మోడీ యాత్రతో ప్రత్యామ్నాయం బలపడేనా ..? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి మన ముఖ్యమంత్రికి తీరిక లేదు. పైగా  తనకే ఆహ్వానం అందలేదంటూ బ్లేమ్​గెమ్​ ఆట మొదలు పెట్టారు. ఆహ్వానం పంపిన విషయాన్ని కేంద్రం బయట పెట్టినంక, అది మొక్కుబడి ఆహ్వానం అని  కొట్టేయడం కొసమెరుపు. ప్రధానిని ఆహ్వానించకపోవడం ఇదే మొదటి సారి కాదు, నాలుగోవది ఇది.ప్రధాని మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణకు వచ్చారు.  ఏ ఒక్క ముఖ్యమంత్రీ ప్రధాని పర్యటనను బహిష్కరించలేదు.  బీజేపీ బద్ద వ్యతిరేకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ సైతం తన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రధానిని ఘనంగా ఆహ్వానించారు. నిజానికి యూపీఏలో ఉన్న డీఎంకేకు లేని వ్యతిరేకత, ప్రధాని మోడీపై ఒక్క తెలంగాణ సీఎంకే ఎందుకో ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోనే ఎవరికీ అంతుపట్టని ఒక విచిత్ర ముఖ్యమంత్రిగా తయారయ్యారు. వ్యతిరేకత ప్రదర్శన తన కోసమే  కావచ్చు గాక,  కానీ అంతిమంగా అది రాష్ట్ర ప్రయోజనాలను బలిగొంటున్నది కదా!

ఫ్లెక్సీలతో రాజకీయమా?

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు రాజకీయం చేయడానికి కూడా వావి వరుస లేకుండాపోయింది!   నక్సల్స్​ వార్నింగ్​  పోస్టర్లు అతికించినట్లు, పోలీసులు టెర్రరిస్టుల ఫొటోలు పెట్టినట్లు, ఈ దేశ ప్రధాని ఫొటో పెట్టి  ‘ మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ’  అని  నడిబజార్లలో ఫ్లెక్సీలు( అడ్రసు లేని పేర్లతో ) పెట్టడం కూడా  ఇదే మొదటిసారి కాదు!  నిస్సందేహంగా ఇదొక బరితెగింపు రాజకీయమే! మర్యాద మరిచిన ఈ దిక్కుమాలిన రాజకీయంతో   తెలంగాణ ప్రతిష్టకే  భంగకరమనే  కనీస సోయి  కూడా  లేకుండా పోయింది.   చేనేత పై జీఎస్టీ 5 శాతం పెట్టండి అని చెప్పింది టీఆర్​ఎస్​  పాలకులే.  ఇప్పుడు వారే యూటర్న్​ తీసుకొని జీఎస్టీ ఎత్తేయాలని ఫ్లెక్సీలు పెట్టించడం  దిగుజారుడు రాజకీయానికి పరాకాష్ఠ! నిజంగా ఆ 5 శాతం  జీఎస్టీ కూడా ఎత్తేయాలని ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్​లో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్​ చేయాలి. జంతర్​మంతర్​ దగ్గర దీక్ష చేయాలి.  కానీ ఫ్లెక్సీలు కట్టిన హైదరాబాద్​ రోడ్లపైన జీఎస్టీ కౌన్సిల్​ సమావేశాలు జరుగుతాయా? ఇలాంటి  రాజకీయ డ్రామాలు తెలంగాణకు వీసమంతైనా ఉపయోగపడుతాయా? మూత పడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి  ప్రారంభమైనందుకు గర్వపడాలి తప్ప ఏడ్పు ఎందుకు? మూత పడ్డ పరిశ్రమలను తెలంగాణ వచ్చాక తిరిగి తెరిపిస్తామని ఉద్యమ కాలంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిందెవరు? అచ్చంగా వచ్చిన తెలంగాణను ప్రజలు కేసీఆర్​ చేతిలో పెడితే.. తెరిపించిన పరిశ్రమలెన్ని? నిజాం షుగర్​ ఫ్యాక్టరీ రీఓపెనింగ్​ ఏమైంది? ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? అప్పుల కుప్పలుగా మార్చిన విద్యుత్తు సంస్థలు బతికేదెట్లా? విజయాడెయిరీ  బతికి బట్టకట్టేనా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ నష్టాల్లో  మునిగిపోతుంటే, పసలేని బ్లేమ్​గేమ్​లు ఎవరిని బతికించడానికి?

