధిక్యతలో ఉంది. వారికి వంద స్థానాలు దాటుతాయని, బీజేపీ 90 స్థానాలకు పరిమితమౌతుందని ఆ సర్వే చెప్పింది. నాటి నుంచి .. బీజేపీ సర్కారు ప్రతిష్ఠ రోజురోజుకు సన్నగిల్లుతుంటే, మరోవైపు కాంగ్రెస్‌‌ పరిస్థితిని పలు పరిణామాలు మెరుగుపరిచాయి. వారి గ్రాఫ్‌‌ పైకే వెళుతోందని తాజా సర్వే కూడా చెప్పింది. పార్టీ అంతర్గత తగాదాలు, అనైక్యత మినహాయిస్తే.. మున్ముందు కూడా వారికి అనుకూలించే అంశాలే ఎక్కువ. గట్టి పార్టీ వ్యవస్థ, యంత్రాంగం ఉంది. ప్రత్యర్థి బీజేపీ కనుక, మైనారిటీ, -ఈబీసీ, దళిత ప్రాధాన్యతతో జరిపే సోషల్‌‌ ఇంజనీరింగ్‌‌ కాంగ్రెస్‌‌కు అనుకూలాంశమే! దేశంలోని పలు రాష్ట్రాల్లోలాగే అసదుద్దీన్‌‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌‌ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తుంది. కానీ, ప్రభావానికి ఆస్కారం తక్కువ. అందులోనూ, ఈబీసీ లోని 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌‌ను సర్కారు తొలగించి, లింగాయత్‌‌, వక్కలిగలకు సమానంగా పంచిన సాహస నిర్ణయం ముస్లిముల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఫలితంగా వారంతా బీజేపీని ఓడించే పార్టీ వైపు మొగ్గే కసితో ఉన్నారు. మజ్లిస్‌‌ను లెక్కచేయకుండా కాంగ్రెస్‌‌ వైపే ఏకీకృతమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ‘ఎస్సీ రిజర్వేషన్​లో వర్గీకరణ’ను వ్యతిరేకిస్తున్న వర్గాలూ కాంగ్రెస్‌‌వైపు మొగ్గనున్నాయి. రాహుల్‌‌ జరిపిన భారత్‌‌ జోడో యాత్ర ప్రభావం ఉంది. దానికి తోడు గాంధీ,- నెహ్రూ కుటుంబేతరుడిగా పార్టీ అధ్యక్షపగ్గాలు ఇదే రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున్‌‌ ఖర్గే వంటి నాయకుడికి అప్పగించిన నేపథ్యంలో, సామాన్య-దళిత సానుకూలత కాంగ్రెస్‌‌కు లాభించనుంది. గత ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రంలో చేసిన ‘కోలార్‌‌’ ప్రసంగంపై అభ్యంతరాలే.. ఆయన్ని కోర్టుకీడ్చి, శిక్షకు కారణమై, చివరకు పార్లమెంటు నుంచే బయటకు పంపించటం వల్ల పుడుతున్న సానుభూతి, ఈ ఎన్నికల్లో తప్పక ప్రభావితం అవుతుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. కాంగ్రెస్‌‌ ఇచ్చిన హామీలు కొంత ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ గెలుపు.. వచ్చే నవంబరులో ఎన్నికలకు వెళ్లే రాజస్థాన్‌‌, మధ్యప్రదేశ్‌‌, చత్తీస్‌‌ఘడ్‌‌, చివరకు తెలంగాణలోనూ నాయకులు, కార్యకర్తల మనో స్థయిర్యాన్ని పెంచుతుందని కాంగ్రెస్​పార్టీ ఆశిస్తోంది.

ప్రభావాలు పాక్షికమే!

