కాంగ్రెస్ వ్యూహకర్తల కసరత్తు ఫలించేనా?

కాంగ్రెస్ వ్యూహకర్తల కసరత్తు ఫలించేనా?

ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఆ పార్టీ ఇంచార్టీ ఠాక్రె  నుంచి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరకు చెబుతున్నారు. అసలు గెలిచే వారినే బరిలో దించడానికి వీరి దగ్గర ఉన్న ఫార్ములా ఎంటీ ? గతంకన్నా ఈసారి ఎంపిక విషయంలో తేడా ఏమన్న ఉంటదా అంటే మాత్రం ఉంటుందని   చెప్పక తప్పదు. ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో టికెట్లు ప్రకటించినప్పుడు ఎలాంటి గొడవలకు తావు లేకుడా సాఫీగా ఎన్నికలు విజయవంతంగా జరుపుకోగలిగారు. వీటన్నింటికి మంత్రం ఒక్కటే కనపడుతుంది. సర్వేల ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే .. అభ్యర్థుల ఎంపిక పార్టీలోని నేతల మధ్య ఉన్న వర్గాలకు సంబంధాలు లేకుండా గెలిచే వారికి టిక్కెట్టు అనే విధంగా కర్నటకలో ఇంప్లిమెంట్ చేయగలిగారు. 

తెలంగాణలో కూడా ఇదే విధానం ఉంటుందని, తమ వర్గానికి టికెట్టు ఇప్పించుకోవాలంటే ముందు ప్రజల్లో మనుగడ ఉండాలి కనీసం నియోజకవర్గంలో గుర్తు పట్టే నాయకుడు అయి ఉండాలి, గెలవగలగాలి, ఇవి లేని వారి పేర్లను ప్రతిపాదన చేస్తే  హైకమాండ్ ముందు ఆ నేతలు అబాసుపాలు కాక తప్పదు.  గత ఎన్నికల్లో సునీల్ కనుగోలు లాంటి వారిని ఆ పార్టీ స్ట్రాటజిస్టులుగా పెట్టుకోలేదు. కానీ ఇప్పడు ఆ పార్టీకి సునీల్ , మాజీ ఐఏఎస్​ సింథల్ లాంటి  వ్యూహకర్తలు పని చేస్తున్నారు. వీరు తీసుకుంటున్న గ్రౌండ్​ ఫీడ్ బ్యాక్ తో పాటు, అదనంగా ఇతర సంస్థలతో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. 

మంచి పేరున్న వారికి కూడా..

తమ పార్టీలో ఉన్న అభ్యర్థి  ప్రత్యర్థికి సరితూగటం లేదంటే ఇతర పార్టీలో ఉంటే తీసుకువచ్చే ప్రయత్నం చేయటం ... రాజకీయాలకు సంబందంలేని వారిని మంచి పేరు ఉన్న వారిని తీసుకు రావడం లాంటి స్ట్రాటజీ అవలంబిస్తున్నట్లుగా అర్థమవుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా కనపడుతున్నాయి. పాలకుర్తి లాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవదు అనుకున్నారు. కానీ ఎన్నాఆర్ఐ ఝాన్సీ ఎన్నికల బరిలో ఉంటారని ఇపుడు అంటున్నారు. ఇప్పటికే  ఆ నియోజకవర్గంలో  ఆమె పోటీలో ఉంటే  ఎర్రబెల్లి  ఓడిపోతారని కూడ అంటున్నారు. అంటే ఇలా  చాలా నియోజకవర్గాలు  ఉంటాయని అంచనా.  ఇప్పటికీ కాంగ్రెస్ లో ముప్పై ముప్పైఐదు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తమ ప్రత్యర్థి పార్టీకి తెలియదు. అంటే అభ్యర్థులు లేరని కాదు కానీ కాంగ్రెస్ కు పనిచేస్తున్న వ్యూహకర్తలు ఈ నియోజకవర్గాల్లో తీవ్ర కసరత్తు చేస్తున్నారని దాని అర్థం. అంటే నేను ముందు చెప్పినట్లు పాలకుర్తి లాంటి ఫార్ములాలు ఉన్నాయి అని.

టికెట్లు గెలిచేవారికే..

గతంలో టికెట్లు పార్టీ  ఎన్నికల కమిటీల్లో ఉన్న నేతల రోల్ ఎక్కుగా ఉండేది.  పీసీసీ ఎన్నికల కమిటీ ప్రతిపాదనలు రావడం ఇక్కడ  కొన్ని పేర్లు ఫిల్టర్ చేసి రెండు లేదా మూడు పేర్లు ప్రతిపాదన చేయడం, ఆ పేర్లు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాక అవసరమైతే అందరూ కలసి సింగిల్ నేమ్ ను ప్రతిపాదించడం జరిగేది. ఏదైన నియోజకవర్గాల్లో డిసైడ్ చేయలేని పరిస్థితులు ఉంటే, రెండు లేదా మూడు పేర్లు ప్రతిపాదించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పంపే వారు అప్పుడు అక్కడ టిక్కెట్లు డిసైడ్ అయ్యేవి. ఐదు నుంచి పది సీట్లు పంచాయితీ ఉంటే హైకమాండ్ డిసైడ్ చేసేది. అది కూడా వీరు పంపిన పేర్లలోనే.  కానీ ఈసారి వ్యూహకర్తలు అభ్యంతరం పెడతారన్నది కాంగ్రెస్ పార్టీ అలోచనగా కనపడుతోంది.  పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి కూడా కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే  పీసీసీ ప్రెసిడెంట్ గా తన మనుషులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని భావించినా ... ఆయన కూడా గెలిచే వారి పేర్లు మాత్రమే ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. 

ఇది  కమిటీలో ఉన్న భట్టి విక్రమార్కకు , ఉత్తమ్​కుమార్ రెడ్డికి కూడ గెలిచే వారి పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీ వరకు తీసుకు పోవాల్సి ఉంటుంది.  ఈ ముగ్గురు తమ మనుషులకే టికెట్లు అని గెలిచే సత్తాలేని లీడర్ల పేర్లు ప్రతిపాదిస్తే మాత్రం  పీసీసీ ప్రెసిడెంట్​గా రేవంత్, సీఎల్పీ భట్టీ, ఉత్తమ్ లను సైతం కాదని కూడా హైకమాండే పేర్లను ప్రతిపాదన చేయనున్నట్లు పార్టీ వ్యూహకర్తల కసరత్తుతో అర్థం అవుతోంది. ఎందుకు అంటే కర్నాటకలో చివరి లిస్టులో ప్రకటించిన పేర్లుచూస్తే  హైకమాండ్ విధానం అర్థం అవుతోంది. ఇతర పార్టీల నుంచి తీసుకుని కూడ టికెట్లు ఇచ్చింది. అది కూడా గెలివగలిగే వారు అయితేనే. గెలవని వారికి ఇతర హామీలు ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారు. ఆ ఫార్ములా దాదాపు ఇక్కడ అమలు అవుతుందని పార్టీ  వ్యూహకర్తలు చేస్తున్న విధానాలే చెపుతున్నాయి. 

 కేసీఆర్​ను ఎదుర్కొనే వ్యూహం బలమైనదేనా? 

వ్యూహకర్తల వ్యూహాలు ఎలా ఉన్నా, కర్నాటకలో రెండు జాతీయ పార్టీల మధ్య జరిగిన పోరాటం అది. కానీ తెలంగాణలో అలా కాదు.  పేరుకు అది బీఆర్ఎస్ అయినా అదొక ప్రాంతీయ పార్టీ. కానీ కర్నాటకలో కాంగ్రెస్ కు  ఇద్దరు ఉద్దండులు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య బసవరాజు బొమ్మై సరితూగ లేదని చెప్పాలి.  ప్రధాని నేరుగా రంగలోకి దిగినా.. సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ప్రధాని పాలిటిక్స్ పారలేకపోయాయి.  కానీ ఇక్కడ కేసీఆర్ అన్ని రకాలుగా బలంగా ఉన్నాడు. ఆర్థికంగా, రాజకీయంగా పార్టీలో ఆయనకు ఎదురులేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో అలా కాదు. ప్రజల్లో ఫాలోయింగ్ రేవంత్ రెడ్డికి ఉన్నా.. ఆయన ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి గుంజుతారు. వ్యూహకర్తలు దీనికి మంత్రం ఏందో కనిపెడితే, వారు అనుకున్నట్టుగా వ్యూహాలు పనిచేస్తాయి.  లేకుంటే సునీల్ కనుగోలు వ్యూహం బెడిసి కొట్టొచ్చు.

- బి.వేణుగోపాల్ రెడ్డి,  తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు