విశ్లేషణ: యూపీలో ప్రియాంక ప్లాన్లు పనిజేస్తయా?

‘లడకీ హూ.. లడ్‌‌ సక్తీ హూ (నేను అమ్మాయిని, నేనూ పోరాడతాను)’.. 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రియాంకా గాంధీ ఇస్తున్న నినాదం ఇది. సరికొత్త నినాదం, కొత్త తరహా రాజకీయాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలందరినీ సంఘటితం చేస్తామని ప్రియాంక సంకేతాలిస్తున్నారు. అదే సమయంలో పాలనా సమస్యలను జనం ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మహిళలు హింస, అన్యాయాలకు గురవుతున్నారు. యువత ఉద్యోగావకాశాలు లేక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుత రాజకీయ సంఘర్షణలో అణచివేతకు గురవుతున్న మహిళలు, యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రియాంక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్​లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌‌ను నిలిపేందుకు కుల, మత సమస్యలపై కాక పాలనా సంబంధిత సమస్యలపై ఫోకస్​ పెడుతూ 8 పాయింట్ల కార్యక్రమాన్ని ప్రియాంకాగాంధీ ఆవిష్కరించారు. రాజకీయాలకు పట్టుకొమ్మలుగా ఉన్న కుల, మత ప్రభావాన్ని ఇది మారుస్తుందని ప్రియాంక భావిస్తున్నారు. ఈ ఐడియా రాజకీయ వేదికలపై పాలనా లోపాలను ముందుకు తెస్తూ.. రాజకీయాలు ప్రజలు కేంద్రంగా నడిచేలా చేస్తుందనేది ఆమె ఆలోచన.

మహిళా సాధికారతపైనే ఫోకస్
ఉన్నావ్‌‌, హత్రాస్‌‌లో జరిగిన భయంకరమైన, అనాగరిక అత్యాచార కేసులు, బదౌన్​ గ్యాంగ్‌‌ రేప్‌‌, హత్య, సోన్‌‌భద్రలో ఆదివాసీల హత్య, లభీంపూర్‌‌‌‌ భేరిలో రైతుల హత్యలకు సంబంధించిన బాధిత కుటుంబాలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ప్రియాంక ఈ సరికొత్త ఆలోచనను తెరముందుకు తెచ్చారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆమె బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి వారితో చర్చించారు. కలిసిన ప్రతి ఒక్కరితో ‘న్యాయం కోసం మనం పోరాడదాం’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. ఈ నినాదం 50% మంది ప్రజలకు చేరుతుందని ఆమె భావిస్తున్నారు. కారణాలు కనుక్కోవడం కష్టమే అయినా ఉత్తరప్రదేశ్​లో ప్రతి జిల్లాలో సరాసరి 20 ఎఫ్ఐఆర్​లు మహిళలపై జరుగుతున్న నేరాల గురించే ఉంటున్నాయి. పోలీస్‌‌ స్టేషన్లు, అసెంబ్లీ, నిర్ణయాధికారాలు ఉన్న బ్యూరోక్రసీ ఇలా ప్రతి దానిలోనూ పురుషాధిక్యమే. ఫలితంగా నేరాల రేటు మరింత పెరిగిపోతోంది. ఈ విభాగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగి, వారికి తోడ్పాటు అందించాలని ప్రియాంక భావిస్తున్నారు. మహిళలు వారు కలలు కంటున్న సామాజిక మార్పులను తామే రచించేందుకు ప్రజాప్రతినిధులుగా మారాలని ప్రియాంక కోరుకుంటున్నారు.

40 శాతం టికెట్లు మహిళలకే..
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40% పార్టీ టికెట్లు మహిళలకే కేటాయించాలనే ఆలోచన ప్రియాంకకు వచ్చింది. 40% పార్టీ టికెట్లు మహిళా అభ్యర్థులకే కేటాయించడం ద్వారా ఆమెకు రెండు ప్రయోజనాలున్నాయి. మహిళా సాధికారత అనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా మహిళలకు చేరువకావడానికి ప్రయత్నించడమే కాకుండా, న్యాయం కోసం పోరాడటంలో రాజకీయ స్థాయిలో వారిని ఏకం చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. జనాభాలో 50% మంది ఉన్నా హింసా బాధితులుగా మారుతున్న మహిళలపైనే ప్రియాంక ఇప్పుడు దృష్టి పెట్టారు. ఆమె నిర్ణయాన్ని అనుసరించి 2022లో జరగబోయే ఎన్నికలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌ తరఫు నుంచి 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలువబోతున్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ కేవలం 11 మంది మహిళా అభ్యర్థులను మాత్రమే పోటీలో ఉంచగా, అందులో ఇద్దరే గెలిచారు. ప్రస్తుత కాంగ్రెస్‌‌ ఆలోచనకు ఇది పూర్తిగా భిన్నమైనది.