కర్ణాటక ఎన్నికల్లో గెలుపోటములు ఇరుగుపొరుగు రాష్ట్రాలపై చూపే ప్రత్యక్ష రాజకీయ ప్రభావం తక్కువే! మహా అంటే, ఆయా పక్షాల మిత్రుల నైతిక బలం పెరగటం, తరగటం, ఆర్థిక సహాయాల లభ్యత, దొరక్కపోవడం వంటి ప్రభావాలుండొచ్చు. కానీ, ఆ ఫలితాలతో ఇక్కడ ఏమేమో అయిపోతుందన్నట్టు ఆయా పార్టీలు ఊహలు అల్లుకుంటున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ విస్తరిస్తున్న బీఆర్‌‌ఎస్‌‌, అక్కడ జేడీ(ఎస్‌‌) తో కలిసి కొన్ని స్థానాల్లో పోటీ చేసే ఆసక్తినీ ముందు కనబర్చింది. కానీ, కనీస సంప్రదింపులు లేకుండా కుమారస్వామి ఏకపక్షంగా తమ అభ్యర్థుల్ని ప్రకటించడం నచ్చక, బీఆర్‌‌ఎస్‌‌ ఆవిర్భావ సభకు ఆయన్ని కనీసం ఆహ్వానించలేదు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ పోటీ అనుమానమే! వచ్చే ఏడాది జరగనున్న ఏపీ ఎన్నికలపై ఈ ఫలితం చూపే ప్రభావం కూడా నామమాత్రమే! కర్ణాటకలో అంతర్గతంగా వ్యక్తుల పరమైన ప్రభావం కొంతమేర ఉంటుంది. ఏ సర్వేలో అయినా.. ముఖ్యమంత్రి పదవికి వ్యక్తిగతంగా సిద్ధరామయ్య (కాంగ్రెస్‌‌) బహుళ ప్రజాదరణతో ఉన్నారు. ఒక ఎమ్జీఆర్‌‌లా, ఒక ఎన్టీఆర్‌‌, వైఎస్‌‌ఆర్‌‌ లాగా పేదలపక్షపాతిగా ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి  బొమ్మై  అయినా, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కుమరస్వామిలైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీపీసీసీ నేతగా దూకుడు స్వభావం కలిగిన డీకే శివకుమార్‌‌ ఈ పట్టికలో అట్టడుగున ఉన్నారు. ఆయన కార్లో వెళుతూ దారిలో నోట్లు చల్లుతుండగా తీసిన తాజా వీడియో వైరల్‌‌ కావడం సమకాలీన ఎన్నికల అవలక్షణాలకు అద్దం పట్టింది. వాటిని.. ఎన్నికల సంఘం ఏ మేరకు నియంత్రించగలుగుతుంది అన్నది కోటి రూకల ప్రశ్న!

జేడీ(ఎస్‌‌) కింగా? కింగ్‌‌ మేకరా?

కర్ణాటక రాజకీయాల్లో ఎస్సార్‌‌ బమ్మై, రామకృష్ణ హెగ్డేల కాలం నుంచీ జనతాపార్టీది హవా! జనతాపార్టీ చీలిక తర్వాత జేడీ(ఎస్‌‌) ఇక్కడ స్థిరపడిపోయింది. దానికి నేతృత్వం వహిస్తూ దేవెగౌడ ఏకంగా ఈ దేశ ప్రధాని అయ్యారు. ఆయన తనయుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీ (104) గా అవతరించి ఆశతో ఏర్పరచిన సర్కారు నిలువక, 37 స్థానాలు గెలిచిన జేడీ(ఎస్‌‌) కు కాంగ్రెస్‌‌ (80) మద్దతు లభించి కుమారస్వామియే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముచ్చట 14 నెలలు కాగానే, అందులో అసమ్మతి నాయకుల్ని బీజేపీ లాగి, రాజీనామాలు చేయించి (15), మళ్లీ గెలిపించుకోవడం (12) ద్వారా సొంతంగా సర్కారు ఏర్పరచుకోవడం ఒక చరిత్ర! ఇప్పటికీ దక్షిణ కర్ణాటక (పూర్వపు మైసూర్‌‌) ప్రాంతంలో, బలమైన వక్కలిగ సామాజికవర్గంలో జేడీ(ఎస్‌‌) కి గట్టి పట్టుంది. మూడు నెలల కింద ‘పీపుల్స్‌‌ పల్స్‌‌’ సర్వే 29 స్థానాలు వారికి రావొచ్చని చెబితే, తాజా సర్వే 23–-25 స్థానాలు గెలవొచ్చని చెప్పింది. అందుకే, బీజేపీ ఇక్కడ ఫోకస్‌‌ పెంచింది. స్థానిక నాయకత్వంపై వ్యతిరేకత దృష్ట్యా, సమర్థ ప్రధాని మోడీ అంటూ ఆయన కార్డు విరివిగా వాడుతూ, పార్టీ జాతీయస్థాయి సీనియర్‌‌ నాయకుల్ని తరచూ ఈ ప్రాంతంలో (89 స్థానాలు) తిప్పుతూ ఆధిపత్యం కోసం పెనుగులాడుతోంది. జేడీ(ఎస్‌‌)కు ఉన్న గొప్ప వెసలుబాటు ఏమంటే, వారు కాంగ్రెస్‌‌, బీజేపీ లలో ఎవరితోనైనా చేతులు కలుపగలరు. వీలయితే ముఖ్యమంత్రి, లేదంటే మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందగలరు. కుటుంబ-వారసత్వ రాజకీయాలనే విమర్శా వారిపై ఉంది.

- ఆర్‌‌‌‌‌‌‌‌. దిలీప్‌‌‌‌‌‌‌‌ రెడ్డి,
పొలిటికల్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌, 
పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ.