భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ నెల 7న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ప్రకారం.. ఎన్నికల సంఘం తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని, ఆ సమయం ముగియడానికి 6 నెలల ముందు కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. సీఈసీ ప్రకటనను బట్టి చూస్తే.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు లేదా కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించే పనిలేకుండానే.. ఈ ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికలను ఒకేసారి నిర్వహించే వీలు ఉందనేది అర్థమవుతున్నది. ఈ లెక్కన సెమీ జమిలి ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఎన్నికలు జరిగే తెలంగాణ, మిజోరం, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాలతోపాటు 2024లో ఎన్నికలు జరిగే సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా 12 రాష్ట్రాలు, పార్లమెంట్ కు మినీ -జమిలి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్రం అవసరమైతే లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపొచ్చు.
ఇలా మినీ జమిలి ఎన్నికలు వస్తే మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అనే అంశంపై జాతీయ పార్టీలతోపాటు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి. 12 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న 221 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని వస్తాయనే దానిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నది.2019లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 221 స్థానాలకు గానూ 137 ఎంపీలను గెలుచుకున్నాయి. నిజానికి ఇది భారీ సంఖ్య. మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో భారీ స్థానాలు రాగా, ఒడిశా, తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ12 రాష్ట్రాల్లో మినీ జమిలి ఎన్నికలు జరిగితే బీజేపీ మునుపటి లాగే ఎక్కువ మంది ఎంపీలను గెలుచుకుంటుందా? తక్కువ స్థానాలకే పరిమితమవుతుందా అనేది ప్రధాన ప్రశ్న.
జమిలీ బీజేపీకి నష్టమే..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇమేజ్ పనిచేస్తుందని బీజేపీ బలంగా చెబుతోంది. అయితే 2019, 2014 ఎన్నికల్లో ఒడిశా మినహా ఈ12 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు జరగలేదు. అందుకే నరేంద్ర మోదీ ఇమేజ్ పని చేసింది. ఈ 12 రాష్ట్రాల్లోని 221 ఎంపీ స్థానాలకు గానూ బీజేపీ 137 ఎంపీలను గెలుచుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ మ్యాజిక్ పని చేస్తుందనడానికి ఎలాంటి రుజువు లేదు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది, అక్కడ మోదీ తీవ్రంగా ప్రచారం చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగానే 12 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం బీజేపీకి పెద్ద రిస్క్ అనే చెప్పాలి. తెలంగాణలో గెలవడమో, రాజస్థాన్‌లో విజయం సాధించడమో బీజేపీ ముఖ్యంగా భావించకూడదు.. దానికి కావాల్సింది కేంద్రంలో అధికారం. కేవలం పార్లమెంట్ ఎన్నికలప్పుడే నరేంద్ర మోదీ మ్యాజిక్ ఫలిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మ్యాజిక్‌ను అంచనా వేయలేం. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో గెలిచినప్పుడు ఆ పార్టీ దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం 3 మాత్రమే. అందుకే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలపై మోజు పడాల్సిన పనిలేదు. దాని ప్రధాన లక్ష్యం భారత ప్రభుత్వ ఏర్పాటై ఉండాలి. జమిలి ఎన్నికలపై నిర్ణయం నరేంద్ర మోదీ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. నరేంద్ర మోదీకి సలహాలు, సూచలను ఇచ్చేందుకు బోలెడు మంది సలహాదారులు ఉంటారు. పొగడ్తలకు, చెడు సలహాలకు లొంగకుండా మోదీ జాగ్రత్త పడాలి. 2004లో అప్పటి ప్రధాని వాజపేయి ఎలా ఓడిపోయారో బీజేపీ గుర్తుంచుకోవాలి. ఆయనకు అప్పట్లో మంచి ప్రజాదరణ ఉందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చుట్టూ ఉండేవారు చెప్పారు. ఆయన ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారు. వాజ్‌పేయి ఓటమి బీజేపీకి గుర్తుందా? 2014, 2019 ఎన్నికల ఫార్ములాకే బీజేపీ కట్టుబడి ఉండాలి. జమిలి ఎన్నికల ప్రయోగం ఓటమికి కారణం కావచ్చు. కొన్నిసార్లు తొందరపాటు నష్టం చేస్తుంది. ఎక్కువ రిస్క్‌లు తీసుకోకపోవడంపై నరేంద్ర మోదీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీపై ప్రభావం
మినీ జమిలి ఎన్నికలు బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నదనేది స్థూలంగా పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, మిజోరాం, సిక్కింలలో గతంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాబట్టి, ఈ మూడు రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు బీజేపీకి వస్తే.. లాభం, రాకపోయినా నష్టమేమీ లేనట్లే లెక్క. ఆంధ్రాలో బీజేపీకి మంచి పొత్తు కుదిరితే కొంత ప్రయోజనం ఉంటుందేమో! 2019 జనరల్ ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, 2019 నుంచి నవీన్ పట్నాయక్ తన పాపులారిటీని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు పట్నాయక్‌కు భారీ విజయాన్ని అందించాయి. బీజేపీకి 2019లో వచ్చిన 8 సీట్లు ఇప్పుడు మళ్లీ రావడం కష్టమే. కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. గత ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో 10 ఎంపీ స్థానాలకు పదింటిని గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది. కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 90 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు. బీజేపీ 10 ఏండ్లుగా పాలిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నాయి. సెమీ జమిలి ఎన్నికలు ఇక్కడ బీజేపీకి పెద్ద ప్రయోజనం కలిగించకపోగా.. నష్టం చేసే ప్రమాదం ఉన్నది. 2019 ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ 14 మంది ఎంపీలకు గాను 11 మందిని గెలుచుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. జార్ఖండ్ ప్రస్తుత ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలుస్తూనే ఉంది. హర్యానాలో లాగ జార్ఖండ్‌లో జమిలి ఎన్నికలు వస్తే బీజేపీకి తక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో పరిస్థితి..
తెలంగాణలో బీజేపీకి మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో కాషాయ పార్టీ 4 ఎంపీ స్థానాల్లో గెలిచి ఆశ్చర్యం కలిగించింది. 2019 నుంచి బీజేపీ పెరిగినప్పటికీ, తెలంగాణలో సెమీ జమిలి ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్న 4 ఎంపీల సంఖ్యను మెరుగుపరుచుకోవడం కష్టమే. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో లేరు, అన్నిచోట్లా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా బీజేపీలో అభ్యర్థులు లేరు. కాబట్టి సెమీ జమిలి బీజేపీకి ఇక్కడ పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ 3 రాష్ట్రాలను గెలుచుకుంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రాల నుంచి 61 మంది ఎంపీలను గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే ఉచిత పథకాల సంస్కృతిని ప్రారంభించి, విస్తృతం చేసినందున.. ఈ రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు బీజేపీకి ఎంత ప్రయోజనం చూపగలవనేది ప్రశ్న. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏమైనా కలిసొస్తే చెప్పలేం. మహారాష్ట్రలో 48 మంది ఎంపీలు ఉండగా, 2019లో బీజేపీ కూటమి 41 మంది ఎంపీలను గెలుచుకుంది. ఇక్కడ జమిలి ఎన్నికలు జరిగితే కాషాయ పార్టీకి పెద్దగా మేలు జరగకపోవచ్చు. జమిలి ఎన్నికలు పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్