ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక్కసారి కూడా రాజకీయ వేదికపై నుంచి ప్రసంగం చేయలేదు. అయినా ఆమెను చూస్తే అన్ని పార్టీలు భయపడుతున్నాయి. ఆమెను ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, వారిని ఎదిరించి నిలిచేందుకు ఆమె రెడీ అవుతోంది. ఇదంతా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ గురించే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఆమె ఎంట్రీతో తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది. శశికళ మరో అమ్మ(అభిమానులు జయలలితను పిలుచుకునే పేరు)గా మారుతుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా?
మూడు దశాబ్దాల పాటు జయలలిత వెంట ఉంటూ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల్లో తెరవెనుక చక్రం తిప్పిన శశికళ జనవరి 27న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె ఎంట్రీ తమిళ రాజకీయాల్లో అలజడి రేపుతున్నది. ముఖ్యంగా శశికళ అధికార అన్నాడీఎంకేను డిఫెన్స్‌లో పడేసింది. తాను క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని ప్రకటన చేయడమే కాదు.. జయలలిత ఎక్కువగా ధరించే పచ్చరంగు చీరలో, ఆమె వాడిన కారులోనే ప్రయాణం చేస్తూ, తానే అమ్మకు అసలైన రాజకీయ వారసురాలిననే సంకేతం ఇస్తున్నారు. తనను బహిష్కరించిన అన్నాడీఎంకే జెండాను కారుకు పెట్టుకుని ఆ పార్టీపై ఆధిపత్యం తనదేనని నిరూపించే ప్రయత్నం చేశారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినా ఆ వివాదం కోర్ట్ పరిధిలో ఉన్నందున ఆమె ఆ పార్టీ నాయకురాలనే వాదనను శశికళ మద్దతుదారులు తెరపైకి తెస్తున్నారు. మేనల్లుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కి శశికళ నేతృత్వం వహిస్తారని భావించినా.. ఆమె అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసమే కన్నేశారని స్పష్టమవుతోంది. చట్టరీత్యా ఆరేండ్ల వరకు శశికళ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినా, పోటీ చేసేలా చట్టపరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు దినకరన్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అప్పట్లోనే మిస్ అయిన సీఎం సీటు
జయలలిత మరణం తర్వాత తాత్కాలికంగా ఓ పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా చేసినా ఆ పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధపడుతున్న సమయంలో జైలు శిక్ష పడింది. ఆమె పట్టుబట్టి పన్నీర్‌సెల్వంను గద్దె దించి, తన మనిషిగా పళనిస్వామిని ముఖ్యమంత్రి చేశారు. కానీ, శశికళ జైలుకు వెళ్లిన తర్వాత పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కలసిపోయి, ఆమెకు వ్యతిరేకంగా మారారు. ఇప్పుడు పళనిస్వామిని మళ్లీ సీఎం కానీయకుండా చేయవలసిన ప్రయత్నాలన్ని శశికళ చేస్తున్నారు. ఈ ఎత్తుగడలను గ్రహించే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే తనను సీఎం అభ్యర్థిగా పార్టీ తీర్మానం చేసేలా పళనిస్వామి చేసుకున్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టారు. డీఎంకే లాంటి అరాచక పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఏఎంఎంకే లక్ష్యమని దినకరన్ ప్రకటించడం గమనిస్తే.. అన్నాడీఎంకే తమతో అవగాహనకు వచ్చేలా చేయడమే శశికళ ఎత్తుగడగా కనిపిస్తోంది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత గత నాలుగేండ్లలో సీఎంగా పళనిస్వామి రాజకీయంగా కొంత బలం పుంజుకున్నారని చెప్పవచ్చు. అధికార యంత్రాంగంపై పట్టు సాధించడంతోపాటు ప్రజల్లో కూడా ఒక నేతగా గుర్తింపు పొందారు. పన్నీర్‌సెల్వం వంటి ప్రత్యర్థులు తనతో రాజీ పడక తప్పని పరిస్థితులు సృష్టించుకోగలిగారు.
గురుమూర్తి కామెంట్ల మర్మం ఏమిటి?
మరోవైపు తుగ్లక్ పత్రిక సంపాదకుడు గురుమూర్తి చేసిన కామెంట్లు కూడా తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, శశికళ కలిసి పోటీ చేయాలని గురుమూర్తి పిలుపుచ్చారు. పరోక్షంగా అన్నాడీఎంకే, శశికళ, బీజేపీ తదితర పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడాలని సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేదికపై ఉండగానే ఆయన ఈ కామెంట్లు చేయడం చూస్తుంటే.. అది వ్యక్తిగత అభిప్రాయం కాదని స్పష్టమవుతోంది. వాస్తవానికి అవినీతి రాజకీయ నేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గురుమూర్తి ఏనాడూ శశికళ పట్ల సానుభూతి చూపలేదు. ఆమె సీఎం పదవి చేపట్టడానికి ప్రయత్నించినా బహిరంగంగానే వ్యతిరేకించారు.
