నియోజకవర్గాల పునర్విభజన ముప్పుగా మారనుందా?

నియోజకవర్గాల పునర్విభజన ముప్పుగా మారనుందా?

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు  తమ పూర్వ వైభవాన్ని కోల్పోయి, జనసంఖ్య అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు  లోక్​సభలో  అత్యధిక సభ్యుల  ప్రాతినిధ్యంతో   తమ ప్రాబల్యాన్ని పెంచుకుని, దక్షిణాది రాష్ట్రాల పట్ల మరింతగా వివక్షత ప్రదర్శించే  అవకాశముంది. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలైన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు,  కర్నాటక,  తమిళనాడులకు  లోక్ సభలో కొద్దిపాటి సీట్ల సంఖ్య పెరిగినా, ఉత్తరప్రదేశ్,  బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే పెరిగే సీట్ల సంఖ్య బహుస్వల్పం.  నియోజకవర్గాల పునర్విభజన వలన ఉత్తర ప్రదేశ్​లో  లోక్​సభ సీట్ల సంఖ్య 80 నుంచి 144కు, బిహార్​లో 40 నుంచి 79కి పెరగవచ్చు. అదే దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్​లో  కేవలం  6 సీట్లు,  తెలంగాణలో 5సీట్లు, తమిళనాడులో 10 సీట్లు, కర్నాటకలో 13 సీట్ల వరకు మాత్రమే పెరిగే అవకాశముంది. 

ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ విషయంలో కఠిన నిబంధనలు పాటించిన పలు దక్షిణభారత రాష్ట్రాలు జనాభా సంఖ్యను భారీగా  పెంచడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. జనాభా విస్ఫోటనం వలన   పేదరికం  పెరిగి, ప్రజల జీవన  ప్రమాణాల స్థాయి మరింతగా   పడిపోవచ్చు.  విద్య,  వైద్యం ఉపాధి అందని ద్రాక్షలా మధ్యతరగతి ప్రజల జీవితాలను  అధః పాతాళానికి దిగజార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను ఊహించే అప్పటి కేంద్ర నాయకత్వం నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేసి ఉండవచ్చు.  చట్టసభల సీట్ల పెంపుదల విషయంలో సమగ్రమైన అధ్యయనం జరగాలి. చిన్న రాష్ట్రాలకు లోక్  సభలో తగు ప్రాతినిధ్యం ఉండేలా  రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు  జరగాలి. 

- సుంకవల్లి సత్తిరాజు