సరికొత్త రాజకీయ నమూనా
ఇప్పటి వరకు కులం, మతం ఆధిపత్యం చెలాయిస్తున్న యూపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ ప్రణాళికలతో ప్రియాంకాగాంధీ ముందుకు వచ్చారు. పీడిత ప్రజలతో మమేకమై, పాతుకుపోయిన రాజకీయ వర్గాలపై పోరాడేందుకు ధైర్యం, నమ్మకంతో ముందుకు వచ్చినట్టు ఆమె కనిపిస్తున్నారు. కులం, మతం ప్రాతిపదికన నడిచే ఉత్తరప్రదేశ్​ రాజకీయాల్లో ఆమె సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త బ్రాండ్‌‌ని ఆమె ప్రవేశపెట్టారు. ఇదో కొత్త ప్రయోగమని ఒప్పుకోవలసిందే. కానీ క్షేత్ర స్థాయిలో ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

ప్రజలతో మమేకమై..
2019లో లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంకకు బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ సమయాభావం వల్ల కాంగ్రెస్​ పార్టీ అనుకూల ఫలితాలను సాధించలేకపోయింది. లోక్‌‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆమె విస్తృతంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే ప్రజల్లో వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. యువత, రైతులు, సామాన్యులతో అలహాబాద్‌‌ నుంచి వారణాసి వరకు ఆమె చేపట్టిన బోట్‌‌ యాత్రలో భాగంగా మల్లాస్‌‌, నిషాద్స్‌‌ తోపాటు మహిళలు, బాలికలతో కలిసిపోతున్నారు. ప్రియాంక పీడిత ప్రజల పక్షాన ఉంటూ వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. గోరఖ్​పూర్‌‌‌‌ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ కఢీల్‌‌ ఖాన్‌‌ పౌరసత్వ సవరణ చట్టంపై అలీగఢ్‌‌లో ప్రసంగిస్తుండగా జాతీయ భద్రతా చట్టం(ఎన్‌‌ఎస్‌‌ఏ) కింద అరెస్టై జైలు పాలవ్వగా, కాంగ్రెస్‌‌ శ్రేణులన్నీ రోడ్లపై బైఠాయించి, న్యాయ పోరాటంలో ఆయనకు సహకరించారు. అలహాబాద్‌‌ హైకోర్ట్‌‌ ఆయన విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కాంగ్రెస్‌‌ పాలిత ప్రాంతమైన రాజస్థాన్‌‌, జైపూర్‌‌‌‌లో ప్రియాంక అతడికి ఉద్యోగాన్ని కల్పించారు. కరోనా కాలంలో సమాజ్​వాదీ పార్టీ లీడర్ అఖిలేశ్​ యాదవ్, బహుజన్​ సమాజ్​పార్టీ నాయకురాలు మాయావతి ఇంట్లో హాయిగా ఉంటే, ప్రియాంక మాత్రం రోడ్లపై నడిచి వెళ్తున్న వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి వారు తమ ఇండ్లకు చేరేందుకు సహాయపడ్డారు. వలస కార్మికుల కోసం ఆమె ఏర్పాటు చేసిన బస్సులను యోగి ఆదిత్యనాథ్​ సర్కార్‌‌‌‌ తిరస్కరించి అపఖ్యాతి మూటగట్టుకుంది.

