నక్సలిజం చరిత్రగా మిగలనుందా?

నక్సలిజం చరిత్రగా మిగలనుందా?

భారతదేశంలో నక్సలిజం ఇక చరిత్రగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సగం రాష్ట్రాలకు విస్తరించి ప్రభుత్వాలను కుదిపేసిన నక్సలైట్ గ్రూపులు, ముఖ్యంగా మావోయిస్టు దళాలు ఇప్పుడు క్రమంగా బలహీనపడుతూ ఉనికిని కోల్పోతున్నాయి.  కేంద్ర  హోంశాఖ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా సాయుధ మావోయిస్టుల సంఖ్య వెయ్యికిలోపే ఉందని అంచనా.  

2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 1967లో  పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని  నక్సల్బరీ  గ్రామంలో  నక్సలిజం పుట్టుకొచ్చింది.  భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా  రైతులు, గిరిజనులు చేపట్టిన ఉద్యమం క్రమంగా  కమ్యూనిస్టు సిద్ధాంతాల  ప్రభావంతో  సాయుధ పోరాటంగా మారింది.  

చారు మజుందార్,  కను సన్యాల్ నేతృత్వంలో ఇది భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్- లెనినిస్ట్)గా మారింది.  1970ల నాటికి ప్రభుత్వ నిర్బంధ చర్యల కారణంగా మొదటి నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది. అయితే, 1980లలో  ఇది మరల పునరుజ్జీవం పొందింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కొండపల్లి సీతారామయ్య ‘పీపుల్స్ వార్ గ్రూప్’ (పీడబ్ల్యూజీ)ను స్థాపించగా, బిహార్, జార్ఖండ్‌‌‌‌లో  మావోయిస్టు కమ్యూనిస్టు కేంద్రం (ఎంసీసీ) ప్రభావం పెరిగింది. వీరి ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించింది.

తీవ్రస్థాయికి నక్సలిజం

2000 తర్వాత నక్సలిజం అత్యంత తీవ్రస్థాయికి చేరుకుంది. 2004లో  పీపుల్స్ వార్ గ్రూప్,  ఎంసీసీ కలిసి భారతదేశ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా  మారాయి.  దీని ఫలితంగా ‘రెడ్ కారిడార్’ విస్తృతమైంది. 2010లో చత్తీస్‌‌‌‌గఢ్  దంతేవాడలో జరిగిన దాడిలో 76 మంది  సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 

2013లో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో  కాంగ్రెస్  నేతల  హత్యలతో  మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలను మరింత ఉధృతం అయ్యాయి.  దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం  ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ను  ప్రారంభించి భారీ ఎత్తున భద్రతా దళాలను వినియోగించింది.  2014 తర్వాత నక్సలిజం తగ్గుముఖం పట్టింది. 

అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపు, విద్య, ఉపాధి అవకాశాల పెరుగుదల వల్ల నక్సలైట్ ఉద్యమానికి  ప్రజా మద్దతు తగ్గింది. 2017లో  ప్రారంభమైన ‘ఆపరేషన్ సమాధాన్’ ద్వారా  మావోయిస్టు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొందరు ఎన్‌‌‌‌కౌంటర్లలో మరణించారు. 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రధాన అడ్డాగా ఉన్న చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో భద్రతా దళాల కట్టుదిట్టమైన చర్యలతో వీరి ప్రాబల్యం మరింత తగ్గిపోతోంది.  రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల పెరుగుదలతో  గ్రామీణ ప్రజలు మావోయిస్టుల పట్ల ఆసక్తి కోల్పోయారు.  ప్రభుత్వ వ్యూహాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సీఆర్పీఎఫ్,  కోబ్రా ఫోర్స్, ఇతర ప్రత్యేక దళాలను నక్సలైట్  ప్రభావిత  ప్రాంతాల్లో వినియోగించాయి.    

ప్రభుత్వ చర్యలతో వీరి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ పథకాల వల్ల పలువురు నక్సలైట్లు లొంగిపోయారు. సాంకేతికత, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల యువత నక్సలిజంలో చేరడాన్ని తగ్గించింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, నక్సలిజం చరిత్రగా మారే దశలో ఉంది. 

ఎందుకు విఫలమైంది?

నక్సలిజం దేశవ్యాప్తంగా విస్తరించినా, దీర్ఘకాలికంగా అది విజయవంతం కాలేదు. దీనికి ముఖ్య కారణం ప్రజా మద్దతు కోల్పోవడం.  మొదట భూస్వాముల దోపిడీ వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైనా, కాలక్రమేణా మావోయిస్టులు సామాన్యులపై  హింసకు పాల్పడటంతో ప్రజా మద్దతు తగ్గిపోయింది.  గ్రామీణ ప్రజలు అభివృద్ధి, శాంతిని కోరుకున్నారు.  సాయుధ పోరాట మార్గం ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉండటంతో ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

-  శ్రీనివాస్ గౌడ్ ముద్దం, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్​-