ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • కరీంనగర్ హాస్పిటల్ ​సిబ్బందిపై మినిస్టర్ హరీశ్​రావు ఆగ్రహం
  • మినిస్టర్​ గంగులతో కలిసి ఆకస్మిక తనిఖీ 

కరీంనగర్ టౌన్, వెలుగు: మినిస్టర్ వస్తేనే హాస్పిటల్​లో బెడ్ షీట్స్ మారుస్తరా..? ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే మీరెందుకు వసతులు సక్రమంగా అందించడం లేదని హెల్త్ మినిస్టర్ హరీశ్​రావు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్ తో కలిసి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ను హరీశ్ రావు సందర్శించారు. ఈక్రమంలో ఓ వార్డులోకి ఆయన వెళ్తుండగా అప్పుడే కొత్త బెడ్ షీట్ మారుస్తున్న సిబ్బందిని చూసి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం గోడలకు కలర్ పోయిందని, నీట్ గా ఎందుకు ఉంచడం లేదని సూపరింటెండెంట్ రత్నమాలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమకు అరకొర జీతాలొస్తున్నాయని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని ఔట్ సోర్సింగ్ ఆయాలు మంత్రిని కోరారు. తనకు ఆసరా పింఛన్​వస్తలేదని, మందులు కూడా సక్రమంగా ఇస్తలేరని డయాలసిస్ వార్డులో ఓ వృద్ధురాలు చెప్పడంతో ఆమెకు న్యాయం చేయాలని కలెక్టర్ కర్ణన్ ను ఆదేశించారు. 

వైద్య సేవలో దేశానికే ఆదర్శం..

మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి హరీశ్​రావు మాట్లాడుతూ వైద్యసేవలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. 2023లో కరీంనగర్ జిల్లాకు కొత్త మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, అందు కోసం రూ.18 కోట్లు  మంజూరైనట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 100 మంది ప్రత్యేక డాక్టర్లను కేటాయించామని హరీశ్​రావు వివరించారు.   దేశంలో ఎక్కడాలేని విధంగా క్యాన్సర్ తో బాధపడుతున్న వారికోసం రాష్ట్రంలోని 33 జిల్లాలో ప్యాలియేటివ్ కేర్ లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అనంతరం కరీంనగర్ ఎన్టీఆర్ బైపాస్ చౌరస్తా వద్ద రూ.4కోట్లతో నిర్మించిన సెంటర్ లైటింగ్ ను హరీశ్​రావు మినిస్టర్​గంగులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకిషన్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.

రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వాలి

వేములవాడరూరల్, వెలుగు : ప్రజలకు రేషన్​ సరుకులు సకాలంలో అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం మండలంలోని నాగాయపల్లి రేషన్​దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. బియ్యం క్వాలిటీని పరిశీలించారు. అనంతరం చెక్కపల్లి, నూకల మర్రి, బాలరాజుపల్లి గ్రామాల్లోని స్కూళ్లలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు బాగున్నాయని సర్పంచ్ జయపాల్ రెడ్డి, సెక్రెటరీ చందనను అభినందించారు. బిల్లులు సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఆయన వెంట డీఈఓ రాధా కిషన్, ఆర్డీఓ పవన్ కుమార్, డీఎస్​ఓ జితేందర్​రెడ్డి, తహసీల్దార్ఎన్ శ్రీనివాస్ ఉన్నారు. 

జీపీ నిధులు విడుదల చేయండి

గొల్లపల్లి, వెలుగు : 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గొల్లపల్లి మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు ఎంపీడీఓ నవీన్ కు వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్నారు. నిధులు లేక పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వడంలేదన్నారు. జీపీ ట్రాక్టర్ కిస్తీలు,  డైలీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని వాపోయారు. వారిలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, గొల్లపల్లి సర్పంచ్ నిశాంత్ రెడ్డి , భీమ్రాజు పల్లి, ఇస్రాజ్పల్లి, అబ్బాపూర్, శంకర్ రావుపేట సర్పంచ్ లు సత్యనారాయణ గౌడ్, గంగాధర్ ఉన్నారు.

రోడ్లు పాడైనా పట్టించుకోరా?

