విపక్ష నేతగా రాహుల్ రాణించేనా!

విపక్ష నేతగా రాహుల్ రాణించేనా!

 

లోక్ సభలో  పది ఏండ్ల తరువాత  ప్రతిపక్ష నేత పదవికి గుర్తింపు లభించింది.  ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు.  గత ఐదు ఏండ్లు స్పీకర్ గా ఉన్న ఓం బిర్లానే మళ్ళీ స్పీకర్ అయ్యారు.  మరోవైపు పీఎం మోదీ తాను అనుకున్నదే చేశారు.  స్పీకర్ గా  ఓం బిర్లా అయితేనే తాను అనుకున్నట్లు అన్నీ జరిగిపోతాయనే భావన మోదీది.  అందుకే  అయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టారు.  ప్రధాని మోదీ,  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  ఇద్దరూ కలిసి బిర్లాను స్పీకర్​ సీటు వరకు తీసుకెళ్లి  కూర్చుండబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా కూటమి అనేది ప్రజల గొంతు అని,  ప్రజాగొంతును నొక్కకూడదు, మాట్లాడే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.  నిజానికి బ్రిటన్ లాంటి దేశంలో  ప్రతిపక్ష నేత అంటే షాడో పీఎం అనే రీతిగా ఉంటుంది.  కీలక నిర్ణయాలలో  ప్రతిపక్ష నేత భాగస్వామ్యం ఉంటుంది.  మరి మన పీఎం మోదీ ఏం చేస్తారో చూడాలి.18వ లోక్​సభలో  పీఎం నరేంద్ర మోదీ వర్సెస్  విపక్షం పోరు  మొదలయింది.  గత  లోక్​సభలో డిప్యూటీ స్పీకర్ పదవి లేకుండానే 5 ఏండ్లు గడిచిపోయింది.  అప్పుడు బీజేపీకి 303 సభ్యుల మెజారిటీ ఉండటంతో  పీఎం మోదీ తన చిత్తం వచ్చినట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు.  విపక్ష సీఎంలను, మంత్రులను,  ప్రజా ప్రతినిధులను జైల్లో పెట్టారు. 

మోదీ పాలనలో అప్రజాస్వామ్యం

వేల కోట్ల రూపాయల అవినీతి కేసులున్నవారిని తమ పార్టీలో చేర్చుకోవడం,  లేదా తమవైపు తిప్పుకుని ఆయా పార్టీలను చీల్చడం, వారికి సీఎం పదవులు, మంత్రి పదవులు ఇవ్వడం,  ప్రభుత్వాలను కూల్చడం, విపక్ష పార్టీల అస్తిత్వం దెబ్బతీయడం చేశారు.  టోటల్ గా అప్రజాస్వామ్యమే.  ప్రశ్నించినవారిని జైలుకు పంపడం షరామామూలు అయిపోయిన పరిస్థితి. మూడోసారి ఇప్పుడు మోదీ ఎన్డీయే పక్షం ఎంపీల సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ  రాలేదు. 230 స్థానాలే వచ్చాయి. అయినా ఆయన మంత్రివర్గంలో గతంలో బీజేపీకి 303 సీట్లు ఉన్నపుడు ఎలా మంత్రి పదవులను పీఎం మోదీ ఆయన మనుషులకు కట్టబెట్టారో,  ఈసారి అలాగే మంత్రివర్గ కూర్పు ఉంది.  పెద్ద  తేడా లేదు.  తినే కంచం గుంజుకుని ఎంగిలి మెతుకులు వేసినట్లు, వారి మద్దతు తీసుకుని, చిన్న పోర్ట్ పోలియోల మంత్రి పదవులను, ఎన్డీయే  పక్షాలకు విదిలించారు అనక తప్పదు. ---కీలక మంత్రి పదవులు అన్నీ పీఎం అనుయాయులకే దక్కాయి.  ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ  స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలి. కానీ,  దీనిపై అధికార కూటమి సానుకూల నిర్ణయం ప్రకటించలేదు. 

