కేసీఆర్ జాతీయంలోకి వెళ్తే.. రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తరు?

కేసీఆర్ జాతీయంలోకి వెళ్తే.. రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తరు?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్​ వంటి నాయకులను కలిసిన కేసీఆర్.. తాజాగా మహారాష్ట్ర వెళ్లి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్  శరద్ పవార్ ను కలిసి వచ్చారు. కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. చాలా రోజులుగా వినిపిస్తున్నట్టుగా కొడుకు కేటీఆర్​ను సీఎం చేసి నేషనల్​ పాలిటిక్స్​లోకి వెళతారా? ఇలాంటి ప్రచారాలను గతంలో చాలాసార్లు కొట్టిపారేసిన కేసీఆర్ మరో 10 ఏండ్లు తానే సీఎంగా ఉంటానని చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే మాత్రం కేసీఆర్​ సీఎం సీటు నుంచి దిగకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను సీఎం చేస్తే టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ప్రతిపక్షాలు బలపడతాయా? ముందస్తుకు వెళ్తే లాభమా? ఇలా అన్ని విధాలా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి పదో తేదీన ఈ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాల ఆధారంగానే దేశ భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్​ ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. పదేండ్లు అధికారంలో ఉండటంతో వచ్చే లోక్​సభ ఎన్నికల నాటికి బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత కాస్త ఎదురుకావచ్చు. మరోవైపు ప్రాంతీయ పార్టీలు క్రమంగా బలపడుతున్నాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్​ కూడా దూకుడుగా తమ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంటరవ్వడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. థర్డ్ ఫ్రంట్ కు రూపకల్పన చేసి తానే లీడ్ చేసేలా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. మిగతా ప్రాంతీయ పార్టీల సహకారం ఎలా ఉన్నా.. మోడీకి తానే ప్రత్యామ్నాయమని దేశ ప్రజల్లో ఒక మెస్సేజ్ వెళ్లేలా కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ సహకారం లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే.. ప్రధాని పదవి వరించకపోయినా.. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ ప్రకటనపై విమర్శలు.. ప్రతివిమర్శలు
జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నట్టుగా కేసీఆర్ ప్రకటన చేయగానే కాంగ్రెస్, బీజేపీ టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డాయి. హస్తంతో దోస్తానా అని బీజేపీ, కాషాయంతో కలిసి ఉంటున్నాడని కాంగ్రెస్ ఇప్పటికే కేసీఆర్​ను విమర్శిస్తున్నాయి. ఇక్కడ రెండు పార్టీల ఆరోపణలను కొట్టిపారేయలేని పరిస్థితి. కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను కలుస్తూ, యూపీఏను బలహీనపర్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనక మోడీ హస్తం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ అడుగులు కూడా అలాగే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయని బీజేపీ చెబుతోంది. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన కామెంట్లను కేసీఆర్ ఖండించడం ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ అంటోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం తామే అని రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ ఒంటరిగా ఉంటుందా.. ఏ పార్టీతోనైనా కలిసి వెళ్తుందా అంటే.. అది కేసీఆర్ చెబితేనే తెలిసేది.

జాతీయ పార్టీల మద్దతు ఉంటేనే..
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని చరిత్ర చెబుతోంది. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌‌‌‌ సభలో 543 స్థానాలకుగానూ కనీసం 272 స్థానాలను కలిగి ఉండాలి. అంటే ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమనే చెప్పవచ్చు. గతాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే వాటికి సైతం ఈ రెండు జాతీయ పార్టీలు బయటి నుంచి మద్దతిచ్చాయి. 1989–91లో నేషనల్ ఫ్రంట్, 1996–98లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జనతాదళ్ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా 1989 డిసెంబర్​లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. నేషనల్​ ఫ్రంట్​లో ఎన్టీఆర్​ కీలకపాత్ర పోషించారు. అప్పుడు బీజేపీ, లెఫ్ట్​ పార్టీలు బయటి నుంచి ఈ కూటమికి మద్దతు అందించాయి. 1990లో వీపీ సింగ్ బలపరీక్షలో ఓడిపోగా, జనతాదళ్ నాయకుడు చంద్ర శేఖర్ ఆ పార్టీ నుంచి వేరుపడి, సమాజ్‌‌‌‌వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో చంద్రశేఖర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ నాయకుడు దేవెగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ తో విభేదాలు రావడంతో దేవెగౌడ బలపరీక్షను ఎదుర్కొని ఓడిపోయారు. ఆయన స్థానంలో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో గుజ్రాల్ కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో యునైటెడ్ ఫ్రంట్‌‌‌‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కన్వీనర్‌‌‌‌గా వ్యవహరించారు.

2019లోనూ థర్డ్​ ఫ్రంట్​ ప్రయత్నాలు
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్  అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌‌‌‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇలా ప్రాంతీయ పార్టీల అధినేతలను చాలా మందిని కలిశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్​ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ కాస్త సీరియస్ గానే థర్డ్​ ఫ్రంట్​ అంశంలో కేసీఆర్​ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే స్టాలిన్, తేజస్వీ యాదవ్, మమతాబెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే వంటి నేతలను కలిశారు. ఉత్తరప్రదేశ్​లో అఖిలేశ్ యాదవ్ కు మద్దతు పలికారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న టీఆర్ఎస్ అధినేత నిర్ణయం సరైనదేనా? వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు కలిసొస్తాయా? అనేది మరికొద్ది రోజులు ఆగితేనే తెలుస్తుంది.

రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తరు?
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇలాంటి వార్తలను చాలాసార్లు కేసీఆర్ ఖండించారు. మరో పదేండ్ల వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కేసీఆర్​ స్పష్టం చేసినందున రాష్ట్రాన్ని కేటీఆర్ కు అప్పగించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారమైతే 2023 డిసెంబర్ లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఇప్పుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే అప్పటి వరకు నిలదొక్కుకొని ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అప్పటి వరకు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలిసి థర్డ్ ఫ్రంట్ బలోపేతంపై దృష్టి పెట్టొచ్చని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
- ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్