9 వేల కోట్ల అభివృద్ధి తెచ్చిన ప్రధాని

ప్రధాని తెలంగాణకు ఒక్క రూపాయి అయినా తెచ్చాడా అంటూ టీఆర్​ఎస్​ నేతలు బలహీన వ్యంగ్యాస్త్రాలకు పని చెపుతున్నారు. రామగుండం ఫర్టిలైజర్​ కంపెనీని తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం రూ. ఆరువేల కోట్లకు పైగా వెచ్చించింది. అనేక జాతీయ రహదారులకు, రైల్వే లైన్​ కు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. 9 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ఆరంభించడానికి వచ్చిన ప్రధానిని, ఒక్క రూపాయైన తెచ్చాడా అని అనడానికి మించిన కృత్రిమ విమర్శ ఇంకేముంటది? 

సింగరేణిపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన ప్రధాని

రామగుండంలో ప్రధాని మోడీ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను చెప్పగలిగింది.  కేంద్రం సింగరేణి కంపెనీని ప్రైవేటు పరం చేస్తున్నదని  టీఆర్​ఎస్​ పాలకులు ఒక అపోహను సృష్టించే ప్రయత్నం చేస్తూవచ్చారు. ప్రధాని రాక సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యమ్రాలూ చేపట్టారు. ఈ మధ్యనే మిత్రులుగా మార్చుకున్న కమ్యూనిస్టులతో కూడా ఆ అపోహలను పెంచిపోషించడంలో పాత్రధారులను చేశారు. సింగరేణి కంపెనీలో 51శాతం రాష్ట్ర వాటా ఉండగా దాన్ని  ప్రైవేటుపరం చేసే హక్కు కేంద్రానికి ఎక్కడిది? అని ప్రధాని వివరించి  చెప్పడంతో  టీఆర్​ఎస్​, కమ్యూనిస్టులు కల్పించిన అపోహలు ప్రజల మెదళ్ల నుంచి దూదిపింజాల్లా ఎగిరిపోయాయి.  చేసిన నిరసనలూ నీరుగారాయి. తొమ్మిదేళ్ల పాలన చూశాక, ప్రజల్లో  తెలంగాణ సెంటిమెంట్​ వర్కవుట్​ కాని నేపథ్యంలో, కేంద్రం టార్గెట్​గా రాజకీయాన్ని వర్కవుట్​ చేసుకునేందుకు ఎన్ని  అపోహలైనా కల్పించడమే పనిగా మారిందని విజ్ఞుల అభిప్రాయం.రాష్ట్రానికి సాధించాల్సింది ఏది ఉన్నా.. ఢిల్లీకి పోయేది లేదు. అడిగేది లేదు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేదిలేదు. ప్రధాని రాష్ట్రానికి వస్తే మాత్రం తెలిసిందల్లా  ఫ్లెక్సీలతో అవమానించి, రాజకీయ లబ్ధిని ఆశించడం మాత్రమే! ఇలాంటి పాలకుడి కోసమే తెలంగాణ వచ్చిందా అనే ప్రశ్న ఇయ్యాల సర్వత్రా వ్యక్తమవుతున్నది. 

