ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గోదావరిఖని, వెలుగు: కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని సింగరేణి జీఎం ఆఫీస్‌‌‌‌ ముందు కాంట్రాక్టు కార్మికులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి దృష్టికి అంశాన్ని తీసుకువెళ్తానన్నారు. అనంతరం బీజేపీ స్టేట్‌‌‌‌ లీడర్‌‌‌‌ కౌశిక హరి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులర్ కార్మికులతో సమానంగా వారికి అన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌‌‌‌లో మేయర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌, సింగరేణి కార్మిక సంఘాలు, జేఏసీ లీడర్లు యాకయ్య, రాజారెడ్డి, ఎల్లాగౌడ్‌‌‌‌, కుమారస్వామి,  రమేశ్‌‌, తదితరులు మాట్లాడారు. 

చట్టాలపై అవగాహన అవసరం 

కోరుట్ల,వెలుగు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల ప్రిన్సిపల్ డిస్ర్టిక్ట్ అండ్ సెషన్స్​ జడ్జి జి.నీలిమ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జె.నీహారిక అన్నారు. శుక్రవారం కోరుట్లలోని మహిళా డిగ్రీ రెసిడెన్షీయల్ కాలేజీలో నిర్వహించిన న్యాయ విజ్క్షాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో జరుగుతున్న సంఘటనల,  పలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్​ ప్రాసిక్యూటర్ కె.మాధవి, ఏజీపీ రాజేంద్రప్రసాద్, బార్ అసోసియేషన్ సెక్రటరీ రాజేశ్, న్యాయవాదులు పాల్గొన్నారు.

నిర్వాసితుల ముందస్తు అరెస్ట్ 

బోయినిపల్లి, వెలుగు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. మిడ్ మానేర్ ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్ తోపాటు పలువురు నిర్వాసితులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జి మేడిపల్లి సత్యం పోలీస్ స్టేషన్ కు చేరుకుని సంఘీభావం తెలిపారు.

‘ధర్మారంను  మండలం చేయాలి’

కోనరావుపేట, వెలుగు: మండలంలోని ధర్మారం కేంద్రంగా కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ, నాయకులు కోరారు. శుక్రవారం వేములవాడకు వచ్చిన మినిస్టర్​కేటీఆర్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనరావుపేట మండలంలో 2011 జనాబా లెక్కల ప్రకారం 48 వేల జనాభా, 28 గ్రామ పంచాయతీలు 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. 12 గ్రామాలతో, 19,500 జనాభాతో ధర్మారం గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసే వీలుందని, పాలనా సౌలభ్యం కోసం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని అన్నారు.

స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలని బీసీ సంక్షేమ పౌర సరఫరల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ చౌక్ లో కూడళ్ల సుందరీకరణ పనులు, గణేశ్​నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావుతో కలసి మంత్రి పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి వరకు స్మార్ట్ సిటీ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గణేశ నగర్ బైపాస్​రోడ్డును దసరా వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలోని అన్ని జంక్షన్లు అభివృద్ధి చేయాలని, ఇండోనేసియా తరహాలో కళాక్షేత్రం ఆకృతులు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ స్వరూపారాణి, కార్పొరేటర్లు ఐలేందర్, శ్రీకాంత్, రాములు, వేణుగోపాల్, నగర కమిషనర్ ఇస్లావత్ ఉన్నారు.  

కాంట్రాక్టు కార్మికుల చర్చలు విఫలం

  •     20వ తేదీకి వాయిదా
  •     అప్పటిదాకా సమ్మె కొనసాగింపునకు లీడర్ల పిలుపు

గోదావరిఖని, వెలుగు: సెప్టెంబర్​ 9వ తేదీ నుంచి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె డిమాండ్లపై శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో డిప్యూటీ సీఎల్‌‌‌‌సీ ఆఫీస్‌‌‌‌లో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు, జేఏసీ లీడర్లకు మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇందులో ఆర్థిక అంశాల గురించి తమకు సంబంధంలేదని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ చెప్పడంతో జేఏసీ లీడర్లు డిప్యూటీ సీఎల్‌‌‌‌సీ ఆఫీస్‌‌‌‌లో కింద కూర్చుని నిరసన తెలిపారు. దీంతో మళ్లీ 20వ తేదీన చర్చలకు రావాలని డీసీఎల్‌‌‌‌సీ పిలిచారు. అయితే అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ లీడర్లు ప్రకటించారు. చర్చల్లో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ తరుపున పర్సనల్‌‌‌‌ జీఎం ఎ.ఆనందరావు, సివిల్‌‌‌‌ జీఎం రమేశ్‌‌‌‌బాబు, పర్సనల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ తిరుపతి, కార్మిక సంఘాల జేఏసీ తరుపున లీడర్లు జి.సత్యనారాయణ, బి.మధు, ఏ.వెంకన్న తదితరులు 
పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా కరుణాకర్

జమ్మికుంట, వెలుగు : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా తాడూరి కరుణాకర్, జనరల్ సెక్రటరీగా గాండ్ల సంపత్​ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్​(టీయూడబ్ల్యూజే) సంఘ కార్యవర్గాన్ని జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్​లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. నలుగురు ఉపాధ్యక్షులుగా, నలుగురు జాయింట్ సెక్రటరీలుగా, ఒకరు ట్రెజరర్​గా, 19 మంది జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం ఎన్నికల అధికారులు ఎండీ ఫజల్ రహ్మన్​, ఐలు రమేశ్​తెలిపారు. కార్యక్రమంలో సీనియర్​ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

దళితబంధు పథకం చాలా బాగుంది

కరీంనగర్ సిటీ, వెలుగు: దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న దళితబంధు పథకం చాలా బాగుందని నీతి అయోగ్ కమిటీ సభ్యులు ప్రశంసించారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలో  విశ్వనాథ్ బిష్ణయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించారు. సమాజంలో దళితులు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు కుమార్ జైన్, నిఖిత జాయిన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ పాల్గొన్నారు.  

నిజాంను తలపించేలా ప్రభుత్వ పాలన

చిగురుమామిడి, వెలుగు: రాష్ట్రంలో నిజాంను తలపించే పాలన కొనసాగుతోందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చిగురుమామిడి మండలం బొమ్మెనపల్లిలో జరిగిన బీజేపీ జిల్లా, మండల పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమావేవంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిశ్రీనివాస్ గౌడ్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు అన్నారు.శుక్రవారం షెడ్యూల్డ్ కులాల సేవా సహకారం అభివృద్ధి సంస్థ లిమిటెడ్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో కోరుట్లలో స్కిల్ డెవలప్​మెంట్ కోర్సుల్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మణ్, సీఆర్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు మూర్తి, సెంటర్ హెడ్ రవి, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, కమిషనర్ అయాజ్, ఎంపీపీ నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య,  కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

ముంపు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?

కోనరావుపేట,వెలుగు : ముంపు గ్రామాల సమస్యలు పట్టని ప్రభుత్వం ఎందుకని వేములవాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు, వేములవాడ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు కనకయ్యతో పాటు మండల నాయకులను అరెస్టు చేసి కోనరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని శ్రీనివాస్​ వారిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వానికి మిడ్ మానే ర్ నీళ్లు తప్ప నిర్వాసితుల కన్నీళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు ఎప్పుడొస్తే అప్పుడు ముంపు గ్రామాల ప్రజలను అరెస్టులు చేస్తూ గొంతులను నొక్కేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎల్లయ్య, లీడర్లు లక్ష్మారెడ్డి, నందు గౌడ్ తదితరులు ఉన్నారు.