ప్రజామోదం లేని యుద్ధం గెలుస్తుందా?

గత ఎనిమిది నెలల్లో జరిగిన రెండు యుద్ధాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. అనేక చర్చలకు దారి తీశాయి. అవి ఆఫ్గనిస్తాన్ లో ప్రభుత్వ దళాలకు, తాలిబన్ కు జరిగిన యుద్ధం మొదటిది కాగా, ప్రస్తుతం ఉక్రెయిన్ కు రష్యా కు జరుగుతున్న యుద్ధం రెండవది. ఈ రెండింటి నేపథ్యం, రాజకీయ పరిస్థితులు, నాయకత్వాలు వేర్వేరు. అయితే యుద్ధం ఫలితాలను ఏయే విషయాలు ప్రభావితం చేస్తాయనే దానిపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసలు యుద్ధాల్లో విజయం సాధించాలంటే ఏం కావాలి? ఆయుధాలా?, యుద్ధ సన్నద్ధతనా? నాయకత్వమా?..అలాగే యుద్ధాల్లో విజయం సాధించేందుకు ప్రేరణేమిటి? భావజాలమా? మతమా? దేశభక్తి లేదా జాతీయవాదమా? లాంటి ప్రశ్నలు కొన్ని ఉత్పన్నమవుతాయి. వీటికి సమాధానం పసికట్టగలిగితే ఆఫ్గనిస్తాన్ లో అధ్యక్షుడు దేశం వదిలి పోవడానికి, ప్రభుత్వ సైన్యాలు తాలిబన్ ముందు లొంగిపోవడానికి, ఉక్రెయిన్ రష్యా భీకర దాడులను ఎదుర్కొని నిలబడగలగడానికి గల కారణాలు బోధపడతాయి.

ప్రపంచ చరిత్రలో చాలా యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి. విస్తరణ వాదం, అధికార కాంక్ష, వనరులను నియంత్రించాలనే కోరిక, స్వాతంత్ర్య కాంక్ష, జాతీయ, మతపరమైన ధోరణులు కారణం అయి ఉండొచ్చు. యుద్ధానికి సంబంధించి తాత్విక, రాజకీయ, ఆర్థిక, న్యాయ, సామాజిక, మానసిక విశ్లేషణ విధానాలు ఉన్నాయి. అవి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యుద్ధానికి గల కారణాలను ప్రతిపాదించినప్పటికీ, సామాజికంగా, రాజకీయంగా యుద్ధ విశ్లేషణ అత్యంత సంక్లిష్ట వ్యవహారం. కాబట్టి ఏ ఒక్క దృక్కోణంలోనో చూడకుండా అన్నీ కలగలిపిన సాంప్రదాయ న్యాయ సిద్ధాంతం ప్రకారం విశ్లేషించడం మేలు. 

న్యాయ సిద్ధాంతం

జస్ట్ థియరీ(న్యాయ సిద్ధాంతం) ప్రకారం యుద్ధం న్యాయమైనదిగా గుర్తింపు పొందడానికి రెండు ప్రాథమిక సూత్రాలు దోహదం చేస్తాయి. అవి యుద్ధం చేసే హక్కు, యుద్ధ సమయాల్లో వ్యవహరించాల్సిన తీరు. ఏ యుద్ధమైనా న్యాయపరమైన యుద్ధంగా చూడటానికి 13వ శతాబ్దంలో థామస్ అక్వినాస్ తన సమ్మరీ ఆఫ్ థియోలజీ లో రెండు సూత్రాలను ప్రతిపాదించాడు. వాటి ప్రకారం.. ప్రతి యుద్ధానికి ప్రజామోదం ఉండాలి. దాంతో పాటు యుద్ధాన్ని ప్రజలు గుర్తించిన ప్రభుత్వం ప్రకటించాలి. అప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. వీటితోపాటు శాంతిని నెలకొల్పడం, మానవతా సాయం, లాంటి సరైన ఉద్దేశాలతో చేసే యుద్ధాలకు కూడా చట్టబద్ధత, నైతికత ఉంటాయి. వీటిలో ప్రజామోదం అతి ముఖ్యమైన అంశం. యుద్ధాల్లో విజయం సాధించడమనేది ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటనే వాటిపై ఆధారపడి ఉంటాయి. లక్ష్యాలు సాధించడం ఎంత సంక్లిష్టమైతే విజయం అంత గందరగోళమవుతుంది.

