Will Pucovski: 27 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై.. ఒక్క టెస్టుకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా బ్యాటర్

Will Pucovski: 27 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై.. ఒక్క టెస్టుకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా బ్యాటర్

ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్‌స్కీ దురదృష్టవశాత్తు  తన క్రికెట్ కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. వైద్య కారణాల వలన ఈ ఆసీస్ యువ బ్యాటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పుకోవ్‌స్కీ మార్చి 2024 నుంచి వరుసగా గాయలవుతున్నాయి. ముఖ్యంగా తలకు గాయాలవడం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని తలకు ఏకంగా 13 సార్లు దెబ్బ తగిలింది. ఈ కారణంగానే అతను తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.  

ఆస్ట్రేలియాలో అపార బ్యాటింగ్ ప్రతిభ కలిగిన ఆటగాడిగా పేరుగాంచిన విల్ పుకోవ్స్కి..ఇకపై ఏ విధమైన క్రికెట్ ఆడబోనని, బదులుగా వ్యాఖ్యానం మరియు కోచింగ్ వైపు మారనున్నట్లు చెప్పాడు. "నేను మళ్ళీ క్రికెట్ ఆడను. నిజం చెప్పాలంటే ఇది నాకు కష్టమైన సంవత్సరం. మళ్ళీ ఏ స్థాయి క్రికెట్ లోనూ నేను ఆడడానికి సిద్ధంగా లేను. రెండు నెలలుగా నేను ఇంట్లో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డాను". అని పుకోవ్స్కి మంగళవారం (ఏప్రిల్ 8) SEN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. 

పుకోవ్‌స్కీ హోబర్ట్‌లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విక్టోరియా తరపున టాస్మానియాతో చివరిసారిగా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ వేసిన బౌన్సర్ కు బంతి అతని హెల్మెట్‌ కు తగలడంతో తీవ్ర గాయమైంది. 21 ఏళ్ళ వయసులోనే పుకోవ్‌స్కీ ఆస్ట్రేలియా టెస్ట్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ పై సిడ్నీలో ఏకైక అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 62.. రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. 2017లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుండి పుకోవ్స్కి.. 36 మ్యాచ్ ల్లో 7 సెంచరీలు.. 9 హాఫ్ సెంచరీలతో సహా 2350 పరుగులు చేశాడు.