కవితను తిహార్ జైలుకు పంపుతం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కేసీఆర్  కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది

చౌటుప్పల్, వెలుగు :  తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి సీఎం కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి, కేటీఆర్ ని అమెరికాకు, కవితని తిహార్  జైలుకు పంపుతామని మునుగోడు కాంగ్రెస్  అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చిన్న కొండూరు రోడ్డు, తంగేడుపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్  అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి డిపాజిట్  కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్  చేస్తామని, తిహార్  సెంట్రల్ జైల్లో ఆమె బతుకమ్మ ఆడుతారని పేర్కొన్నారు. పదేండ్లలో కేసీఆర్  కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని, ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్  ప్రారంభమైందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో వంద మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం వస్తే చావు తప్పి కన్నులొట్టబోయి బీఆర్ఎస్  గెలిచిందని ఎద్దేవా చేశారు. తన రాజీనామాతో ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చానని చెప్పారు. కేసీఆర్ కి రెండు సార్లు అవకాశం ఇచ్చినా పేదలకు డబుల్  బెడ్ రూమ్ ఇల్లు రాలేదని, ప్రజలకు రేషన్  కార్డులు అందలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, ప్రజలందరూ కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోనే చౌటుప్పల్ లో డిగ్రీ, పాలిటెక్నిక్  కాలేజీలు తీసుకొస్తానని, హైదరాబాద్  సిటీలాగా చౌటుప్పల్  మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్  నేత పున్న కైలాస, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్  వెన్ రెడ్డిరాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సునామీలో కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతది

మునుగోడు, వెలుగు :  కాంగ్రెస్  సునామీలో కేసీఆర్  ఫ్యామిలీ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది పేదల కోసమని, సీఎం కేసీఆర్  కోసం కాదన్నారు. కేసీఆర్  కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, తమ ప్రభుత్వం రాగానే కేసీఆర్  కుటుంబం జైలుపాలు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నేలికంటి సత్యం, జడ్పీటీసీ నారాబోయిన స్వరూప, డీసీసీబీ డైరెక్టర్  కుమ్మం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.