తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకింత కీలకంగా మారుతున్నాయి? ప్రజలు ఉప ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ప్రతి ఉప ఎన్నికను ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నది? పరిపాలన బాగుంటే ఉప ఎన్నికలంటే ఎందుకంత భయం? రాష్ట్రంలో కేసీఆర్ఏకపక్ష పాలనకు అలవాటు పడిపోయారు. కాబట్టి అది ఏ చిన్న ఎన్నికైనా సీరియస్‌గా తీసుకుంటారు. ప్రతిపక్షం లేకపోవడమే తన ఏకపక్ష పాలనకు శ్రీరామ రక్ష అనే భావన ఆయనలో తొమ్మిదేండ్లుగా మనకు కనిపిస్తూ వస్తున్నదే. 2014లోనే ఉద్యమ పార్టీ అధినేత, ఇక నుంచి తమది ఫక్తు రాజకీయ పార్టీయే అని స్వయంగా ప్రకటించుకున్నారు. అయినా ప్రజలు మాత్రం దాన్ని ఉద్యమపార్టీగానే గెలిపించి అధికారం కట్టబెట్టారు. దాంతో ప్రజలను ఓడించి తాను గెలిచాను అనే భావన కేసీఆర్‌లో బాగా పెరిగింది. అప్పటి నుంచి కేసీఆర్ సాగించింది ఆకాంక్షల పాలన కాదు, ఫక్తు రాజకీయ పాలనే. ఆయన ప్రతిపక్ష రహిత పాలన కోరుకున్నారు. అందుకే మొదటి విడత పాలనలోనే ఆ కార్యానికి శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకొని ప్రతిపక్షాలను చావుదెబ్బ తీశారు. ప్రజలు బలమైన ప్రతిపక్షంగా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులే పార్టీ ఫిరాయించడం తెలంగాణ రాజకీయాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. రెండో విడత పాలనలోనూ మరోసారి12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని తన ఏకపక్ష రాజకీయాలను మరింత బలపరుచుకున్నారు. దీంతో చట్టసభల్లో ప్రతిపక్షమే లేని పరిస్థితి వచ్చేసింది. ఆయా ప్రతిపక్ష పార్టీల్లో కోవర్టులను పెంచిపోషించారనే చర్చ కూడా ఉంది. హుజూర్నగర్, నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ గెలవగలిగిందంటే, ఇలాంటి కాంగ్రెస్బలహీనతల వల్లనే అనే చర్చ విస్తృతంగా ఉంది.
పాలనపై ప్రజల్లో అసంతృప్తి
తొమ్మిదేండ్ల నుంచి తెలంగాణ రాజకీయాలకు దిశా నిర్దేశం లేకుండా పోయింది. కాలంతో పాటు ప్రజల్లోనూ కేసీఆర్ఏకపక్ష పాలనపై అసంతృప్తి పెరుగుతూ వస్తున్నది. ఈ వ్యతిరేకత కారణంగానే కేసీఆర్ ప్రతి ఎన్నికనూ ఖరీదైన ఎన్నికగా మార్చేశారు. తద్వారా అందరూ ఖరీదైన ఎన్నికలకే అలవాటు పడిపోతున్నారు. తెలంగాణ ప్రజలు ఇంత ఖరీదైన ఎన్నికలను గతంలో ఎన్నడూ చూసి ఉండరు. కానీ దుబ్బాక, హుజూరాబాద్ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ఎందుకు గెలవలేకపోయింది? అక్కడ టీఆర్ఎస్పాలనపై తమ అసంతృప్తిని చెప్పేందుకు ప్రజలు బలమైన బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. అంటే తెలంగాణలో విశ్వసనీయమైన ప్రతిపక్షాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆ రెండు ఉప ఎన్నికల ఫలితాలే చెప్పాయి. కేసీఆర్ రెండో విడత పాలనలో 4 ఉప ఎన్నికలు జరిగాయి. మునుగోడు 5వ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలే తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని పొలిటికల్సర్కిల్స్ భావిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ రాజకీయం ఎవరిది?
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షమే. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోతూ వచ్చింది. అందుకే హుజూర్నగర్ సైతం నిలబెట్టుకోలేకపోవడం, పేరెన్నికగన్న జానారెడ్డి వంటి నేత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవలేకపోవడం, దుబ్బాక, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం వంటివి ఆ పార్టీ బలహీనతలన్నీ బయట పడుతూ వస్తున్నాయి. తెలంగాణలో రోజు రోజుకు ప్రజల అంచనాలకు అందని పార్టీగా అది మారిపోతున్నది. మునుగోడు త్రిముఖ పోటీలో కాంగ్రెస్ తన పూర్వ బలాన్ని నిలుపుకోగలదా, లేదా అనేది చూడాలి. కొత్తగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆరాటపడుతున్న బీజేపీ దుబ్బాక స్థానాన్ని గెలుచుకొని టీఆర్ఎస్కు రాజకీయంగా ఒక పెద్ద షాకే ఇచ్చింది. హుజూరాబాద్‌లో ఈటల గెలుపొందడం తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు. ప్రజలు రాజేందర్‌ను గెలిపించి కేసీఆర్ ఏకపక్ష రాజకీయాలను హెచ్చరించారు. రఘునందనైనా, రాజేందర్అయినా బలమైన అభ్యర్థులు కాబట్టి గెలుపు సాధ్యమై ఉండొచ్చు. కానీ ప్రతిపక్షమే బలంగా లేని తెలంగాణలో బీజేపీ విస్తరణకు దుబ్బాక, హుజూరాబాద్గెలుపులు ఊతమిచ్చాయనడంలో సందేహం లేదు. మునుగోడులో బీజేపీకి మరో బలమైన రాజకీయ నాయకుడిగా రాజగోపాల్‌రెడ్డి లభించాడు.
ఆరోపణలు నిలబడ్డాయా?
రాజ్ గోపాల్‌రెడ్డి కేంద్రం ఇచ్చిన కాంట్రాక్టుకు అమ్ముడుపోయారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ఆరోపణ చేశాయి. దాన్ని ప్రజలు నమ్మారా, లేదా అనేదే కీలకం. 25 ఏండ్ల పాటు చేయాల్సిన మైనింగ్వర్క్ కాంట్రాక్టు అది. అదేదో దోచుకొని దాచుకోవడానికి మూడేండ్లలో పూర్తి చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు కాదనేది ప్రజలకు తెలుసు. వృత్తి పరంగా ఆయన కాంట్రాక్టర్ అని కూడా స్వయాన జనానికి తెలిసిందే. అందుకే ప్రత్యర్థుల ఆరోపణ ప్రజాక్షేత్రంలో ప్రభావితం చేయలేకపోయింది. ప్రజలను ఆపదలో ఆదుకునే నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. ప్రజల్లో ఆయన ఆమోదనీయతకు అదొక బలమైన కొలమానం. ఒక్క ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రచారంలో దించారు. దీంతో నెల రోజులుగా రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నట్లా, లేనట్లా ప్రజలకు అర్థంకాలేదు. ఏదేమైనా మునుగోడు ఉప ఎన్నిక ఎలాంటి సందేశం ఇవ్వనుందనేదే తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మారనున్న సమీకరణలు
అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సెమీ పైనల్ లాంటిదే.ఈ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో మూడు పార్టీలకూ మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఫలితం తేలాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో చోటుచేసుకునే రాజకీయ వలసలు ఏ పార్టీ కొంప ముంచనున్నాయో తెలియదు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రమాదకరమైన ఏకపక్ష రాజకీయానికి చెక్‌పెట్టి, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపరుస్తారని ఆశిద్దాం.
ఉప ఎన్నిక చేసిన ఉపకారం
తాజాగా బీజేపీ మునుగోడులో మూడో గెలుపును ఆశిస్తున్నది. కాంగ్రెస్‌పార్టీ శాసన సభ్యత్వానికి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి తొమ్మిదేండ్లలో 25 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ విషయంలో రాజ్ గోపాల్‌రెడ్డిని వేలెత్తి చూపే అవకాశాన్ని అటు టీఆర్ఎస్కు గానీ, ఇటు కాంగ్రెస్‌కు గానీ లేకుండాపోయింది. తన నియోజకవర్గ అభివృద్ధి పట్ల వివక్ష చూపుతున్నారని, అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయం మునుగోడు ప్రజలకు బాగా తెలుసు.
డిండిప్రాజెక్టు పనులు కాకపోవడానికి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడానికి సీఎం కేసీఆరే కారణమని అక్కడి ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక వస్తేనే సీఎం నిధులు కేటాయిస్తారని, అభివృద్ధి జరుగుతుందని, అనేక ఉప ఎన్నికలు రుజువు చేశాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా రాజీనామా చేసి ఆపనే చేశాడని మునుగోడు ప్రజలకు ఇపుడు అనుభవంలోకి వచ్చింది. ఐదేండ్లుగా ప్రజలు డిమాండు చేస్తున్న గట్టుప్పల్ మండల ఏర్పాటు రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాతోనే సాధ్యమైందని అక్కడి ప్రజలే చెప్పుకుంటున్నారు. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న కొత్త రోడ్ల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు, గొర్రెల పంపిణీ నిధులు అడగకముందే వచ్చేశాయి. రాజ్ గోపాల్‌రెడ్డి రాజీనామా ఇన్ని సాధించి పెట్టిందనే భావన మునుగోడు ప్రజల్లో గట్టిగానే ఉంది. ఈ ఉప ఎన్నిక మునుగోడుకు ఉపకారమే చేసింది.
– కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్