ప్రజలు కేసీఆర్ కు క్లీన్​చిట్​ ఇస్తరా?

ప్రజలు కేసీఆర్ కు క్లీన్​చిట్​ ఇస్తరా?

జోసెఫ్ స్టాలిన్ మరణించాక అతని పీఠంపైకి వచ్చిన కృశ్చేవ్ తనపార్టీ సభ్యులతో జరిగిన మొదటి మీటింగ్ లో స్టాలిన్ దుర్మార్గుడని, కిరాతకుడని, నరహంతకుడని తిట్టిపోస్తున్నాడు. వెనుక నుంచి ఓ సభ్యుడు ‘‘మీరు చాలా ఏండ్లు స్టాలిన్​తో కలిసి ఉన్నా ఈ వాస్తవాలు అప్పుడెందుకు వెల్లడించలేదు”అని గట్టిగా అరిచాడు. దానికి కృశ్చేవ్  స్పందిస్తూ.. “ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఒక్కసారి లేచి నిలబడాలి” అని అంటాడు. ఎవరూ లేవలేదు. ‘‘ ఎవరైనా లేచి నిలబడితే వారి తల తెగుతుంది; నేను కూడా స్టాలిన్‌‌లాంటి వాడినేనని మరిచిపోకండి” అన్నాడట నవ్వుతూ.. అధికారం నడిపే వాళ్లంతా ఇలాంటి సన్నివేశాలు తరచూ చూస్తుంటారు. ఇలాగే తెలంగాణలో కేసీఆర్​ పొరపాట్లను వేలెత్తి చూపగలిగే ధైర్యం ఎవరికీ లేదు. రవీంద్రనాయక్, ఈటల వంటి వారు బయటకు వచ్చిన తర్వాతే తిట్టారు. అసలు కేసీఆర్ ఎవరైనా చెప్తే వింటారా? అని మరొక చర్చ. పూర్వం ఉద్యమం జరిగే కాలంలో అలా చెప్పి అవమానపడిన వారిలో మందాడి సత్యనారాయణరెడ్డి, కోదండరాం, ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారు ఎందరో ఉ న్నారని విమర్శకులు అంటుంటారు. ఈ చర్చ ఎందుకంటే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ వ్యక్తిత్వంపై మొదటిసారి పెద్ద చర్చ మొదలైంది. దుబ్బాకలో పార్టీల గెలుపు ఓటములకన్నా ‘కేసీఆర్ నియంత’ అన్న టాపిక్ పైనే చర్చ జరిగినట్లు నిర్ధారణైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నా ‘మజ్లిస్ నీడలో మైనార్టీ సంతుష్టీకరణ’ అనే కేసీఆర్ లోని ఒక కోణంపై చర్చకు వచ్చింది. ఈటలకు అన్యాయం జరిగిందన్న అంశం హుజూరాబాద్​ ప్రజలను ప్రభావితం చేసింది. రాజకీయాల్లో సిద్ధాంతాలు, వ్యక్తిత్వాలు ప్రధానం అవుతాయి అన్నది చరిత్ర చెప్పిన సత్యం. 

జాతిపితలా మిగలాల్సింది పోయి..

ట్రినిటాడకు చెందిన మంత్రి శంభునాథ్ కపిల్ దేవ్ ఓసారి భారత పర్యటనకు వచ్చి నాటి ఆరెస్సెస్ చీఫ్ గురూజీని బెళగావిలో కలుసుకున్నాడు. అంత పెద్ద సంస్థకు అధిపతిగా ఉన్న గురూజీ నిరాడంబరంగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉంటే అతనికి ఆశ్చర్యంగా అనిపించి ‘‘మీకు సెక్యూరిటీ అవసరం లేదా?’’ అని అడుగుతాడు. అప్పుడే జరిగిన అమెరికా అధ్యక్షుడు జాన్​ ఎఫ్ కెనడీ హత్యను ప్రస్తావిస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలి! అంటాడు. అందుకు గురూజీ ‘‘కెనడీ భద్రతా వ్యవస్థలో లోపం లేకున్నా అతని జీవితం ముగిసింది. రష్యాను నియంత్రించడం, ప్రపంచ సంతులనం, నల్ల-, తెల్ల జాతుల మధ్య సమన్వయం ఈశ్వరుడు అతనికి అప్పగించిన పనులు. అవి కెనడీ గొప్పగా పూర్తి చేశాడు. ఇకముందు ఏదైనా జరిగితే కెనడీకి అపఖ్యాతి రావచ్చు. అందుకే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు” అని కారణ మీమాంస చెప్పారు. అలాగే కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చాక ఒక జాతిపితలా మిగలాల్సిందిపోయి అధికారం స్వీకరించారు. ఆ తర్వాత ప్రజలకు మరింత చేరువ కావల్సిందిపోయి ఎందుకో తనకు తానే ఇనుప గోడలు నిర్మించుకున్నారు. బహుశా! కిందిస్థాయిలో అవినీతి జరగొద్దనే విషయంలో ఎవరికీ అనవసరంగా అవకాశం ఇవ్వకూడదు అనే కారణం కావచ్చు. కానీ తాను వెళ్లాల్సిన చోటుకు వెళ్లారు. రావల్సిన వాళ్లను రానిచ్చారు. అయితే బడా ఆంధ్రా కంపెనీలు చేసిన అవినీతి కిందిస్థాయి వాళ్ల అవినీతికన్నా వెయ్యిరెట్లు పెద్దదనే ప్రతిపక్షాల వాదనను ప్రజలు గ్రహిస్తున్నారు కదా! ఇదంతా ఎవరూ చెప్పకుండానే ప్రజలు గ్రహించేటట్లు కేసీఆర్ చేజేతులా చేసుకున్నారు. అలాగే ‘కుటుంబ అవినీతి’ని నియంత్రించలేకపోతున్నారని కూడా ఒక ప్రధాన ఆరోపణ. ఇది కుటుంబ పాలన అన్న ముద్రకు దారి తీసింది.

