ప్రస్తుతం సైనిక పాలకుడు అబ్దెల్ ఫతా అల్-బుర్హాన్ అదుపాజ్ఞల్లో సూడాన్ సైనిక దళాలు పనిచేస్తున్నాయి. పారామిలటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్)కి జనరల్ మహ్మద్ హమ్దాన్ డగాలో అధిపతిగా ఉన్నారు. దేశాన్ని మూడు దశాబ్దాలపాటు పాలించిన సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ ను గద్దె దించడంలో వారిద్దరూ కలిసి పనిచేశారు. తాత్కాలిక ప్రభుత్వం రద్దయిన 2021 సైనిక తిరుగుబాటులోనూ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. నూతన వ్యవస్థలో ఎవరు ఎవరికి విధేయులుగా ఉండాలనే అంశంపై ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ సాయుధ దళాల మధ్య తాజా ఘర్షణల్లో సూడాన్ లో ఇంతవరకు వందలాది మంది చనిపోయి ఉంటారని, వేలాది మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. డగాలో చరిత్ర నిష్కళంకమైనది ఏమీ కాదు. మానవ హక్కుల ఉల్లంఘనలకు, అత్యాచారాలు, దౌర్జన్యాలకు పేరుమోసిన జంజావీడ్ ఫోర్సెస్ కి ఆయన నాయకుడుగా వ్యవహరించారు. డార్ఫర్ ఘర్షణల చీకటి చరిత్రలో ఈ దళాలదే ఎక్కువ పాత్ర. అంతర్జాతీయంగా దానిపై హాహాకారాలు చెలరేగడంతో అప్పటి అధ్యక్షుడు బషీర్ 2007లో ఆ దళాలకు బోర్డర్ ఇంటెలిజెన్స్ యూనిట్లను పేరు మార్చారు. బషీర్ కొద్ది మార్పు చేర్పులతో వాటినే 2013లో ఆర్ఎస్ఎఫ్ గా మార్చారు. వాటికి డగాలోని నాయకుడిని చేశారు. బషీర్ కు వ్యతిరేకంగా..2019లో జరిగిన తిరుగుబాటులో డగాలో తగిన పాత్ర పోషించారు. బషీర్ ను పదవీచ్యుతుడిని చేసిన కాలంలో సైనిక ఇన్ స్పెక్టర్ జనరల్ పదవిలో బుర్హాన్ ఉన్నారు. అయితే, అదే సమయంలో, ఖార్తూమ్ లో ప్రజాస్వామ్య అనుకూల బైఠాయింపుదారులపై కాల్పులకు ఆదేశించడం ద్వారా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆ ఘటనలో పెద్ద సంఖ్యలోనే జనం ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. తదనంతరం పౌర నాయకత్వ భాగస్వామ్యంతో సూడాన్ ను పాలించిన తాత్కాలిక సావరిన్ కౌన్సిల్ కి ఆయన డిప్యూటీ అయ్యారు. డార్ఫర్ మారణకాండ సందర్భంలో బుర్హాన్-డగాలోలు చేతులు కలిపారని ప్రతీతి. గల్ఫ్ దేశాల మద్దతుతో బుర్హాన్-డగాలోలు అధికారంపై తమ పట్టును పటిష్టపరచుకుంటూ వచ్చారు. సూడాన్ సాయుధ దళాల్లో వేర్వేరు దళాలకు వీరు నేతృత్వం వహిస్తూ వస్తున్నారు. డగాలో పట్టుబడితే ఆయనను సైనిక న్యాయస్థానంలో విచారిస్తామని బుర్హాన్ చెబుతున్నారు. సూడాన్ ప్రజలకు వ్యతిరేకంగా అనేకానేక విద్రోహాలకు పాల్పడుతున్న బుర్హాన్ ను బందీగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్ఎస్ఎఫ్ వర్గాలవారు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం, సూడాన్ సైనిక దళాలవారు దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది వరకు ఉంటారు. ఆర్ఎస్ఎఫ్ సభ్యులు 70, 000 మంది వరకు ఉంటారు. వీరు సంఖ్యాపరంగా తక్కువైనా మెరుగైన పోరాట పటిమ కలిగినవారని చెబుతారు.
