ప్రియాంకతో కాంగ్రెస్ కు లాభమేనా?

ప్రియాంకతో కాంగ్రెస్ కు లాభమేనా? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ప్రియాంక ప్రవేశించి మూడు నెలలు దాటింది. ఈ మూడు నెలల కాలంలో ఆమె వల్ల పార్టీ ఏమైనా లాభపడిందా ? ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పుంజుకుందా ? తూర్పు యూపీలో ఎన్ని సీట్లు కాం గ్రెస్ ఖాతాలో ఆమె వేయించగలుగుతుంది? అనే ప్రశ్నలు వచ్చాయి. వీటిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు హైప్ కు తగ్గట్టు ఆమె కంట్రిబ్యూషన్ లేదన్న విమర్శ వినిపిస్తోంది. మరోవైపు ప్రియాంకకు మరికొంత టైం ఇవ్వాలన్న వాదన కూడా వచ్చిం ది.

ప్రియాంక గాంధీ యాక్టివ్ పాలిటిక్స్‌‌లోకి వచ్చి మూడు నెలలు దాటింది. ఈ ఏడాది జనవరి 23న ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెను నియమించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో హైప్ కొనసాగింది. ప్రియాంక ప్రధాన ఆకర్షణగా మారారు. అచ్చు నానమ్మ ఇందిర పోలికలతో ఉండే ప్రియాంక, ఈసారి ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. యూపీలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తారన్న ఊహాగానాలు చాలాకాలం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. చివరకు ప్రియాంక పోటీ చేయడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. కిందటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ నే మరోసారి వారణాసి నుంచి బరిలో దింపుతున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. దీంతో ప్రియాంక కేండిడేచర్ పై వచ్చిన హైప్ కాస్తా తుస్సుమంది. కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడ్డారు.

హైప్ క్రియేట్ చేసింది మీడియానే

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా నియమితులై మూడునెలలు దాటినా పార్టీకి ప్రియాంక కంట్రిబ్యూషన్ ఏమీ లేదనడం కరెక్ట్ కాదన్నా రు కాంగ్రెస్ గ్రీవెన్సెస్ సెల్ చైర్ పర్సన్ అర్చనా దాల్మియా. యూపీలో ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని కాంగ్రెస్ కేడర్ లో ఆమె జోష్ నింపారని చెప్పారు. అప్పటివరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక రాకతో ఉరిమే ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయడం మొదలెట్టారన్నారు. ఇందిర లాగా ప్రజలను ఆకట్టుకోగల చరిష్మా  ప్రియాంకకు ఉన్నదన్న విషయం ఆమె ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే  తెలుస్తుందన్నారు. కొన్ని రోజులుగా ప్రియాంక పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలే ఆమె ప్రజాకర్షణ శక్తికి నిదర్శనమని అర్చనా దాల్మియా చెప్పారు. వారణాసిలో ప్రియాంక పోటీ అంశంపై హైప్ క్రియేట్ చేసింది మీడియానే అని ఆమె అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు.

ఓట్లు తెచ్చే సత్తా లేదన్న బీజేపీ

ప్రియాంక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కాగానే ఏదో అద్భుతం జరుగుతుందని అందరూ భావించారని బీజేపీ అధికార ప్రతినిధి సధాంశు మిట్టల్ చెప్పారు. అయితే ఓట్లు తెచ్చే సత్తా ప్రియాంకకు లేదన్నసంగతి ఈ మూడు నెలల్లో రుజువైందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై  ప్రియాంకకు ఎలాంటి అవగాహన లేదన్నా రు. కేవలం నెహ్రూ – గాం ధీ వారసురాలిగానే  ఆమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారని మిట్టల్ పేర్కొన్నారు. ప్రియాంక గొప్ప లీడర్ అవుతుందని మీడియా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు.అయితే  సమస్యలను పరిష్కరించే సత్తా, ప్రజలను ఆకట్టుకునే చరిష్మా  ప్రియాంకకు లేవని ఈ మూడు నెలల్లోనే తేలిపోయిందని బీజేపీ లీడర్ కామెంట్ చేశారు.

టైం ఇవ్వాలన్న రాజకీయ విశ్లేషకులు

ప్రియాంక నాయకత్వ లక్షణాలను అంచనా వేయడానికి ఆమెకు మరికొంత టైం ఇవ్వాలన్నది రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయ్ అభిప్రాయం. సామాన్య ప్రజల సంగతి ఎలాగున్నా కాంగ్రెస్ కేడర్ లో మాత్రం ప్రియాంక జోష్ నింపిన మాట వాస్తవమన్నారు. యూపీలో పార్టీకి మళ్లీ  వైభవం వస్తుందన్న ఆశలను కేడర్ లో ఆమె కలగజేశారని కిద్వాయ్ చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పటికీ కావాలనే ఆమె ‘ లో ప్రొఫైల్ ’ మెయింటైన్ చేస్తున్నారన్న అభిప్రాయం చాలా మందిలో ఉందన్నారు కిద్వా య్. ఈ కారణంతోనే టీవీలకు ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదన్నారు.