ప్లకార్డులతో కాంగ్రెస్ లీడర్​ నిరసన

జమ్మికుంట, వెలుగు : మానేరు పరివాహక ప్రాంతం నుంచి భారీ లారీలలో ఇసుక తరలిస్తుండడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనా మున్సిపల్ అధికారులు, లీడర్లు పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు పూదరి రేణుక ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆమె తన భర్త శివ కుమార్ తో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక రవాణాతో దుమ్మూ ధూళితో ప్రయాణికులు, దుకాణాల యజమానులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ప్రజల ఇబ్బందులు పట్టవా అని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గుంతలు పూడ్చడం చేతకాదని ఒప్పుకుంటే ప్రతి ఇల్లు తిరిగి భిక్షమెత్తి  వచ్చిన డబ్బులతో గుంతలు పూడుస్తామని తెలిపారు.

మొరాయిస్తున్న స్ట్రీట్​లైట్ సెన్సర్లు

చొప్పదండి, వెలుగు: రూ.లక్షలు వెచ్చించి చొప్పదండి పట్టణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్​లైట్ సెన్సర్లు మొరాయిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది 31 స్ట్రీట్​లైట్ సెన్సర్లు కొని పట్టణంలోని 14 వార్డులలో అమర్చారు. సెన్సర్లు ఏర్పాటు చేసిన కొద్ది నెలలు బాగానే నడిచి తర్వాత మొరాయించాయి. కొన్ని ఏరియాలలో సెన్సర్లు సరిగా పనిచేయక రాత్రి వెలగాల్సిన లైట్లు పగలు వెలగడం, మరికొన్ని ఏరియాలలో మొతానికే వెలుగకుండా మొరాయిస్తున్నాయి. దసరా నుంచి పట్టణంలోని దాదాపు అన్ని సెన్సర్లు పనిచేయకపోవడంతో మున్సిపల్ సిబ్బంది రాత్రి వేళల్లో వేసి, ఉదయంపూట ఆఫ్​ చేస్తున్నారు. కరెంట్ పొందుపు చేయడం, హ్యూమన్ పవర్ లేకుండా ఆధునికంగా స్ట్రీట్​లైట్లు వెలిగేందుకు రూ.లక్షలు వెచ్చించిన మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఇపుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సమస్యనను పరిష్కరించాలని కోరుతున్నారు.

సిరిసిల్లలో క్రైం రేట్ తగ్గింది

రాజన్న సిరిసిల్ల, వెలుగు: గతేడాదితో పోలిస్తే జిల్లావ్యాప్తంగా ఈసారి క్రైం రేట్ 20శాతం తగ్గిందని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం ఎస్పీ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 14 హత్యలు జరిగాయని, దోపిడీలు 33 శాతం తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 82శాతం తగ్గగా.. 38  రేప్​కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మహిళల వేధింపుల కింద 84 కేసులు, ఆత్మహత్యలు 269 జరిగాయన్నారు. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద 81, పోక్సో 46, ప్రాపర్టీ రికవరీ కింద 76 కేసులు, డయల్ 100 కింద 17,027 కాల్స్ అటెండ్ చేశామన్నారు. దీంతో 320 కేసులు నమోదు చేశామన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కింద 84 కేసులు పెట్టి 118 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 8 రౌడీ షీట్లు అమలులో ఉన్నాయన్నారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రయ్య ఉన్నారు.

ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం

జగిత్యాల, వెలుగు: ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా జగిత్యాల జిల్లా పోలీస్​శాఖ పని చేస్తోందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. గురువారం జిల్లా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది వార్షిక క్రైం నివేదిక వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో గతేడాది జరిగిన నేరాల కంటే ఈ సంవత్సరం 12 శాతం(703) తగ్గాయన్నారు. జిల్లా మొత్తం 5,056 కేసులు నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో 508, అత్యల్పంగా బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో 106 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 9 పీడీ యాక్ట్, 35 రేప్, ఎస్సీ, ఎస్టీ 100, పోక్సో యాక్ట్ 17, చీటింగ్ కేసులు 23 నమోదైనట్లు పేర్కొన్నారు. రోడ్డు యాక్సిడెంట్స్ లో  200 మంది చనిపోయారని ఎస్పీ తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమంగా తరలించినందుకు 122 కేసులు నమోదు చేసి రూ. 6,21,220 సీజ్ చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా కేసులు 286 నమోదు కాగా 302 వెహికల్స్ సీజ్ చేశామని, 32 మంది పై గంజాయి రవాణా కేసులు నమోదు చేసి 17 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధు 
వివరించారు.