అఫ్గాన్‌ను తాలిబాన్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడంతో దేశం విడిచి పారిపోయిన మాజీ డిప్యూటీ హోం మినిస్టర్, జనరల్ ఖోషల్ సాదత్ మళ్లీ వెనక్కి వచ్చేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. తాను పెట్టే కండిషన్లకు ఓకే చెప్పి.. హామీ ఇస్తే తాలిబాన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో పాటు దేశానికి వచ్చి మళ్లీ అఫ్గాన్ ఆర్మీని దారిలో పెడతానని చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్‌లను ట్రాక్‌లో పెట్టి నడిపిస్తానని వెల్లడించారు. ఇందుకోసం తాలిబాన్లు చేయాల్సిందిల్లా అఫ్గాన్ జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడంతో పాటు మహిళల హక్కులకు రక్షణ కల్పిస్తామని మాటిస్తే చాలని సాదత్ తెలిపారు. ఆయన పెట్టిన ఈ కండిషన్లను వివరిస్తూ పాఝ్‌వోక్ అఫ్గాన్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.
د کورنیو چارو وزارت پخوانی امنیتي مرستیال جنرال خوشحال سعادت: له طالبانو سره مې خبرې کړې دي؛ که هغوی ملي سرود، ملي بیرغ، د ښځو حقونو او د خلکو خصوصي حریم ته درناوی وکړي، بېرته هېواد ته ستنېږم، له نوي حکومته ملاتړ اعلانوم او د افغانستان هوايي او ځانګړي ځواکونه بېرته پر پښو دروم. pic.twitter.com/v6LVjO3QMT
— Pajhwok Afghan News (@pajhwok) September 3, 2021
దేశం విడిచి పారిపోయిన సైనికులు, ఎయిర్‌ఫోర్స్ పైలట్లు
అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో జనరల్ ఖోషల్ సాదత్ దేశం విడిచి పారిపోయారు. దానికి ముందు ఆయన అఫ్గాన్ డిప్యూటీ హోం మినిస్టర్‌గా, పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయన బ్రిటన్‌లోని రాయల్ మిలటరీ అకాడమీ, బ్రిటన్ ఆఫీసర్ ట్రైనింగ్ కాలేజీ, అమెరికాలోని యూఎస్ ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని, ట్రైనింగ్ పొందారు. ఆ తర్వాత 2003లో అఫ్గాన్ పోలీస్ ఫోర్స్‌లో చేరారాయన.
కాగా, తాలిబాన్లు అఫ్గాన్‌పై పూర్తి పట్టు సాధించిన సమయంలో తమ ప్రాణాలకు ఎక్కడ హాని తలపెడతారోనన్న భయంతో అఫ్గాన్ సైనికులు, ఎయిర్‌ఫోర్స్ పైలట్లు దేశం విడిచి పారిపోయారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉజ్బెకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాను తిరిగి వస్తే ఇలాంటి వాళ్లందరినీ స్వదేశానికి రప్పించి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లను మళ్లీ దారిలో పెడతానని జనరల్ సాదత్ చెబుతున్నారు.