
- నాగార్జునసాగర్‌లో ఆదివాసీ, గిరిజన శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం
- హాజరైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హాలియా, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుందా ? లేదా ? అని రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే అన్ని శాఖల సెక్రటరీలను ఆదేశించానని, త్వరలోనే రివ్యూ నిర్వహిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 10 శాతం నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయారని, అందుకే ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని చెప్పారు. పీసా, అటవీ చట్టాలను సంపూర్ణంగా అమలు చేస్తామని, ఐటీడీఏలకు పునర్జీవం కల్పిస్తామని, బడ్జెట్ కేటాయించడంతో పాటు నిరుద్యోగులకు శిక్షణ, స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచి, సామాన్యుల హక్కుల కాలరాసేలా కుట్ర జరుగుతోందన్నారు. అర్హులైన వారందరికీ రూ. 5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో లక్ష కలిపి రూ. 6 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
10 శాతం అదనంగా నిధుల కేటాయిస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో అదనంగా 10 శాతం నిధులు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చిన గత ప్రభుత్వం కనీస వసతుల కల్పనను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రతి తండాలో పంచాయతీ, స్కూల్, అంగన్‌వాడీ కేంద్రాలకు బిల్డింగ్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఎస్సీ, గిరిజనులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ఆదివాసీ, గిరిజనులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నేనావత్ బాలునాయక్, మందుల సామేలు, ఇస్లావత్ రామచంద్రనాయక్, రాందాస్‌నాయక్, ఏఐసీసీ మెంబర్ కొప్పుల రాజు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.