రష్యా ఆయుధాలు
సూడాన్ సైనిక నాయకత్వాన్ని, ఆర్ఎస్ఎఫ్ ను రెండింటినీ దువ్వుతూ రష్యా తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటోందనే అభిప్రాయం ఉంది. సూడాన్ లోని సహజ వనరులను కొల్లగొట్టడానికి అది కిరాయి హంతకుల ముఠా అయిన వాగ్నర్ ను వాడుకుంటోందనే ఆరోపణలున్నాయి. ఆర్ఎస్ఎఫ్ సభ్యులకు రష్యా క్షిపణులు అందుతున్నాయని చెబుతున్నారు. మరోపక్క సూడాన్ సైనిక నాయకత్వంతోనూ రష్యా సంబంధాలను పటిష్టపరచుకుంటోంది. సూడాన్ పొరుగునున్న లిబియాలో వాగ్నర్ అండదండలున్న ఖలీఫా హఫ్తార్ సైనిక పాలన సాగుతోంది. సమకూరుస్తున్న సైనిక, రాజకీయ మద్దతుకు ప్రతిఫలంగా సూడాన్ తూర్పు ప్రాంతంలోని పసిడి నిక్షేపాలను వాడుకునేందుకు రష్యాకు వీలు లభించిందని చాలా కాలం క్రితమే వార్తలొచ్చాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో సూడాన్ లో వాగ్నర్ ఉనికి లేకుండా చేస్తామని సైనిక నాయకత్వం హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక సూడాన్ లో అంతర్యుద్ధం క్రమంగానైనా తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. అది సూడాన్ ప్రాంతీయ సుస్థిరతపై మరింతగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. సూడాన్ కల్లోలం ఆ దేశ సాయుధ దళాలకు చెందిన రెండు విభాగాల మధ్య అధికారంపై పట్టు కోసం సాగుతున్న పోరాటంగా కనిపిస్తున్నా చిక్కుముడులు చాలానే ఉన్నాయి. పోరాటం ఇలానే కొనసాగితే సూడాన్ మరో లిబియాగా తయారవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్), అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు రంగ ప్రవేశం చేసి దేశాన్ని మరింత అతలాకుతలం చేయవచ్చు.
ఆది నుంచి ఆందోళనలే
సూడాన్ భౌగోళికంగానే కాదు, జనాభాలోని వివిధ వర్గాల వారీగాను ఎంతో వైవిధ్యమైనది. దేశ ఉత్తర, తూర్పు, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో రకరకాల తెగలవారున్నారు. ఉత్తరాది, దక్షిణాది మధ్య వివక్షను ప్రజలు ప్రబలంగా గమనించారు. అదే దక్షిణాది ఆ దేశం నుంచి 2011లో విడిపోయి సౌత్ సూడాన్ గా ఏర్పడడానికి కారణమైంది. దక్షిణాన క్రైస్తవులు, ఉత్తరాన ముస్లింల ప్రాబల్యం ఎక్కువని చెబుతారు. 1983లో మొదలైన అంతర్యుద్ధం 2005లో ముగిసి శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినపుడు దక్షిణాదివారికి స్వయం నిర్ణయాధికార హక్కు లభించింది. ఆ తర్వాత ఆరేళ్లకి అది అమల్లోకి రావాలన్నది ఒడంబడిక. ప్రజాభిప్రాయ సేకరణను 2011 జనవరిలో నిర్వహించినపుడు దక్షిణాదివారు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. అలా సౌత్ సూడాన్ ఏర్పడింది.
ఆపరేషన్ కావేరీపై ప్రశంసలు
సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో సురక్షితంగా స్వదేశానికి తిరిగి చేరుస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 3000 మందిని తీసుకొచ్చినట్లు అంచనా. రష్యా ఉక్రెయిన్ దాడి సందర్భంలోనూ వైద్య విద్యార్థులను భద్రంగా భారతదేశానికి చేర్చడంలో మోడీ ప్రభుత్వం సఫలమైంది. రాజకీయ సంకల్ప బలానికి తోడు దౌత్య అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తేనే పరాయి గడ్డ నుంచి వేలాది మందిని స్వదేశానికి తీసుకురావడం సాధ్యమవుతున్నది. ఈ విషయంలో కృషి చేసిన వారందరూ ప్రశంసార్హులే.