యుద్ధం వల్ల నష్టమని తెలిసినా..

యుద్ధం వల్ల అనేక కఠిన పరిస్థితులను, విధ్వంసాలను ఎదుర్కోబోతున్నామని తెలిసిన తర్వాత కూడా యుద్ధానికి ప్రజామోదం ఎందుకు, ఎప్పుడు లభిస్తుందన్నది ప్రశ్న.  దీనికి సమాధానం 1977లో మైఖేల్ వాల్ట్స్​తన ‘జస్ట్​ అండ్​ అన్​ జస్ట్​వార్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. యుద్ధం చేయడం నైతికంగా అనివార్యమైన, అవసరమైన, అస్తిత్వం కాపాడుకునేందుకు తప్పించుకోలేని తక్షణ చర్య అనే భావం ప్రజల్లో పెంపొందించినప్పుడు, యుద్ధానికి ప్రజామోదం లభిస్తుంది. అయితే ఇలా ప్రజలను ఒప్పించడానికి కావాల్సిన ఉత్ప్రేరకాలు ఏమిటి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. పాశ్చాత్య చరిత్రను గమనిస్తే17వ శతాబ్దం వరకు మతం, 19వ శతాబ్దం వరకు ఫ్రెంచ్ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం లాంటి ఆదర్శభావాలు, ఆ తర్వాత జాతీయత, జాతి ప్రయోజనాలు లాంటి జాతీయభావాలు ప్రముఖ పాత్ర పోషించాయి. 20వ శతాబ్దంలో అవలంబించిన మార్గాల్లో మతం, ఆర్థిక-సామాజిక సిద్ధాంతాలు, దేశభక్తి... ఈ మూడింటిని ఆయా సందర్భాల్లో వేర్వేరుగానూ, లేదా కలగలిపి ప్రజలను ఏకీకృతం చేయడానికి ఉపయోగించడం గమనించవచ్చు. జాతి ప్రయోజనాలు ఈ మూడు అంశాలతో ముడిపడి ఉందని, వీటిలో దేనికో ఒక దాని అస్తిత్వానికి  ముప్పు ఉందని, ఆ ముప్పుని ఒక శత్రువుగా భావించి, దాన్ని ఎదుర్కోవడం ఒక నైతిక బాధ్యతగా, ధర్మంగా, అంతిమ గమ్యంగా ప్రజల భావోద్వేగాలను ఉసిగొల్పడం కనిపించేది. 

ముందస్తు దాడుల సిద్ధాంతం..

20వ శతాబ్దం నుంచి జాతీయవాదం ఎంత ప్రబలంగా విస్తరించిందంటే.. అది రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమవడమే గాకుండా, గతంలో ప్రముఖపాత్ర పోషించిన మతం, స్వేచ్ఛ లాంటి భావనలన్నీ జాతీయవాదంలోనే ఇమిడిపోయేలా చేసింది. మరింత ముందుకుపోయి ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలు సైతం జాతీయత ఆధారంగా జరిగే స్వాతంత్ర్య పోరాటాలకు, దేశాలు స్వీయ రక్షణకు, సార్వభౌమాధికారం కోసం సాయుధ పోరాటం చేసే హక్కును తన చార్టర్ చాప్టర్ 7 ఆర్టికల్ 51లో గుర్తించింది. ఈ థియరీ మరింత పదునుదేలి 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రతిపాదించిన ముందస్తు దాడుల సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. దాని ప్రకారం ప్రతి దేశానికి ఇతర దేశాల వల్ల, వ్యక్తుల వల్ల, తీవ్రవాద సంస్థల వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనుకున్నపుడు ముందస్తు దాడులు చేసే అధికారం ఉంటుంది. అయితే ఈ ముందస్తు దాడుల సిద్ధాంతానికి 2001లో అమెరికా గడ్డ మీద అల్​ఖైదా జరిపిన మారణ హోమం నేపథ్యమే, తీవ్రవాదంపై యుద్ధానికి ప్రజామోదం లభించడానికి కారణమైంది.

