మావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా..?

మావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా..?

ఇటీవల మావోయిస్టు పార్టీ మేం శాంతి చర్చలకు సిద్ధమని, శాంతిచర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆయుధాలు వాడమని ఒక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలకు అంగీకరిస్తే ప్రాణ నష్టాలను నివారించవచ్చు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 జీవించే హక్కు కల్పించింది. భారత సుప్రీంకోర్టు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ జీవించే హక్కును అనేక విషయాలకు, పరిస్థితులకు వర్తింపజేస్తూ  తీర్పులు చెప్పింది.

మనిషి జీవితంలో ప్రపంచంలోనే అత్యంత విలువైనది ప్రాణమొక్కటే. ఎందుకంటే డబ్బుపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అనారోగ్యం ఏర్పడితే మనిషి మళ్లీ ఆరోగ్యవంతుడు కావచ్చు, కానీ, ప్రాణంపోతే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పొందలేం. అందుకే ప్రాణానికి అత్యంత విలువ. అందుచేతనే సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన కేసులలో ఎంతో సవివరమైన తీర్పులను చెప్పింది. యుద్ధనీతిలో కూడా ఆయుధాలు కిందపెట్టినవారిని సంహరించకూడదనే ధర్మం ఉన్నది. ఆయుధాలు లేనివారిని యుద్ధభూమి నుంచి తిరిగి వెళుతున్నవారిని లేదా లొంగిపోయిన వారిని చంపకూడదనే నియమాలు ఉన్నాయి.

స్త్రీలను, పిల్లలను, వృద్ధులను కూడా చంపకూడదనే ధర్మాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే పోలీసు బలగాలు, నక్సలైట్స్ మధ్య జరుగుతున్న ఘర్షణలో అనేకమంది ఆదివాసీలు, ఇతర అమాయకులు కూడా బలవుతున్నారు. కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినవారు లేదా ఇతర పనుల కోసం అడవులకు వెళ్లినవారు బలైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  అదేకాక సాయుధులైన మావోయిస్టులయినా, పోలీసు కానిస్టేబుల్, ఎస్సై, లేదా ఇతర గిరిజనుడైనా.. ఎవరు  మరణించినా అతని తల్లి దండ్రులు, భార్యాపిల్లలు, అన్నాచెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఒక్క క్షణం ఊహిస్తే తెలుస్తుంది.

కాబట్టి మానవతా కోణం నుంచి ఆలోచించినా ఇరుపక్షాలవారు కాల్పులు విరమించి ఘర్షణ లేని వాతావరణంలో చర్చలు జరపడం మంచిదని భావిస్తున్నాం. శాంతి చర్చలు ఫలప్రదమై ఇరుపక్షాలవారు కొన్ని విషయాలపై  అంగీకరించి ఒక శాశ్వత పరిష్కారం చూపగలిగితే అది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు.

వైరుధ్యం విద్వేషం కాకూడదు
మావోయిస్టు భావజాలాలతోకానీ వారి కార్యాచరణతోగానీ ఏనాడూ మేం ఏకీభవించలేదు. వారి సిద్ధాంతాలు, ఎత్తుగడలతో  కూడా మేం విభేదిస్తాం. అలాగే,  బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతాలతో వారి ఆచరణతో కూడా విభేదిస్తాం. ఒకరికి ఒకరికి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ శాంతి కోసం కలిసి చర్చించడానికి ఇవి అడ్డుకాకూడదు. మేధస్సుతో కాక కొన్ని సందర్భాలలో హృదయంతో కూడా ఆలోచించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా అవి ఎంత ఘోరమైనవి అయినా.. గత చరిత్రను తవ్వుకోవడం వలన లాభం లేదు. కేవలం గుణపాఠాలు నేర్చుకోవడానికి మాత్రమే గతం తోడ్పడాలే తప్ప విద్వేషాలు పెంచుకోవడానికి,  వైరుధ్యాలను పెంచుకోవడానికి కాదు. 

అశోకుడు ఆదర్శం కావాలి
మనందరికీ తెలిసిన చరిత్రనే అశోక చక్రవర్తి రాజ్య విస్తరణ కాంక్షతో కళింగ దేశంపై దండెత్తాడు. స్వతంత్రాన్ని కాపాడుకోవాలని కళింగులు అశోకుడిని ఎదిరించారు. ఆ ఘోరమైన యుద్ధంలో అనేక వేలమంది చనిపోయారు. మరెన్నో వేలమంది క్షతగాత్రులయ్యారు. అప్పుడు అశోకుడు యుద్ధభూమికి వచ్చి అక్కడ సైనికుల శవాలపై పడి ఏడుస్తున్న వారి భార్యాపిల్లలను, తల్లిదండ్రులను చూశాడు. 
కాళ్లు, చేతులు తెగిపోయి కేకలువేస్తున్న క్షతగాత్రులను చూశాడు. భయంకరమైన ఆ పరిస్థితి చూసి ఆయన ఆలోచనలో పడ్డాడు.

నా వల్ల ఎంత మంది బాధపడుతున్నారు అని ఆలోచించి సరైన మార్గాన్ని అన్వేషించి చివరకు బౌద్ధమతం స్వీకరించాడు. తర్వాత ఎంతో మంచి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. బాటసారులకు నీడ కోసం రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు. పశువులకు ఆసుపత్రులని ఏర్పరిచాడు. పశువులకు, పక్షులకు నీటి తొట్టిలు  ఏర్పాటు చేశాడు. అలాగే విద్యాలయాలను స్థాపించాడు.  బుద్ధుడి బోధనలను ఎన్నో  స్తూపాలపై చెక్కించాడు.

శ్రీలంక, మయన్మార్, జపాన్, చైనా మొదలగు దేశాల్లో బౌద్ధమతం వ్యాప్తి చెందడానికి ఎంతగానో కృషి చేశాడు. అందుచేతనే  అశోకుడి ధర్మచక్రాన్ని మన జాతీయజెండాలో  చేర్చడం జరిగింది. పాలకులు అశోక చక్రవర్తి బాటలో పయనించాలని ఆలోచిస్తే అది శాంతికి, దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. మన దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మన ఋషులు ‘సర్వేజనా  సుఖినోభవంతు, లోకా సమస్తా సుఖినోభవంతు, బహుజనహితాయ బహుజన సుఖాయా,  సర్వ జీవుల్లోఉన్న ఆత్మ ఒక్కటే’ అని ప్రబోధించారు.  అవి దృష్టిలో ఉంచుకొని అందరూ ఆలోచిస్తే శాంతిని సాధించవచ్చు.

మావోలూ ఆలోచించాలి
ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలలో  విద్య,  వైద్యం, రవాణా  మొదలగు కనీస సౌకర్యాలు లేవు. కొన్నిచోట్లకి ఇంకా సెల్ టవర్లు,  టెలిఫోన్లు రాలేదు. అనేక ప్రాంతాలకు నీటి వసతి లేదు. విద్యుత్ లేని గ్రామాలు కూడా ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఆదివాసుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి శాంతి ఒప్పందాలు బాగా ఉపయోగపడవచ్చు.

పరిస్థితులు అనుకూలిస్తే మావోయిస్టులు కూడా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే వారు జనజీవన స్రవంతిలో కలవొచ్చు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులు బలపడడానికి ఉపయోగపడవచ్చు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడవచ్చు.

జస్టిస్ బి చంద్రకుమార్, విశ్రాంత న్యాయమూర్తి.
(హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)