ఏకపక్షంగా బీజేపీ తీరు

ఓం బిర్లాను స్పీకర్ చేసే ఆలోచన బీజేపీ ఏకపక్షంగా చేసింది. ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఎంపిక చేసిన ప్రోటెం స్పీకర్ విషయంలోనూ బీజేపీ ఏకపక్షంగానే వ్యవహరించింది. ఈ విషయంలో కాంగ్రెస్ సహా, విపక్షాలు అన్నీ నిరసన తెలిపాయి. ఈ పరిణామం పీఎం మోదీకి షాక్ కాగా,  స్పీకర్ ఎంపిక పట్ల కూడా మోదీ ఏకపక్ష నిర్ణయంపై ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేసింది.. ఎనిమిదిసార్లు ఎంపీగా ఎంపిక అయిన సురేష్ ను విపక్షం తమ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించి తమ నిరసన వ్యక్తం చేసింది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి అయినా విపక్షంకు దక్కుతుందా? అసలు ఆ పదవి ఎంపిక జరుగుతుందా? అనే అనుమానాలూ ఉన్నాయి.---- బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు ఏకు మేకు అయ్యాయి.----రాజ్యాంగం పుస్తకాలను చేత బూని ఇండియా కూటమి ఎంపీలు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న తీరు ఒక ట్రైలర్ మాత్రమే.  పిక్చర్ అబీ బాఖీ హై  మోదీజీ!  గతంలో మాదిరిగా.. ఒకేసారి ప్రభుత్వాన్ని నిలదీసిన 66 మంది ఎంపీలను, ఆతర్వాత  మొత్తంగా 140 మంది పై చిలుకు ప్రతిపక్షాల ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ఇప్పుడు చేయలేరు. ఇప్పటికే ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాది పార్టీ ఎంపీ అఖిలేశ్​యాదవ్, ఇతర విపక్ష పార్టీల ఎంపీలు స్పష్టం చేశారు. 

చంద్రబాబు, నితీశ్​చేతిలో..మోదీ సర్కారు రిమోట్​

ప్రధాని మోదీ తన ఇష్టారాజ్యంగా పాలనను ఇక కొనసాగించలేరు.  ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి చెందిన ప్రశ్నించే ఉక్కు సంకల్పం గల ఎంపీలు పీఎం మోదీపై ధ్వజమెత్తుతారు. మొత్తానికి మూడోసారి  ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మోదీ తానా షాహిగిరికి కొంత కంట్రోల్ ఉంటుందనిపిస్తున్నది.  కాస్త ధైర్యం చేస్తే  మోదీ ప్రభుత్వం రిమోట్ తమ చేతిలో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, అటు జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్​కుమార్  కొంత అయినా న్యాయంగా ప్రభుత్వం నడిచేవిధంగా చూడొచ్చు! ఇప్పటికే ఇండియా కూటమిని చూసి ఆందోళన చెందుతున్న  పీఎం మోదీకి, ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భాగవత్ కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు, ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల తెలుస్తున్నది.  బీజేపీలోని కొందరు సీనియర్లు  కూడా మోదీపై అసంతృప్తి గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వెరసి అబ్​కీ బార్  పాంచ్ సాల్ సర్కార్  నిలబెట్టుకోవడం పీఎం మోదీకి కష్టంగానే కనిపిస్తున్నది.   మోదీ హామీలు, మాటలు నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి దేశమంతా స్పష్టంగా కనిపిస్తున్నది. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు పెరిగాయి.  రాహుల్ ప్రతిపక్ష నేతగా మరింతగా ప్రజలకు చేరువ కావాలి.   ప్రభుత్వం తప్పు చేస్తే  నిలదీసే నేతగా  పార్లమెంటులో ముందుంటారని,  పీడిత, అణగారిన వర్గాల ప్రజల గుండె చప్పుడు అవుతారని ఆశిద్దాం! --------------------------------

- ఎండి మునీర్,
 సీనియర్ జర్నలిస్ట్