వ్యతిరేకతకు కారణాలు ఇవేనా?

కేసీఆర్ భాష, యాస అంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టం. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్ లను ప్రజలు చెవులు నిక్కబొడుచుకొని విన్నారు. మరి కాలక్రమంలో ఎందుకు వెగటు పుట్టింది? అది పరిమితి దాటిందని, ఆ మాటల్లో అహంకారం ఎక్కువైందని, వట్టిమాటల గారడీ అని, డోస్ ఎక్కువైందని గ్రహించలేకపోవడం, ఆఖరుకు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఎల్బీ స్టేడియంలో చాలా మంచి బాలుడిలాగా ఉపన్యాసం ఇచ్చే స్థితికి దిగజారింది. ఇదంతా స్వయంకృతాపరాధం. అనవసర హామీలు, చర్యల వల్ల సప్లిమెంటరీ బిల్లులు, మెడికల్ బిల్లులు, నెలల తరబడి ఫ్రీజింగ్ ఉంటున్న స్థితికి రాష్ట్ర ఖజానా చేరింది. పెన్షన్లు, రైతుబంధు తీసుకుంటున్నవాళ్లు మాకు ఓట్లు వేస్తే చాలు.. ఎవడితో అవసరం లేదన్నట్లు మితిమీరిన విశ్వాసంతో ప్రవర్తించడం మిగతా వర్గాల్లో వ్యతిరేకతకు కారణమైంది. తలసాని, మహేందర్‌‌రెడ్డి, ఎర్రబెల్లి, కడియం శ్రీహరి వంటి వాళ్లు ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు. వాళ్లే ఇపుడు మళ్లీ కేసీఆర్‌‌కు పట్టం కడుతుంటే సమాజం ఎలా ఒప్పుకుంటుంది? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం కట్టడం మంచిదే. మరి ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో ప్రజలు ఆలోచిస్తారు కదా! జగన్​ను కుటుంబసమేతంగా ఆహ్వానించి, పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచగానే శత్రువుగా చూస్తా అని ప్రకటిస్తే జనం నమ్మకపోవడం న్యాయం కాదా? ఘంటా చక్రపాణి, గోరటి వెంకన్న వంటి వారికి పదవులిచ్చిన ఘనత అంతా కవితకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో కొట్టుకుపోలేదా? 

మైనార్టీ సంతుష్టీకరణ

ఇక మజ్లిస్ ప్రాధాన్యతగా కేసీఆర్ చేస్తున్న ‘మైనార్టీ సంతుష్టీకరణ’ పెద్ద తప్పిదం. ‘మెజార్టీ, మైనార్టీ తేడా లేకుండా అందరికీ సమాన గౌరవం ఇస్తాను’ అని అనకుండా ‘నాకు మైనార్టీలే ముఖ్యం’ అంటే దాన్ని మిగతా వర్గాలు ఎలా జీర్ణం చేసుకుంటాయి? ఈ సంతుష్టీకరణకు ‘గంగా జమునా తెహజీబ్’ అని పేరు పెట్టినా, మజ్లీస్​తో దోస్తానాను తెలంగాణ మెజార్టీ ప్రజలు ఎలా అంగీకరిస్తారు ? వ్యక్తిగతంగా కేసీఆర్ జాబ్ చార్ట్ బాగున్నా దానికి క్లీన్ చిట్ లేదని చాలామంది వాదన. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అన్ని చోట్లా చేస్తున్న భూదందాలు, వ్యాపారాలు, సెటిల్మెంట్లు కాంగ్రెస్ ను మించిపోయాయి. ఇదంతా దీపం కింద చీకటి. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రతినిధులకు ‘జాబ్​చార్ట్’ లేకుండా పోయింది. అన్నీ కేసీఆరే చేస్తారని ప్రజల్లోకి సందేశం వెళ్లినప్పుడు అసలు కేసీఆర్ మనుషుల్ని ఎందుకు కలవడు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వ్యక్తి గొప్పగా ఉన్నప్పుడు ప్రతిదీ ‘వ్యూహం’ అనిపిస్తుంది. గ్రాఫ్ పడిపోతుంటే ఏది చేసినా విమర్శల పాలవుతారు. పులి బలమైందే. అది బోనులోనే ఉంటే ఎలా ? ఇదే ఇప్పుడు మారుతున్న రాజకీయాల అసలు ప్రశ్న.