కాంగ్రెస్​ రీస్ట్రక్చరింగ్‌‌ ప్లాన్
రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని తిరిగి పునరుద్ధరించే క్రమంలో ప్రియాంక సరికొత్త ఆలోచనలను రేకెత్తించే సమావేశాలను నిర్వహిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చేరేందుకు ప్రజలనుద్దేశించి ప్రసంగించడంతో పాటు వారితో నేరుగా కలిసి మాట్లాడే దిశగా తన సమావేశాలను ప్రియాంక రూపకల్పన చేస్తున్నారు. పీసీసీలో ఉన్న జంబో సైజ్‌‌ విభాగాలను కట్‌‌ చేసి క్షేత్ర స్థాయి పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుని యూపీలో కాంగ్రెస్‌‌ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్‌‌ కాంగ్రెస్‌‌ కమిటీ(డీసీసీ) స్థాయిలో ప్రతి డీసీసీ ఎగ్జిక్యూటివ్‌‌ కమిటీ మెంబర్లకు బాధ్యతలను, అధికారాన్ని కేటాయిస్తున్నారు. సంబంధిత విభాగాలలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి పాత్ర, వారు చేపట్టాల్సిన పని గురించి వారికి తెలియాలనేది దీని ముఖ్య ఉద్దేశం. పార్టీలో చేరి అలంకారప్రాయంగా పదవి పొందడం కాకుండా యూపీలో కాంగ్రెస్‌‌ను నిలబెట్టడానికి కృషి చేయాలని ప్రియాంక చెబుతున్నారు. 1989లో కాంగ్రెస్‌‌ అధికారాన్ని  కోల్పోయిన నాటి నుంచీ ఉత్తరప్రదేశ్​లో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్‌‌ను బతికించడం ప్రియాంకకు శ్రమతో కూడుకున్న పనే. 30 ఏండ్లు గడిచాక 2019లో కాంగ్రెస్‌‌కి కొత్త జీవం పోసేందుకు ప్రియాంక సంకల్పించి 2022లో జరగబోయే ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, రాజకీయ కురువృద్ధునిగా పేరు మోసిన ములాయం సింగ్‌‌ యాదవ్‌‌ వారసత్వాన్ని అందుకున్న అఖిలేశ్, దళిత ఓటు బ్యాంక్‌‌ను ప్రభావితం చేయగల మాయావతిని ఎదుర్కొని ప్రియాంక ప్రణాళికలు ఎంతవరకూ నెరవేరతాయన్నది వేచి చూడాల్సిందే.

8 పాయింట్ల అజెండా
ప్రియాంక రూపొందించిన 8 పాయింట్ల ప్రోగ్రామ్‌‌ జనాభాలో 50% ఉన్న మహిళలు, అలాగే జనాభాలో గణనీయ స్థాయిలో ఉన్న యువతను టార్గెట్‌‌ చేసింది. ఉత్తరప్రదేశ్​లో ఆమె ప్రయోగం విజయవంతమైతే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌‌కు ఆమె బ్రాండ్‌‌ నమూనా కానుంది. రాజకీయాల్లో కొత్త బ్రాండ్‌‌ గురించి, ప్రజలను ఉద్దేశించి చేసిన తన 8-పాయింట్ల అజెండా ప్రజల్లో నమ్మకాన్ని, అంచనాలను పెంచింది. ఆ ఎనిమిది పాయింట్లు ఏమిటంటే..

1. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకే ఇవ్వడం
2. బాలికలకు ఉచితంగా స్మార్ట్‌‌ఫోన్లు, ఈ–స్కూటర్లు అందజేయడం
3. వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దు చేయడం
4. యువతకు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం
5. రైతులకు విద్యుత్‌‌ బిల్లులు సగానికి తగ్గించడం, కరోనా కాలంలో విద్యుత్‌‌ బిల్లులు మాఫీ చేయడం
6. కరోనా ప్రభావిత కుటుంబాలకు రూ.25,‌‌‌‌‌‌‌‌000 సాయం అందించడం
7. వరికి క్వింటాల్‌‌కు రూ.2,500, చెరకుకు క్వింటాల్​కు రూ.400 కనీస మద్దతు ధర కల్పించడం
8. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందించడం

ఇవన్నీ మహిళలు, యువత, రైతులు ఇటీవలి కాలంలో కరోనాతో ఇబ్బందిపడినవే. అలాగే సాధారణ పౌరులకు సంబంధించినవే. అవసరాలున్న అందరినీ కవర్‌‌‌‌ చేసేలా బలమైన ఆరోగ్య సంరక్షణా విధానాన్ని ముందుకు తీసుకురానున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్​ అంతటా చేసిన పర్యటనల ఆధారంగా తన అజెండాను ప్రియాంక రూపొందించుకున్నారు.

- పర్సా వెంకట్​, పొలిటికల్​ ఎనలిస్ట్​