
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై, ప్రధానంగా చైనాపై భారీ టారిఫ్‌లు ప్రకటించి ట్రేడ్ వార్‌కు దిగిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తాజాగా టారిఫ్‌ల అంశంపై భిన్నంగా స్పందించారు. చైనాపై టారిఫ్‌లను మరింతగా పెంచుతూ పోవడానికి తాను సంకోచిస్తున్నానని తెలిపారు. టారిఫ్‌లను పెంచుతూ పోతే.. ఒక దశలో రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
విపరీతంగా టారిఫ్‌లు పెరిగితే సంబంధిత వస్తువులను కూడా ఎవరూ కొనుగోలు చేయరని, అందుకే మరీ ఆ స్థాయికి వెళ్లకూడదని అనుకుంటున్నట్టు చెప్పారు. కొనుగోళ్లు కొనసాగేలా చూసేందుకు టారిఫ్‌లపై ఆ స్థాయి కంటే తక్కువకు కూడా తాము వెళ్లొచ్చన్నారు. గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయిన సందర్భంగా వైట్ హౌస్ లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. తమతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు చైనా పదే పదే సంప్రదింపులు జరుపుతోందని ఆయన వెల్లడించారు.
అయితే, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ నేరుగా సంప్రదించారా..? లేక చైనీస్ అధికారులు సంప్రదించారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జిన్ పింగ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇకముందూ అవి కొనసాగుతాయని భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. చైనా నుంచి అత్యున్నత వర్గాలే ట్రేడ్ డీల్ కోసం తనను సంప్రదించినట్టు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ చైనాపై ట్రంప్ 245% టారిఫ్ లను ప్రకటించారు.
ఈ టారిఫ్‌లలో 125% ప్రతీకార సుంకాలు, ఫెంటానిల్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి 20% టారిఫ్, నిర్దిష్ట వస్తువులపై సెక్షన్ 301 టారిఫ్‌లు 7.5% నుండి 100% వరకు ఉన్నాయి. బదులుగా చైనా కూడా అమెరికాపై 125% సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది. ట్రంప్ టారిఫ్ లను సవాల్ చేస్తూ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)లో దావా కూడా వేసింది.