పోరాడే గుణమేదీ ?

ప్రస్తుత రాజకీయాల్లో  ప్రియాంక ఓ యథాతథ వాది అని సీనియర్ జర్నలిస్టు శివం విజ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ పై పోరాటం చేసి అధికారాన్ని చేజిక్కించుకునే నైజం ఆమెది కాదన్నా రు. ఈ విషయంలో రాహుల్ కు  ప్రియాంకకు పెద్దగా తేడా లేదన్నారు. బిర్యానీ తినడానికి ప్రధాని మోడీ పాకిస్థాన్ వెళ్లారన్న ఒకే ఒక్క కామెంట్ మినహా ప్రియాంక ప్రసంగాల్లో ఎక్కడా జనాన్ని ఉర్రూతలూగించే అంశాలేమీ ఉండవన్నారు శివం. మోడీ పాలనకు ప్రజలు విసుగెత్తి ఏదో ఒక రోజు కాంగ్రెస్ కు వారంతట వారే అధికారాన్ని అందచేస్తారని, అప్పటి వరకు చేయగలిగింది ఏమీ లేదని డిసైడ్ అయి ఉన్నారని ప్రియాంక రాజకీయాలను శివం విజ్ విశ్లేషించారు. తూర్పు యూపీలో పార్టీ వ్యవహారాలను పక్కనపెట్టి ఓ రోజు వయనాడ్ కు మరో రోజుకు మరో ప్రాంతానికి ప్రియాంక వెళ్లడం కూడా పొలిటికల్ గా మంచి నిర్ణయాలు కావన్నది శివం విజ్ అభిప్రాయం.

సీరియస్ నెస్ ఏదీ?

యాక్టివ్ పాలిటిక్స్ పట్ల ప్రియాంక గాంధీకి సీరియస్ నెస్ లేదన్న మరో సీనియర్ జర్నలిస్టు అదితి వత్స అభిప్రాయం. యూపీలో అనేక దశల్లో పోలింగ్ జరుగుతుంటే ఏమాత్రం భయం లేకుండా ఆమె రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు ప్రియాంక వెళ్లడాన్ని  ఆయన తప్పుపట్టారు. ఒక వైపు బీజేపీ మరో వైపు ఎస్పీ, బీఎస్పీ,ఆర్ ఎల్డీ కూటమి విసిరిన సవాళ్లను కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ లైట్ గా తీసుకున్నారని అదితి అన్నారు.

యూపీపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

80 లోక్ సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ పై కాంగ్రెస్ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. 1980 వరకు పెట్టని కోటలా ఉన్న యూపీ లో కాం గ్రెస్ ఆ తర్వా త తన ప్రభావాన్ని కోల్పోయింది. బలమైన ప్రాంతీయ పార్టీలు తెరమీదకు రావడంతో కాంగ్రెస్ రాజకీయంగా తెరమరుగైంది. 2014లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 సీట్లకు పోటీ చేసి రెండు సీట్లు అమేథీ, రాయ్ బరేలీ మాత్రమే గెలుచుకుంది. యూపీలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న వారే ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలెక్కువ. దీంతో యూపీ లో ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా కీలకంగా భావించే తూర్పు ప్రాంత పార్టీ వ్యవహారాలు ప్రియాంకకు అప్పగించింది. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది. బాగా వెనకబడ్డ ప్రాంతం. పూర్వాంచల్ యూపీగా పేరొందిన ఈ ప్రాంతం రాజకీయంగా చాలా కీలకమైంది.రాష్ట్ర పాలిటిక్స్ ను శాసించేది పూర్వాం చల్ యూపీయే అంటారు రాజకీయ విశ్లేషకులు. ఈస్ట్ యూపీలో కుల రాజకీయాలు ఎక్కువ. ఈ ప్రాంతంలో మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. దీంతో యూపీ తూర్పు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ప్రియాంకకు పార్టీ అప్పగించింది.

నిర్ణయాలు ప్రియాంకవే

రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి ప్రియాంకపై చాలా కాలం నుంచి ఉంది. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నప్పటికీ కాం గ్రెస్ తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాల్లో  ప్రియాంక పాత్ర ఉంది. కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కకుండా చేయడం దగ్గర్నుంచి మూడు హిందీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక వరకు ఆమె మాటకే రాహుల్ విలువ ఇచ్చారు . ఆమె సలహా మేరకే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ తాజా పరిణామాలతో ప్రియాంకను యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని రాహుల్ డిసైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. నేషనల్ పాలిటిక్స్ లో కీలకంగా భావిం చే ఉత్తరప్రదేశ్ లో కొన్ని నెలల కిందట ప్రాంతీయ పార్టీలు సమాజ్ వాది పార్టీ (ఎస్పీ),బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమిగా ఏర్పడ్డాయి. జాతీయస్థాయిలో బీజేపీని సవాల్ చేస్తున్న కాంగ్రెస్ ను ఈ కూటమి దూరంగా పెట్టింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.దీంతో యూపీలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రియాంక అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆమెను పార్టీ జనరల్ సెక్రెటరీగా నియమించారు.