- నన్ను అవమానించారు.. ఇక ఆంధ్ర జట్టుకు ఆడను
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీరుపై హనుమ విహారి గుస్సా
- మ్యాచ్‌లో ఓ లీడర్ కొడుకుపై అరవడంతో కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆరోపణ
బెంగళూరు: టీమిండియా క్రికెటర్, తెలుగు ఆటగాడు హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనను తీవ్రంగా అవమానించిన ఆంధ్ర జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ను రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేయాలని ఏసీఏ తనను ఒత్తిడి చేసిందని తెలిపాడు. ఆ మ్యాచ్ సందర్భంగా టీమ్‌లో17వ ప్లేయర్‌పై (కీపర్ పృథ్వీరాజ్)ఆగ్రహం వ్యక్తం చేశానని, దాంతో రాజకీయ నాయకుడైన తండ్రి ద్వారా అతను ఏసీఏ తనపై చర్యలు తీసుకునేలా చేశాడని తెలిపాడు.
‘తొలి మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ అయిన బెంగాల్‌పై 410 రన్స్‌ను టార్గెట్ చేశాం. మ్యాచ్ తర్వాత నా తప్పు ఏమీ లేకున్నా ఏసీఏ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని ఆదేశించింది. గత ఏడు సీజన్లలో ఆంధ్రను ఐదుసార్లు నాకౌట్‌కు చేర్చి, గతేడాది గాయాలను సైతం లెక్క చేయకుండా జట్టు కోసం ఒంటి చేతితో బ్యాటింగ్ చేసిన నాకంటే ఏసీఏకు ఆ ఆటగాడే ఎక్కువయ్యాడు. అయినా ఆటపై ఉన్న గౌరవంతో ఈ సీజన్ మొత్తం ఆడాను. ఏసీఏ తీరుతో నేను చాలా బాధపడ్డా. అవమానపడ్డా. నా ఆత్మాభిమానం కోల్పోయినందున ఆంధ్రకు మళ్లీ ఆడవద్దని నిర్ణయించుకున్నా’ అని విహారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తొలి మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో చెబుతూ జట్టు ప్లేయర్లంతా సంతకం చేసిన లెటర్‌ను షేర్ చేశాడు. మధ్యప్రదేశ్‌తో క్వార్టర్ ఫైనల్లో ఓడిన తర్వాత విహారి చేసిన ఈ పోస్టు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అదంతా అబద్దం: పృథ్వీరాజ్
విహారి ఆరోపణలను పృథ్వీరాజ్ ఖండించాడు. ‘విహారి ఆరోపించిన ఆ ప్లేయర్‌ను నేనే. నా గురించి మీరు విన్నదంతా అబద్దం. ఆ రోజు ఏమైందో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు. చాంపియన్‌గా చెప్పుకునే నువ్వు ఇంతకుమించి ఏమీ చేయలేవు. కావాలనుకుంటే నువ్వు ఇలాంటి సింపతీ గేమ్స్ ఆడుకోవచ్చు’ అని విహారిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, పృథ్వీరాజ్ తండ్రి తిరుపతిలో ఓ వార్డు కార్పొరేటర్ అని తెలుస్తోంది.