లక్షల్లో ఫీజు ఉంటే.. పేద స్టూడెంట్స్​ ఓయూలో పీహెచ్​డీ చేస్తరా?

ప్రపంచంలో ఉన్న ప్రతి సమాజం పరిణామ క్రమం, మార్పు, అభివృద్ధి, చెందే క్రమంలో అనేక సమస్యలు ఉద్భవిస్తాయి. ఆ సమస్యల పరిష్కారం విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు, నిషితమైన అధ్యయనం ద్వారా సాధ్యమవుతుంది. గత వందేండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, అలాంటి ఎన్నో రకాల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపింది. ఈ పరిశోధనలు సాఫీగా కొనసాగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అప్పట్లో పరిశోధక విద్యార్థులకు కోర్స్ ఫీజు కంటే అధికంగా యూనివర్సిటీ స్కాలర్షిప్​లు, ఫెలోషిప్​లు ఇచ్చి హాస్టల్, మెస్ సౌకర్యం కూడా కల్పించి అంతర్జాతీయ స్థాయి స్కాలర్లీ జర్నల్స్ యాక్సిస్ చేసుకోవడానికి సదుపాయం కల్పించేది. కానీ ఇప్పుడు ఫీజులు పెంచి హాస్టల్, మెస్ సౌకర్యం లేదనడంతో విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో అడ్మిషన్ తీసుకోవాలా? వద్దా అనే సందేహంలో ఉన్నారు. న్యాక్ ఏ గ్రేడ్ ఉన్న వర్సిటీలు స్వతంత్రంగా ఏటా పీహెచ్​డీ అడ్మిషన్ల భర్తీ ప్రక్రియ చేపట్టవచ్చు. కానీ ఐదేండ్లుగా ఓయూ న్యాక్ ఏ గ్రేడ్ ఉన్న పీహెచ్​డీ అడ్మిషన్ల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు.

దీంతో ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. ఐదేండ్ల తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టినా.. కఠిన నిబంధనలు పెట్టారు. ఆ కఠిన నియమాలను అధిగమించి అర్హత సాధించినా.. విద్యార్థులు కట్టలేనంతగా ఫీజులను నిర్ణయించారు. గతంలో పీహెచ్​డీ పూర్తిస్థాయి, పార్ట్ టైం జాయినింగ్ ఫీజు సంవత్సరానికి రూ. 2000 మొత్తం ఐదేండ్లకు రూ.10,000 గా ఉండేది. ఇప్పుడు సోషల్ సైన్సెస్, కామర్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్, లా, ఆర్ట్స్ మేనేజ్​మెంట్, ఎడ్యుకేషన్ రంగాల్లో పరిశోధన చేసే వారికి  సంవత్సరానికి రూ. 20 వేలు మొత్తం ఐదేండ్లకు రూ.1.2 లక్షలుగా చేశారు. లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ రంగాల్లో పరిశోధన చేసే వారికి  ఏడాదికి  రూ. 25 వేలు మొత్తం ఐదేండ్లకు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ నిర్ణయించిన ఫీజులు దేశంలో ఉన్న ఏ ఇతర ప్రభుత్వ యూనివర్సిటీల్లో లేవు. ఆయా వర్సిటీల్లో పరిశోధక విద్యార్థులకు యూనివర్సిటీ తరఫున ఫెలోషిప్​లు ఇస్తారు. కానీ ఓయూలో ఎలాంటి స్కాలర్​షిప్ ఇవ్వకుండా తిరిగి విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం సమస్యాత్మకంగా మారింది.

టీచింగ్​ స్టాఫ్​ లేక ఇబ్బందులు..

తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ వర్సిటీల్లో 75% టీచింగ్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. దీంతో నాణ్యమైన పరిశోధనలు లేక వర్సిటీలు ప్రమాణాలు కోల్పోతున్నాయి. విద్యార్థులు కేవలం డిగ్రీలు పొందుతున్నారు తప్ప ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలి. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందడానికి సహకారం అందించాలి. ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తేవడంలో విఫలమైన అధికారులు.. ప్రైవేటు యూనివర్సిటీలకు ధీటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఫీజులను సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల శాతానికి, పీహెచ్ డీ కోర్సు ఫీజును తొమ్మిది వందల శాతానికి పెంచారు. ప్రభుత్వ యూనివర్సిటీలను వ్యాపార కేంద్రాలుగా మార్చారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న తీరు పెంచిన ఫీజులను చూస్తేనే అర్థమవుతున్నది. వెంటనే పెంచిన పీహెచ్​డీ కోర్సు ఫీజును తగ్గించి అడ్మిషన్ పొందిన ప్రతి పీహెచ్​డీ విద్యార్థికి యూనివర్సిటీ ఫెలోషిప్ ఇచ్చి, హాస్టల్, మెస్ సౌకర్యం కల్పించాలి. ఉచితంగా ల్యాప్​టాప్, అంతర్జాతీయ స్థాయి స్కాలర్లీ జర్నల్స్ యాక్సెస్ చేసుకోవడానికి సౌకర్యం కల్పించి పరిశోధక విద్యార్థులకు బాసటగా నిలవాలి.

- నెల్లి సత్య, ఓయూ రీసెర్చ్ స్కాలర్