
కొవిడ్19 మహమ్మారి విజృంభించక ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక చిన్నారి (35.6 కోట్లు) కడు పేదరికంలో కూరుకుపోయినట్టు ప్రపంచ బ్యాంకు గ్రూపుతో కలిసి యునిసెఫ్ అంచనా వేసింది. 2013 నుంచి 2017 మధ్య అత్యంత పేదరికంలో నివసిస్తున్నవారి సంఖ్య 2.9 కోట్ల మేర తగ్గగా, వైరస్ విజృంభణతో చిన్నారుల పరిస్థితి మరింత కఠినంగా మారింది.
అత్యంత పేదరికం అనుభవిస్తున్న చిన్నారుల ఇళ్లలో 70 శాతం మంది కుటుంబ పోషకులు కూలీలు. మనదేశంలో 51శాతం మంది చిన్నారుల (22.2 కోట్లు) జీవితాలపై పేదరికం, పర్యావరణ సంక్షోభాలు ప్రభావం చూపిస్తున్నట్లు 'జెనరేషన్ హెూప్. 2.4 బిలియన్ రీజన్స్ టు ఎండ్ ది గ్లోబల్ క్లయిమేట్ అండ్ ఇన్ ఈక్వాలిటీ క్రైసిస్' నివేదిక 2022లో పేర్కొంది.
ఆసియావ్యాప్తంగా ఈ సంఖ్య 35 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. బాలల హక్కుల సంస్థ 'సేవ్ ది చిల్డ్రన్' బ్రసెల్లోని వ్రిజ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఈ నివేదికను వెలువరించారు. ప్రపంచవ్యాప్తంగా 77.4 కోట్ల మంది చిన్నారులు అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, సంపన్న దేశాల్లో 12.1 కోట్ల మంది చిన్నారులు పేదరికం, పర్యావరణ సంక్షోభాల ప్రభావంతో జీవితాలు గడుపుతున్నారు. మన దేశంలో 35.19 కోట్ల మంది పిల్లలపై ప్రతిఏటా వాతావరణ వైపరీత్యం ప్రభావం చూపుతోంది. పర్యావరణ సంక్షోభం, అసమానతల సమస్యల పరిష్కారానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని, మన దేశంలో ఈ చొరవ మరింత కీలమని 'సేవ్ ది చిల్డ్రన్' హెచ్చరించింది.
మానవాభివృద్ధిలో ఇప్పటికీ ఎదగలేదు
పేదరికమంటే ఆహారం, దుస్తులు, నివాసం లేకపోవడమే కాదు.. తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు కూడా అందకపోవడం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ చేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ వేతనాల్లో ఎక్కువభాగం వీటిపై ఖర్చు చేస్తున్నారు. దీంతో దాదాపు దేశంలో సగం జనాభా పేదరికంలో మగ్గుతున్నారు.
ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మన దేశం 134వ స్థానంలో ఉంది. ఆకలి సూచీలో 105 స్థానం, నిరుద్యోగంలో 87, సంతోష సూచీలో 126, ఆరోగ్యంలో 56, అక్షరాస్యతలో 105 స్థానంలో ఉండి అంతర్జాతీయ సూచీలో చివరి స్థానంలో నిలిచింది. ఇక ధనవంతులతో పోల్చితే పేదవారు ఎక్కువ సంతానాన్ని కంటున్నట్టు 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే' నివేదిక పేర్కొంది. పిల్లల సంఖ్య మీద చదువు ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.
చదువుకున్న మహిళలతో పోల్చితే నిరక్షరాస్య మహిళలు ఎక్కువమంది పిల్లలను కంటున్నట్టు వివరించింది. 1992–-93 నాటికి ఒక్కో కుటుంబంలో 3-4 మంది సంతానం ఉండేది. 2019–-21 నాటికి ఈ సంఖ్య రెండుకు తగ్గింది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో సంతానం కాస్త ఎక్కువగానే ఉంది. బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం రెండేండ్లు ఎడం పాటించాలన్న నిపుణుల సూచనను 73 శాతం మంది దంపతులు పాటిస్తున్నారు. కాన్పుల మధ్య ఎడం దేశవ్యాప్త సగటు 32.7 నెలలుగా నమోదైనట్లు సర్వే వివరించింది.
పేదరికంపై కొవిడ్ ప్రభావం
పేదరికం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలన్నీ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నిర్విరామ కృషిని కొవిడ్ కొంతమేరకు అడ్డుకుంది. మూతపడిన పాఠశాలలు, ఊడిన ఉద్యోగాలు, స్తంభించిన జీవనం, తగ్గిన ఆదాయం... పెద్దలతోపాటు పిల్లల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దిగువ, మధ్యతరగతి పిల్లలు ప్రాథమిక అవసరాలకు నోచుకోక పేదరికంలోకి కూరుకుపోయారని గతంలో యునిసెఫ్ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన వనరులను సమకూర్చి అభివృద్ధికి దోహదపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను పేద కుటుంబాల ముందుకు తెచ్చాయి. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అధ్యయనం మేరకు 2030 నాటికి 20.70 కోట్ల మంది పేదరికం కోరల్లోకి చేరుకుంటారని తేలింది. చాలీచాలని ఆదాయాలతో అనేక కుటుంబాలు అల్లాడుతున్నాయి. పోషకాహారానికి నోచుకోలేకపోతున్నాయి. ఫలితంగా ఆ కుటుంబాల్లోని పిల్లలు ఎదుగుదల లోపాలబారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు అత్యధికంగా ఉన్నది మన దేశంలోనే.
చిన్నారుల్లో ఎదుగుదల లోపం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2005-–06లో వయసుకు తగిన ఎత్తు లేనివారు 48 శాతం, బరువు లేనివారు 42.5 శాతం, ఎత్తుకు తగిన బరువు లేనివారు 19.8 శాతం ఉన్నారు. 2015-–16లో వరుసగా 38.4, 35.8, 21 శాతం ఉన్నారు. అదేవిధంగా 2019-–20 సర్వేలో 35.5, 32.1, 19.3 శాతం ఉన్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తున్నాయి. పట్టణ మురికివాడల్లో ఈ ముప్పు అధికంగా ఉంది.
‘హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్ఎచ్ఎఫ్) ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలిపింది. తక్కువ బరువుతో ఉన్నవారు 27, వయసుకు తగ్గ ఎత్తు లేనివారు 24, అల్పాహారానికి దూరంగా 50 శాతం ఉంటున్నట్టు వెల్లడయింది. రోజువారీ ఆహారంలో తగినంత పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు తగినంత పరిమాణంలో ఉండటం లేదు. ఫలితంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న బయట దొరికే ఆహారం తినడంతో శరీరానికి సరైన పోషకాలు అందడంలేదని అధ్యయనంలో గుర్తించారు. ఆరేళ్ల లోపు పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్రం 1975లోనే సమీకృత శిశు అభివృద్ధి (ఐసీడీఎస్)ని నెలకొల్పింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయినా, దేశీయంగా పోషకాహార లోపం ఎందరినో పట్టిపీడిస్తోంది.
--కోడం పవన్‌కుమార్,సీనియర్ జర్నలిస్ట్-