సూర్యకుమార్ యాదవ్..ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. టీ20ల్లో అతని షాట్లను చూస్తుంటే దిగ్గజాలే నివ్వెరపోతున్నారు. కొన్ని షాట్లకు ఏ పేరు పెట్టాలో తెలియడం లేదంటున్నారు. టీ20ల్లో అరంగేట్రం చేసిన అతికొద్ది కాలంలోనే తనను తాను నిరూపించుకున్న సూర్యకుమార్..ఈ ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. అయితే ఇప్పుడు సూర్య ముందు అసలు సిసలైన సవాల్ ఉంది. ఇన్నాళ్లు టీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కోసం..వన్డేలు ఎదురుచూస్తున్నాయి. మరో తొమ్మిది నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..సూర్యా ఈ ఫార్మాట్లో సత్తా చాటుతాడా..? అతని స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
వన్డేల్లో చోటు దక్కేనా..?
సూర్య కుమార్ యాదవ్ బెస్ట్ టీ20 ప్లేయర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి వన్డేల్లోనూ తన ఫాంను కొనసాగించి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడా..? అంటే కష్టమే అనిపిస్తోంది. సూర్యకుమార్ ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 384 పరుగులు సాధించాడు. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. అయితే రెండు అర్థసెంచరీలు కొట్టాడు. సూర్యకుమార్ తన వన్డే కెరీర్ లో మొదటి ఎనిమిది మ్యాచుల్లో 53.40 సగటు, అతని 103.08 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఎనిమిది మ్యాచుల్లో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. మరో రెండు సందర్భాలలో 20 పరుగుల లోపు పెవీలియన్ చేరాడు.
విపరీతమైన పోటీ
ప్రస్తుతం వన్డేల్లో మిడిలార్డర్లో తీవ్రమైన పోటీ ఉంది. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడాలు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిలో శ్రేయర్ అయ్యర్ మొదటిస్థానంలో ఉన్నాడు. అతను చివరి 10 వన్డేల్లో 358 పరుగులతో నిలకడగా రాణించాడు. 44.75 యావరేజ్ తో ..89.27 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీలు కొట్టాడు. అత్యధిక స్కోరు 113 పరుగులు. ఆ తర్వాత సంజూశాంసన్ పోటీలో వన్డే వరల్డ్ కప్ లో చోటు కోసం ముందు వరుసగా ఉన్నాడు. అతను 9 మ్యాచుల్లో 71 సగటు, 105.57 స్ట్రైక్ రేట్ తో 284 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 86 పరుగులు. సీనియర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ 7 మ్యాచుల్లో 53.50 సగటు, 96.97 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 108. రిషబ్ పంత్ 11 మ్యాచుల్లో 473 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతను 47.30 సగటు, 113.70 స్ట్రైక్ రేట్తో పరుగులు కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, 4 అర్థసెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 125. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 7 మ్యాచుల్లో 219 రన్స్ చేశాడు. 31.28 సగటు, 116.48 స్ట్రైక్ రేట్తో రెండు అర్థసెంచరీలు కొట్టాడు. బెస్ట్ స్కోరు 71. దీపక్ హుడా 6 మ్యాచుల్లో 24.80 సగటు, 75.60 స్ట్రైక్ రేట్తో 124 పరుగులు కొట్టాడు. అత్యధిక స్కోరు 33 పరుగులే. వీరిలో గత రెండేళ్లలో 4వ స్థానం నుంచి 6వ స్థానంలో ఆడిన ప్లేయర్లు ఐదు ఇన్నింగ్స్‌లలో అందరూ మంచి ప్రదర్శన కనబరిచారు. వీరితో పోల్చుకుంటే సూర్యకుమార్ పర్ఫామెన్స్ తక్కువగానే ఉంది. దీనికి తోడు సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్స్ మన్ మాత్రమే. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ , సంజూ శాంసన్ బ్యాటింగ్తో పాటు..వికెట్ కీపింగ్ కూడా చేస్తారు. అది వారికి బలం అవుతుంది. అయితే వన్డేల్లోనూ సూర్యకుమార్ తన T20I ఫామ్‌ను పునరావృతం చేయగలిగితే..అతను గేమ్ చేంజర్గా మారే అవకాశం మాత్రం పక్కా.
నిరూపించుకుంటేనే ఛాన్స్
వన్డే వరల్డ్ కప్ కు ఎక్కవ సమయం లేదు. కేవలం 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో టీమిండియాలో ప్రయోగాలు చేయడం కష్టం. ప్రస్తుతం లంకతో జరిగే వన్డే సిరీస్, కివీస్ తో జరిగే వన్డే సిరీస్ లలో సత్తా చాటితే వన్డే వరల్డ్ కప్ లో చోటు ఖాయం. అయితే మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ లలో ఒకరు ఖచ్చితంగా స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలను, టీ20లను పోల్చి చూడలేమని బాంబు పేల్చాడు. టీ20, వన్డే ఫార్మాట్ భిన్నమైనవని..వన్డేల్లో సరైన ప్రదర్శన చేస్తేనే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని చెప్పకనే చెప్పాడు. కాబట్టి వన్డేలకు తాను సిద్ధంగా ఉన్నానని సూర్యకుమార్ నిరూపించుకోవాలి. వన్డేల్లోనూ రాణిస్తాడన్న నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే వరల్డ్ కప్లో బెర్తు దక్కించుకుంటాడు.
వన్డేల్లో ఏ స్థానంలో వస్తే బాగుటుంది...?
సూర్యకుమార్ యాదవ్ విషయంలో మేనేజ్ మెంట్ కు మరో సవాల్ ఏంటంటే అతనికి ఏ స్థానం సరిపోతుందో తేల్చడం. అతను నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ రావడం మంచిదా? అని ఆలోచిస్తోంది. ఒక వేళ అతన్ని 4వ నెంబర్ లో బ్యాటింగ్ కు పంపితే పవర్ ప్లే ను ఉపయోగించుకుని పరుగులు సాధించే అవకాశం ఉంది. 30 -యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం నలుగురు ఫీల్డర్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది కాబట్టి..మిడిల్ ఓవర్లలో ఫీల్డ్ పరిమితులను కూడా ఉపయోగించుకోవచ్చు.