రష్యా యుద్ధానికి ప్రజామోదం ఏదీ?

 స్వీయ రక్షణ ముందస్తు దాడుల  సిద్ధాంతం ప్రకారమే రష్యా – ఉక్రెయిన్ పై దాడికి పాల్పడింది. కానీ, ఉక్రెయిన్ వల్ల తనకు ముప్పు ఉందని, అది నాటోలో చేరితే మరింత ప్రమాదమని ఊహించి చేసిన దాడులే తప్ప, దానికి భావోద్వేగాల ఫలితం వల్ల జనించిన ప్రజామోదం లేదు. అసలు తాము ఎందుకోసమని, ఏయే లక్ష్యాలు సాధించడానికి యుద్ధం చేస్తున్నామో తెలియని గందరగోళం మధ్య రష్యన్ సైనికులు యుద్ధ రంగంలోకి దిగారు. అందుకే ప్రత్యర్థి కన్నా ఎన్నో రెట్లు బలమైనప్పటికీ ఆశించిన దానికన్నా చాలా వెనకబడిపోయారు. రష్యా విచక్షణ కోల్పోయి మరిన్ని శక్తిమంతమైన, ఆయుధ వ్యవస్థలను ప్రయోగిస్తోంది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారంగా చూసినా రష్యా తీరు సరికాదు. యుద్ధాన్నే జాతీయ విధానంగా చేసుకోవడాన్ని1928లో అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన పారిస్ ఒప్పందం నిషేధించింది. ఆగస్టు1945లో యూరోపియన్ అడ్వైజరీ కమిషన్ అడాప్ట్ చేసుకున్న ‘ది చార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యూన్’ ప్రకారం యుద్ధ సమయాల్లో సాధారణ పౌరులపై జరిగే హింస, యుద్ధ నేరాలుగా పరిగణిస్తారు.

యుద్ధ భూమిలోనే జెలెన్​స్కీ 

దేశ సార్వభౌమాధికారానికే ముప్పు ఏర్పడినప్పుడు, జాతీయ సమగ్రత విఛ్చిన్నం అవుతున్నప్పుడు, జాతి అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు ప్రజల్లో ఏర్పడే భావోద్వేగాలు ముందు ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఉసిగొల్పుతాయి. అందుకే ఫిబ్రవరి 24 న రష్యా ఉక్రెయిన్ పై దాడి మొదలు పెట్టగానే మూడు నాలుగు రోజుల్లో రష్యా ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకుంటుందని, నాటో  దేశాలు ఎంత సాయం చేసినా, బలమైన రష్యా ను అడ్డుకోవడం దానికి సాధ్యం కాదని చాలామంది విశ్లేషకులు ఆభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నా, సుమారు100 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినా, నెల రోజులుగా రష్యా ను ఎదురిస్తూనే ఉంది. ఉక్రెయిన్ ప్రస్తుత యుద్ధంలో ఇంకా నిలబడి ఉండటానికి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఒక ముఖ్య కారణం. మతం, ఆర్థిక-సామజిక సిద్ధాంతాలు, దేశభక్తి ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని ప్రజల్లో ప్రేరేపితం చేయలేకపోవడం, వాటి అస్తిత్వానికి ప్రమాదం ఉందని ప్రజలను ఒప్పించలేకపోవడం వల్లే అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, అతని సహచరులు దేశం వదిలి పారిపోయారు. మనం చూసిన అఫ్గాన్​కు ఉక్రెయిన్​కు ఉన్న తేడా ఇదే.

:: డాక్టర్ గద్దె ఓంప్రసాద్,

అసిస్టెంట్​ప్రొఫెసర్, 

సెంట్రల్ వర్సిటీ, సిక్కిం