నిజానికి వర్షం ఎక్కువ పడితే గండిపేట చెరువు ఎందుకు నిండలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. 1970లో కురిసిన వర్షాలతో గండిపేట చెరువు నిండు కుండలా మారడంతో అప్పట్లో ఆ చెరువుకు గండి పడిందనే పుకార్లు వచ్చాయి. అప్పటికీ గండిపేట జలాశయం నిర్మించి 50 ఏండ్లవుతోంది. ఆ ఏడాది చెరువు పూర్తిగా నిండడం, గేట్లు ఎత్తడంతో ‘పానీ ఆయా బాగోబాగో’అని ప్రజలు పెట్టేబేడ సర్దుకుని పరుగులు తీయడం నాకిప్పటికీ గుర్తు. ఆ ఏడాదే హిమాయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తేశారు. గండిపేట పూర్తి స్థాయి నీటిమట్టం 19 అడుగులు కాగా.. గడిచిన 50 ఏండ్లలో 10 అడుగుల మేర ఒండ్రు మట్టి పూడికతో నిండిపోయింది. ఇక 9 అడుగుల మేర నీళ్లొస్తే చాలు గండిపేట నిండిపోవాల్సిందే. కానీ ఈసారి రికార్డు స్థాయి వర్షం కురిసిందని చెప్తున్నా.. గండిపేట ఎందుకు నిండలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకిలెక్కలే. జనాన్ని మోసం చేయడానికే, బాధ్యత నుంచి తప్పించుకోవడానికే, వర్షం రికార్డు స్థాయిలో కురిసిందనే ప్రచారం చేస్తోంది.
అత్యధిక వర్షపాతం.. రికార్డు స్థాయి వర్షపాతం అనే సాకుతో గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్ర జరుగుతోంది. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు, జరగక ముందు ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా తప్పంతా వర్షంపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 117 ఏండ్ల తర్వాత ఈ ఏడాదే ఇంతటి రికార్డు స్థాయి వర్షాలు కురిశాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. వర్షపాతం లెక్కలు తీసే వెదర్ స్టేషన్లు లేని ఆ రోజుల్లో ఎంత వర్షం కురిసిందనే వివరాలు రికార్డు కాలేదు. రెయిన్ గేజ్‌లు, ఆరు బయట గ్లాసులు పెట్టి ఊరి మస్కూర్ లు ఈ లెక్కలు తీసేవారు. ఇవి పూర్తి స్థాయి సైంటిఫిక్ లెక్కలు కావు. మాన్యువల్ స్టేషన్లు 50 ఏండ్ల క్రితం నుంచే రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. నాకు తెలిసినంత వరకు 1908, 1970, 2000, 2016, 2017లో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువే. కానీ అది విలయం సృష్టించింది. 30కిపైగా ప్రాణాలను బలితీసుకుంది.
ప్రభుత్వానికి ప్లాన్ ఉండాలి
ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉండాలి. మన ఎరుకలో 1970లో, 2000 ఆగస్టులో కూడా ఇలాగే వరదలు వచ్చినయి. ఆ తర్వాత 2016, 2017లో కూడా వచ్చినయి. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు నాలాలు, డ్రైనేజీ కెనాల్స్, మ్యాన్ హోల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలనే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి. కానీ ఆ ప్లాన్ లేదు. వరదలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, తర్వాత పట్టించుకోకపోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ సీజన్ లో కురిసిన వర్షాలతో అనేక చోట్ల చెట్లు విరిగి వైర్లు తెగి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నరకం అనుభవించారు. ఇలా కూలిన చెట్లను కోసేందుకు మళ్లీ కరెంట్ సిబ్బందే రావాల్సి వస్తోంది. డీఆర్ఎఫ్ నిర్వహణకు తగినంత నిధులు లేవు.
ఆక్రమణలను కూల్చేయాలి
బెంగళూరులో చెరువులు, కుంటలు ఎన్ క్రోచ్మెంట్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చేశారు. ఇలా కూల్చేయడానికి ప్రభుత్వాలకు విల్ పవర్ ఉండాలి. కానీ ఈ ప్రభుత్వాలకు ఆ విల్ పవర్ లేదు. 2000లో వరదల సందర్భంగా ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ గుర్తించిన ఆక్రమణలను ఏ ప్రభుత్వం కూడా కూల్చివేసే సాహసం చేయలేదు. 2017లో జరిగిన మరో సర్వేలో మరిన్ని ఆక్రమణలను గుర్తించారు. వాటి జోలికి కూడా ప్రభుత్వం వెళ్ల లేదు. నాలాల ఆక్రమణ కాకుండా చూడాల్సిన ప్రభుత్వాలే మూసీ నదిలో ఇమ్లిబన్ బస్ స్టేషన్ ను, మెట్రో స్టేషన్ ను నిర్మించాయి. పేదవాడు గుడిసె వేసుకుంటే గంటల్లో కూల్చేస్తారు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ధనికులు ఎకరాల కొద్దీ ఆక్రమించుకుంటే అధికారులు పట్టించుకోరు. మొన్న వరంగల్ లో వెలుగు చూసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆక్రమణలే ఇందుకు నిదర్శనం.
ఏటా ప్రాణాలు పోతున్నయ్
వర్షాలు బాగా కురిసిన సందర్భంలో పాత ఇండ్లు కూలి ఏటా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఇల్లు కూలి పది మంది చనిపోయారు. మరో చోట ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇలాంటి పాత బిల్డింగ్స్ ను గుర్తించి ప్రభుత్వమే ఎప్పటికప్పుడు ముందస్తుగా కూల్చేయాలి. కొత్త ఇండ్లు నిర్మించుకోలేని పేదలు వాటిలో నివాసముంటే ఆ స్థలాల్లో ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. లేదంటే ఇండ్ల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి.
విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ కావాలె
సరిగ్గా వర్షాలు కురిసే సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒకవైపు రాష్ట్రమంతా వరదల్లో మునిగిపోతే ఆ సమావేశాల్లో కనీసం నిమిషం కూడా చర్చించకపోవడం దురదృష్టకరం. ఇదిలా ఉంటే మరుసటి రోజు రాష్ట్రాన్ని వరద ముంచెత్తుతుంటే సీఎం కేసీఆర్ హార్టికల్చర్ డిపార్ట్ మెంట్‌పై సమీక్ష జరిపారంటే ప్రజాసంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంతకంటే ముందు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షపు నీటి కాల్వలను నిర్మించాలి. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచాలి. నాలాల ఆక్రమణలను తొలగించాలి. వర్షపు నీరు వెళ్లడానికి అడ్డంకిగా మారిన నిర్మాణాలను, మూసీ వెంట ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలి. ఇవన్నీ జరిగితేనే చిన్నపాటి వర్షానికి వరద ముంచెత్తే పరిస్థితి పోతుంది.
పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు
For More News..