తన ఫ్యాన్స్‌ను, పొలిటికల్ సర్కిల్స్‌ను ఇన్నాళ్లూ సస్పెన్స్‌లో పెట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఎంతో ఊగిసలాట తర్వాత జనవరిలో పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే నెక్స్ట్ సీన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద పజిల్ గా మారింది. ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతోంది. అందులోని స్పెషాలిటీలు ఏమిటి?. జనం రియాక్షన్ ఎలా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు? ఇవన్నీ అందరికీ వస్తున్న ప్రశ్నలు.
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ ఈ నాటిది కాదు. 90ల్లోనే దీనిపై రూమర్లు మొదలయ్యాయి. అయితే 2017లోే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ స్వయంగా ప్రకటించారు. అభిమానులతో వరుస సమావేశాలు కూడా పెట్టారు. 2018లో జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల టైమ్‌లోనూ రజనీ పార్టీ పెట్టలేదు. పోటీ చేయలేదు. గత కొన్ని నెలలుగా రజనీ పార్టీపై ప్రచారం ఊపందుకుంది. బీజేపీతో జత కడతారని, సొంతంగా పోటీ చేస్తారని ప్రచారాలు జరిగాయి. అందరివాడుగా ఉన్న తాను కొందరివాడినే అవుతానేమో అనే డైలమాలో ఆయన ఇన్నాళ్లూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రవేశంపై ఫైనల్‌గా ప్రకటన చేశారు.
డబ్బు ఖర్చు పెట్టకుండా ఓట్లు పడతాయా?
స్పిరిట్యువల్ పాలిటిక్స్‌తో పాటు తన పార్టీ కరప్షన్ ఫ్రీ, హానెస్ట్, ట్రాన్స్పరెంట్, సెక్యులర్‌గా ఉంటుందని రజనీ చెప్పారు. సాధారణంగా తమిళనాడులో కులాలకు సంబంధించిన ఇష్యూలు ఎక్కువ. కానీ కులాలతో సంబంధం లేకుండా పార్టీని నడపడం కత్తి మీద సాములాంటిదే. ఇంకా మనీ పాలిటిక్స్ కూడా తమిళనాడులో ఎక్కువే. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి 20–30 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతి ఆరోపణలు కామన్. అలాంటి చోట డబ్బులు ఖర్చుపెట్టకుండా పోటీ చేయడం సాధ్యమేనా? అలా చేస్తే జనం ఓట్లు వేస్తారా? అనేది చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
త్రిముఖ పోటీ తప్పదు
తమిళనాడులో ఇప్పటి వరకూ అన్నాడీఎంకే, డీఎంకేకి జనం పట్టం కడుతూ వచ్చారు. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తే.. ఐదేండ్ల తర్వాత మరో పార్టీని గద్దెనెక్కించే వారు. దీనికి 2016లో జయలలిత చెక్ పెట్టారు. 40 ఏండ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టారామె. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానితో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి. రజనీ ఎంట్రీ తర్వాత త్రిముఖ పోటీలో ఎవరికి ఎడ్జ్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే చాలా స్ట్రాంగ్‌గా మారింది. అన్న అళగిరి కూడా తమ్ముడికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు జయలలిత తర్వాత అన్నాడీఎంకేకి సరైన వారసుడు లేరు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కలిసిపోయినా సరే ఆ పార్టీకి ఒక ఫేస్ అనేది ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీని స్టాలిన్ నిలువరించగలడా? లేదంటే స్టాలిన్‌కు చెక్ పెట్టి రజనీనే మెజారిటీ దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరమైన విషయమని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
నాలుగు నెలలు సరిపోతుందా?
ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్న సమయంలో రజనీ పార్టీ పెడుతున్నారు. నాలుగు నెలల్లోనే ఆయన ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పార్టీ పెట్టిన నాలుగు నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధిస్తే ఎన్టీఆర్ రికార్డును రజనీ తిరగరాస్తారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో మెచ్యూరిటీ పెరిగింది. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరనే క్లారిటీ వారికి ఉంది. ఈ పరిస్థితుల్లో రజనీని తమిళ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ గెలిచారు. కానీ, చిరంజీవి, పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టి గెలవలేకపోయారు. మరి ఎన్టీఆర్‌లా రికార్డు క్రియేట్ చేస్తారా? అనేది చూడాలి.
క్రేజ్, ఫాలోయింగ్ పైనే ఆశలు
గట్టిగా ఆర్నెల్లు కూడా లేదు. పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా ఎన్నికల్లో గెలవడం అనేది అంత సులువైన అంశం కాదు. సినిమా అభిమానంతో ఆయన గెలుపు సాధ్యమవుతుందా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. తమిళనాడులో ఫ్యాన్స్ పరంగా రజనీనే నంబర్‌వన్. ఆయనకు లెక్కలేనన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రజనీ ఏజ్ 71. కొత్తతరం హీరోలు సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. సూర్య, అజిత్, విజయ్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. రజనీ అభిమానులు వారి మధ్య చీలిపోయారు. ఇప్పుడు వారి సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది కీలకం కానుంది.