శ్రేణుల్లో ఉత్సాహం నింపిన మోడీ

ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో  బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ  ఓడినా గెలిచినంతగా బలమైతే పెరిగిందనే అభిప్రాయం ప్రధాని మాటల్లో కనిపించింది. అది నిజమే! కానీ , తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ప్రతిపక్ష రహితంగా మార్చి తానే ఏకస్వామ్యుడైన పాలకుడిని ఎదుర్కొనేందుకు అన్ని అస్త్రాలతో సన్నద్ధత అవసరం. రాజకీయ విమర్శలు మాత్రమే ‘ఏకస్వామ్యుడి’ని ఓడించలేవు. చతురంగ బలాలతో రాజ్యమేలుతున్న పాలకుడిని, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు మాత్రమే ఎదుర్కోగలుతారు అని ఇటు ప్రజల్లో, అటు రాజకీయ వర్గాల్లో ఉన్న విశ్వాసాన్ని మునుగోడులో ఏమేరకు నిలబెట్టుకున్నారో ఆ పార్టీయే ఆత్మపరిశీలన చేసుకోవాలి.   రాజగోపాల్​రెడ్డిని ఏరికోరి రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెచ్చినవారు, ఆ ఉప ఎన్నికలో ‘ఏకస్వామ్యుడి’ ఉల్లంఘనల వల్ల ఓడిపోరాదనే పట్టుదల ఢిల్లీ పెద్దల్లో ఎందుకు లేకపోయింది? ఢిల్లీ పెద్దలు చొరవ తీసుకొని  ఎన్నికల సంఘంతో సర్కారీ ఉల్లంఘనలను కట్టడిచేసి, నిష్పక్షపాత ఎన్నికలు జరిపించి ఉంటే మునుగోడు ఫలితం మరోలా ఉండేదని ఆ పార్టీశ్రేణులే చర్చించుకుంటున్నాయి.  ప్రధాని మోడీ బేగంపేటలో చేసిన ప్రసంగం ఒకవైపు నర్మగర్భంగా, మరోవైపు  తీవ్రంగానూ ఉన్నది. దేశ ప్రధానిగా రాజకీయాలపై ఆయన   అన్నీ  విడమర్చి మాట్లాడటం సాధ్యం కాకపోవచ్చు. కానీ పార్టీ శ్రేణులకు మాత్రం విశ్వాసం కల్పించే ప్రయత్నంచేశారు. ‘ కిలోల కొద్ది తిట్లను నేను జీర్ణించుకుంటాను, మీరేమీ ఆందోళనకు గురి కావద్దు’ అని ప్రధాని చేసిన వ్యాఖ్యలు వినడానికి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం  ‘స్వేచ్ఛ’ భయంలో  బతుకున్నది. కృత్రిమ విమర్శలు, ప్రతీకార రాజకీయాలే  పనిగా   పెట్టుకున్న పాలకుడి పాలనలో ప్రత్యామ్నాయ రాజకీయం బతికేనా? ప్రజలు కోరుకుంటున్న ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఏకస్వామ్య రాజకీయం ఎక్కడికక్కడ నిర్భంధిస్తుంటే.. ప్రధాని ప్రసంగం ఏమేరకు భరోసా కలిగించిందనేది కాలమే నిర్ణయించాల్సిన విషయం. ‘గరీబోంకో లూట్​నే వాలోంకో చోడేంగే నహీ’   అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్య సంచనాత్మకమైనదే. నిజంగా అది  లూటీదార్లకు చెక్​ పెట్టనుందా? రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్క నున్నాయా? చూడాల్సిన విషయమే. ఏదేమైనా.. అవినీతి, అక్రమాలపై మాటలతో  యుద్ధం చేస్తే  సరిపోయేది కాదు. ఎప్పటికప్పుడు వాటిపై గట్టి చర్యలు ఉంటేనే  రాష్ట్రంలో అవి ప్రత్యామ్నాయాన్ని నిలబెడుతాయనడంలో సందేహం లేదు. లేదంటే బతికేది ఏకస్వామ్యమే!

కాకా కృషి పనికొచ్చింది

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ  1999లో మూతపడ్డది. కేంద్ర మాజీ మంత్రి జీ. వెంకట స్వామి 2004లో  ఆ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తదుపరి 2009లో  ఫ్యాక్టరీ నష్టాలను బెయిలౌట్ చేయించడంలో, రుణాలను మాఫీ చేయించడంలో అప్పటి ఎంపీలు ముఖ్యంగా జీ. వివేక్​ వెంకటస్వామి తీసుకున్న చొరవను  ప్రధాని సభలో స్వయాన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి గుర్తు చేశారు.  2015లో  రూ. 6 వేల కోట్లతో రామగుండం ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​​ ఫ్యాక్టరీకి ప్రధాని నరేంద్రమోడీ పునరుజ్జీవం పోశారు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో  మూతపడ్డ, నష్టాల్లో నడుస్తున్న  ప్రభుత్వ రంగ పరిశ్రమలు  తిరిగి తెరుచుకున్న జాడ ఉన్నదా? అయినా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకున్నందుకు, ఉత్పత్తి ప్రారంభించినందుకు, దాన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చినందుకు ప్రజలంతా స్వాగతిస్తుంటే.. ముఖ్యమంత్రి ఒక్కడికే కడుపు నొప్పి ఎందుకో తెలంగాణ రైతులకే అర్థం కాలేదు.  ఒకప్పుడు  ఎరువుల కొరతతో, బ్లాక్​మార్కెట్​తో తల్లడిల్లిన తెలంగాణ రైతాంగం బాధలు, ముఖ్యమంత్రిబాధలు కావేమో!

కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్