రజనీకాంత్‌తో తలకిందులైన బీజేపీ ఎత్తుగడలు
ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని నాలుగేండ్లుగా ప్రకటిస్తూ వస్తున్న రజనీకాంత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ.. ప్రత్యామ్నాయ రాజకీయ ఎత్తుగడల గురించి ఆలోచన చేయలేదు. ముఖ్యంగా రజనీకాంత్‌తో సన్నిహితంగా ఉండే గురుమూర్తి మాటలు నమ్మి ఎన్నికలకు తగిన విధంగా సన్నాహాలు చేసుకోలేకపోయామని అమిత్‌షా, ఇతర బీజేపీ అగ్రనేతలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తున్నది. అందువల్ల ఇప్పుడు శశికళ విషయంలో బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు అన్నాడీఎంకేతో సంబంధాలను కొనసాగిస్తూనే, మరోవైపు శశికళ వల్ల డీఎంకే వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా నివారించే మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా తమిళనాడులో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. అందువల్ల ఏదో ఒక ప్రధాన కూటమితో పొత్తు ఉంటేనే రాజకీయ ఉనికిని కాపాడుకుంటుంది. గురుమూర్తి మాటలను బట్టి చూస్తే తమిళనాడులో పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. డీఎంకే ప్రభుత్వం ఏర్పడితే అందులో భాగస్వామిగా కాంగ్రెస్ ఉండడం బీజేపీకి ఇబ్బందికరమైన అంశం. అందుకే దినకరన్, శశికళను అన్నాడీఎంకే శిబిరంలోకి తీసుకురావడం డీఎంకే ఓటమికి కీలకమవుతుందని బీజేపీ గుర్తించినట్లు తెలుస్తోంది.
శశికళ ముందు నాలుగు మార్గాలు
ఇప్పుడు శశికళ ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో సంధి కుదుర్చుకుని, అన్నాడీఎంకేలో కీలక పాత్ర వహించే ప్రయత్నం చేయడం ఒకటి కాగా, మేనల్లుడి పార్టీలో ఉంటూనే అన్నాడీఎంకేతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం మరో మార్గం. అందుకు బీజేపీ సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోది డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం. మూడో కూటమి ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి, కొన్ని స్థానాలు గెల్చుకుని, హంగ్ ఏర్పడితే కొత్త సీఎం ఎంపికలో నిర్ణయాత్మక పాత్ర వహించడం నాలుగో మార్గం. ఆ సమయంలో అన్నాడీఎంకేలోని కొన్ని వర్గాలు శశికళతో చేతులు కలిపే చాన్స్ లేకపోలేదు. ఇప్పటికే మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీతోపాటు పలువురు అన్నాడీఎంకే నాయకులు శశికళను పార్టీలో చేర్చుకోవాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పలువురు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని, తగిన సమయంలో బయటకు వస్తారని దినకరన్ కూడా చెబుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీనే తనదంటూ కోర్టుకు
తాజా పరిణామాలు పళనిస్వామిలో కంగారుకు కారణమవుతోంది. శశికళ మద్దతుతో పన్నీర్‌సెల్వం తిరిగి సీఎం పదవి చేపట్టే ప్రయత్నం చేయవచ్చని ఆయన అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి శశికళ జైలు నుంచి విడుదల కాకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో సమాలోచనలు జరిపారు. అయితే ప్రజాకర్షణ విషయంలో స్టాలిన్‌కు పోటీగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం నిలబడలేరు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ తనదేనంటూ శశికళ గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం సంచలనం రేపుతోంది. ఆమెకు ఈ కేసులో తీర్పు సానుకూలంగా వస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు అన్ని రాజకీయ పార్టీల్లో వేడి పుట్టిస్తున్నాయి.
శశికళతో బీజేపీ చేతులు కలుపుతుందా?
అన్నాడీఎంకేలో చీలిక తీసుకొచ్చి అధికారం చేపట్టాలని డీఎంకే నేత స్టాలిన్ ప్రయత్నిస్తున్న సమయంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సయోధ్య కుదిర్చి, వారి ప్రభుత్వం సుస్థిరంగా ఉండేలా చేయడంలో తెరవెనుక బీజేపీ కీలకపాత్ర పోషించింది. అందుకే ఇప్పుడు శశికళ వేయబోయే అడుగుల్లో కూడా బీజేపీ నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉంది. దినకరన్ సొంతంగా ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు ఉపఎన్నికల్లో ఆయన పార్టీ 6 శాతం ఓట్లు సాధించింది. దీంతో ఆ పార్టీతో అవగాహన ఏర్పరచుకోకుండా అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రాలేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నది. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను అధికారంలోకి రానీయకుండా చూడటమే ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యం. దినకరన్ కూడా బీజేపీ నాయకత్వంతో తరచు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అయితే అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళతో పొత్తు బీజేపీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ప్రమాదం లేకపోలేదు.