న్యూఢిల్లీ, వెలుగు: తిరుపతిలో 2014 మార్చిలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తారా? అని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ వైఫల్యం గురించి తాను గతంలోనే ప్రస్తావించానని, దురదృష్టవశాత్తు అది ఇప్పటికీ నిజమేనని పేర్కొంటూ బుధవారం ట్వీట్ చేశారు.
చంద్రబాబు పట్టుదలతో ఉంటే తప్ప మోదీ తన హామీలను అమలు చేస్తారన్న ఆశ లేదని తెలిపారు. హామీల అమలుపై ఏపీ ప్రజలకు ప్రధాని స్పష్టత ఇవ్వాలన్నారు. పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఏపీ ప్రధాన కార్యాలయంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు గురించి మోదీని ప్రశ్నించారు.