వివాదాలు ఉన్నాయి
తమిళనాడులో సూపర్ స్టార్ అయినా రజనీ పుట్టింది మహారాష్ట్రలో. అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. పని చేసింది కర్నాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌గా. కావేరి అంశంపై జాతీయ విధానం కావాలి, రివర్ లింకింగ్ ప్రాజెక్టులు కావాలని రజనీ చెప్పడంతో అది వివాదాస్పదమైంది. రజనీ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాకపోవడం వల్లే కర్నాటకకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారనే వాదనను కొందరు లేవనెత్తారు. ఇప్పుడు ఇదే ఆయుధంగా డీఎంకే, అన్నాడీఎంకే వాడుకునే చాన్స్ ఉంది.
కమల్, రజనీ చెరోదారి
రజనీ సమకాలికుడైన కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అయితే ఆయన పార్టీ కూడా ద్రవిడ సిద్ధాంతాలనే ఫాలో అయ్యింది. ఎన్ని మీటింగ్‌లు పెట్టినా కమల్‌కు జనాల నుంచి పెద్దగా స్పందన కనిపించ లేదు. ఒక దశలో రజనీ, కమల్ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ, ప్రస్తుతం అది కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కమల్ పార్టీది ద్రవిడియన్ పాలిటిక్స్, రజనీ చెబుతోంది స్పిరిట్యువల్ పాలిటిక్స్ గురించి. అందువల్ల వారి మధ్య పొత్త కుదరకపోవచ్చు.
శశికళ ఎటువైపో
జయలలిత నీడగా పేరున్న శశికళ జనవరిలో జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందనేది ఆసక్తి రేకెత్తించే అంశం. ఆమెకు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు సపోర్ట్‌గా నిలబడని పళనిస్వామి, పన్నీర్‌సెల్వంకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. ఆమె కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. ఒకవేళ శశికళ కొత్త పార్టీ పెడితే ఈక్వేషన్లు ఆసక్తి కరంగా మారతాయనేది ఎనలిస్టుల అంచనా.
స్పిరిట్యువల్ పాలిటిక్స్
తనవి స్పిరిట్యువల్ పాలిటిక్స్ అని రజనీకాంత్ చెప్పారు. తమిళనాడులో రాజకీయాలన్నీ ద్రవిడియన్ పార్టీల సిద్ధాంతాల కిందే నడుస్తుంటాయి. పెరియార్ లాంటి వాళ్లు ఆధ్యాత్మికతకు, భక్తిభావానికి వ్యతిరేకం. రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే దేవుడు లేడని నమ్మే సిద్ధాంతం కిందే పనిచేస్తున్నాయి. భక్తికి దూరంగా ఉన్న పార్టీల పాలన సాగిస్తున్న రాష్ట్రంలో స్పిరిట్యువల్
పాలిటిక్స్ ఎలా నడుస్తాయనేది చూడాలి. ఈ ఫార్ములా ఎంత వరకూ సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో గల్లీకి ఒక గుడి ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా ఎక్కువే. పార్టీలు నాస్తిక భావనలతో పని చేస్తున్నా.. జనాల్లో ఆధ్యాత్మిక భావనకు కొదవ లేదు. ఇలాంటి వారికి లీడర్‌గా రజనీ మారవచ్చని కొందరు పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
క్లీన్ ఇమేజ్
ఎంజీఆర్‌లా.. రజనీకాంత్ కూడా పెద్దలను దోచి పేదలకు పెట్టే రాబిన్‌హుడ్ తరహా సినిమాలే ఎక్కువ చేశారు. అందుకే ఆయనకు మాస్ జనాల్లో ఫాలోయింగ్ ఎక్కువ. ఆయనకు జనంలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఆ క్లీన్ ఇమేజ్ను జనం నమ్మే అవకాశం ఉంది. అది రజనీకి ప్లస్ పాయింట్ అవ్వొచ్చా? ఎన్నికలకు ముందు రజనీ ఒకట్రెండు సినిమాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందులో పొలిటికల్ పంచ్‌లకు కూడా ఆస్కారం ఉంటుంది. అందువల్ల రజనీకాంత్‌కు రాబోయే సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఉంది. అవి పొలిటికల్‌గా రజనీకి చాలా హెల్ప్ అవుతాయి.
ఏజ్ సహకరిస్తుందా?
రజనీకాంత్ ఏజ్ ఇప్పుడు 71. సినిమాల్లో చాలా యాక్టివ్గానే ఉంటారు. కానీ, పాలిటిక్స్ అంటే ఆయన జనం మధ్య తిరగాలి. తమిళనాడు మొత్తాన్ని చుట్టి రావాలి. అదే ఎలక్షన్ టైం అంటే ఒక్క రోజులోనే అనేక సభల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఏజ్‌లో ఆయన ఇంత ఎక్కువగా తిరగగలుగుతాడా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇటీవల ఆయనే స్వయంగా చెప్పారు. అందువల్ల శరీరం ఎంత వరకు సహకరిస్తుందనేది కూడా ఇంపార్టెంటే.
for more News….
కరెంటు పోల్ ఎక్కడం కోసం.. కోర్టు మెట్లెక్కి గెలిచింది
మొక్కల పెంపకంలో కొత్త ట్రెండ్ మొదలుపెట్టిన రిటైర్డ్ టీచర్
దేశంలోని మహిళా సంపన్నుల్లో 10మంది హైదరాబాదీలు
for Live updates watch