ఉద్యోగుల విషయంలో..

ఉద్యమకాలంలో కాంగ్రెస్, టీడీపీ వాళ్లు తీవ్రంగా అణచేస్తుంటే కేసీఆర్ చేసే పోరాటానికి మద్దతుగా నిలిచిన ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను పూచికపుల్లలా తీసివేయడం, కొందరు ఉద్యోగ సంఘాల భజనపరులను చుట్టూ పెట్టుకొని వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలను తీరుస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలను తీరుస్తున్నాననడం ఎలా ఒప్పు అవుతుంది? 317 జీవో విషయంలో అధికారుల మాటలకు తలొగ్గి అనవసరంగా చాలామంది ఉద్యోగుల కుటుంబాలకు అన్యాయం చేశారన్న చర్చ కిందిస్థాయిలో గట్టిగా ఉంది. ఆర్టీసీ సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచేసి స్కూళ్లు, కాలేజీలను కూడా బంద్ పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టి, కేసీఆర్ ముందు వాళ్లు సాగిలపడగానే కావల్సినవన్నీ ఇస్తాననడం నియంతృత్వంగా ఎక్స్​పోజ్ అయ్యే చర్య కాదా? తెలంగాణ కోసం మంటల్లో దూకిన యువకుల త్యాగాలకు గుర్తుగా నిలిచిన నిరుద్యోగుల కోసం ఏడేండ్లలో ఒక్క గ్రూప్ వన్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోవడం యువ మేధావులను ఆలోచింపజేయదా?  “భీష్మ ద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు’’ అని కేసీఆర్ పద్యం చదువుతుంటే మురిసిపోయిన కవులు, పండితులు ఇక్కడున్న ఓరియంటల్ కాలేజీలను గొంతు పిసికి చంపేస్తుంటే బాధపడకుండా ఉంటారా? తెలంగాణలో ఎందరో కవులను సృష్టించిన ప్రాచ్య కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంటే కేసీఆర్‌‌ పక్కనున్న కవి నాయకులు చెప్పకపోతే ఎలా? అధికారభాషా సంఘం ఒక్క కార్యాచరణ అయినా చేసిందా? తెలుగు పండిట్లకు తెలుగు మహాసభల సాక్షిగా ఇచ్చిన హామీ అమలుకు నోచుకుందా! అని కేసీఆర్ తెలుసుకోవద్దా?

కేంద్రంపై యుద్ధం?
 

తెలంగాణలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నా ఒక ఇనుపగోడ ప్రజలకు కేసీఆర్‌‌కు మధ్య ఎందుకు నిర్మాణం అవుతోందని సమీక్షించుకోవడం పోయి ప్రజలు మేం చెప్పినట్లు ఎందుకు వినడం లేదనే తీవ్రతకు రావడం సరికాదు. కేంద్రంపై యుద్ధం అనేది రాష్ట్రాలకు అవసరం లేని విషయం. వడ్ల విషయంలో కేసీఆర్ కేంద్రంతో కొట్లాడే ఆలోచన సరైందే కావచ్చు. కానీ ప్రజలు వడ్లను కేసీఆరే కొనాలని అనుకొంటున్నారు. పార్టీలో నాయకుల మీద అభిమానంతో వచ్చే స్పందన వేరు, ప్రజల్లో కలిగే స్పందన వేరు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు వాళ్ల అవసరాలకనుగుణంగా కేంద్రంతో దోబూచులాడుతున్న విషయం కేసీఆర్‌‌కు తెలియనిది కాదు. వాళ్లను నమ్ముకొని కేంద్ర రాజకీయాలు చేయడం కుక్కతోక పట్టుకుని గోదారి ఈదడమే. 
- డా. పి. భాస్కరయోగి, సోషల్​ ఎనలిస్ట్