మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంట.. వాళ్లను వెనక్కి పంపిస్త: ట్రంప్

మూడో ప్రపంచ యుద్ధం  రాకుండా అడ్డుకుంట.. వాళ్లను వెనక్కి పంపిస్త: ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి బయటికి పంపిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రకటించారు. ఈమేరకు ఆదివారం వాషింగ్టన్​లో భారీ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. 

క్యాపిటల్ వన్ ఎరేనా ముందు వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘అమెరికాపై ఇతర దేశాల దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నా. అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి కట్టుబడి ఉన్న. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పైకి దూసుకెళ్తున్నది. 

స్మాల్​ బిజినెస్ సెక్టార్​లో 39 ఏండ్ల రికార్డును అధిగమించాం. పెట్టుబడుల వరద పారుతున్నది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్​తో సమావేశం అయ్యాను. అమెరికాలో భారీ పెట్టుబడులకు ఆయన హామీ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటాను’’ అని ట్రంప్​ ప్రకటించారు. తాను అధికారంలో ఉండబోయే నాలుగేండ్లలో దేశం ఇంకెంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను జారీ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. ప్రతి అమెరికన్​ను సంతోషపరుస్తాయన్నారు. చుట్టూ ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్ల వద్ద నిఘా పెంచుతానని తెలిపారు.