ఉత్తర ప్రదేశ్ ఎన్నికల రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. పశ్చిమ యూపీలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే జాట్‌లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుమారు 200 మంది జాట్ వర్గ నేతలు, పెద్దలతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మనోగతాన్ని వినేందుకు, సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఏ క్షణమైనా తన ఇంటికి రావొచ్చని చెప్పారు. అయితే జయంత్ చౌదరి రాంగ్ ప్లేస్‌ను ఎంచుకున్నారని, బీజేపీ తలుపులు ఆయనకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని షా ఆహ్వానించారు. మరో వైపు బీజేపీకి ప్రధాన పోటీదారుగా సవాలు విసురుతున్న సమాజ్‌వాదీ పార్టీ.. జాట్ నేత, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరితో పొత్తు కుదుర్చుకోవడంపై అమిత్ షా పై కామెంట్స్ చేశారు. అయితే అమిత్ షా మొన్న చేసిన వ్యాఖ్యలపై జయంత్ చౌదరి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. జాట్‌లకు తలుపులు తెరిచే ఉంటాయన్న కామెంట్స్‌ను జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తప్పుబట్టారు. ఇది కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసేందుకు, జాట్‌లను ఒంటరి చేసేందుకే అమిత్ షా అలా అన్నారని జయంత్ చౌదరి ఆరోపించారు. తాను అమిత్ షా ఆహ్వానాన్ని ఎప్పటికీ ఆమోదించబోనని, బీజేపీతో జట్టు కట్టే సమస్యే లేదని చెప్పారు. అమిత్ షా ఆహ్వానించాల్సింది తనను కాదని, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతులకు సంబంధించిన కుటుంబాలను అని సూచించారు.
ముస్లిం ఓట్లను అడ్డుకునేందుకే షా ఆహ్వానం
బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న కామెంట్స్ ద్వారా తాను అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా బీజేపీతో పొత్తుకు వెళ్తానని అమిత్ షా సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని జయంత్ చౌదరి అన్నారు. ఇలాంటి సంకేతాలతో తమ పార్టీ అభ్యర్థులకు ముస్లిం ఓటర్లను దూరం చేయడమే షా లక్ష్యమని, అందుకే తనకు అటువంటి ఆహ్వానాన్ని ముందు పెట్టారని ఆరోపించారు. ముస్లిం ఓట్లు చీలిపోయి బీఎస్పీ లేదా ఎంఐఎం పార్టీలకు వెళ్లాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. హర్యానాలో చేసినట్లుగానే యూపీలో కూడా జాట్‌లను ఒంటరి చేయాలన్నదే అమిత్ షా వ్యూహమని, అటువంటిది తాను జరగనివ్వనని జయంత్ చెప్పారు. యూపీ ఎన్నికలే కాదు.. ఎప్పటికీ బీజేపీతో జత కట్టబోనని, కావాలంటే తాను రాసిస్తానని , బీజేపీతో కలిస్తే తమ పార్టీ నాశనమైపోతుందని ఆయన అన్నారు. తన తండ్రి అజిత్ చౌదరి బీజేపీ ఘోరంగా అవమానించిందని, అదే తనకు గుణపాఠం లాంటిదని అన్నారు.
నెక్స్ట్ టార్గెట్ రాజస్థాన్
పశ్చిమ యూపీలోని రైతులకు బీజేపీ చాలా హామీలిచ్చిందని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, దేశ వ్యాప్తంగా రైతుల అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు ఓ పోరాట వేదిక లాంటివని జయంత్ చౌదరి చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత ఆర్ఎల్డీ పార్టీ దేశమంతా పెద్ద స్థాయిలో ముందుకు వెళ్లనుందని, యూపీ ఎన్నికలు ముగిశాక ఆర్‌ఎల్డీ తన దృష్టిని రాజస్థాన్‌పై పెట్టనుందని తెలిపారు.