కేసీఆర్​ వ్యూహం ఫలించేనా?

దేశంలోని రాజకీయాలు పార్టీలు 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. మూడోసారి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారం దక్కనీయ కూడదనే సంకల్పంతో కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించి ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. బెంగాల్ లో హాట్రిక్ విజయం సాధించిన తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలను కూడగట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి కేసీఆర్ మమతాబెనర్జీ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటివరకు ఒక రూపం రాలేదు కానీ మోడీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో భావసారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలతో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ‘‘తెలంగాణకు అవసరమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. అలాగే దేశానికి అవసరమైనప్పుడు. ఒక కొత్త రాజకీయ శక్తి ఉద్భవిస్తుంది’’అని గతంలో చెప్పిన కేసీఆర్.. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ఏం చేయబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది. 
 

కాంగ్రెస్ నిస్సహాయతతో..
కాంగ్రెస్ పార్టీ నిస్సహాయత, ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై బలంగా పని చేయకపోవడం బీజేపీకి వరంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ బలమైన రాజకీయ చాలెంజ్ విసర లేకపోతున్నందున భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ రాజకీయంగా తన పూర్వవైభవాన్ని కోల్పోతున్న ఈ తరుణంలో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అనివార్యమైంది. 2019 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోవటం, నాయకత్వ సమస్య ఎదుర్కోవటం, వరుస పరాజయాలు, పార్టీలో అసమ్మతి, కీలకమైన నేతలు పార్టీని వీడి వెళ్లడంతో ప్రస్తుతం భారత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిస్సహాయత బీజేపీకి అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దేశంలో బలమైన, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవాలని కేసీఆర్, మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోలేక పోతోంది కాబట్టి దేశంలో కొత్త రాజకీయ శక్తి ఏర్పడాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
 

రైతాంగ సమస్యలే జాతీయ ఎజెండాగా
జాతీయ వాద కాషాయ ఎజెండాతో ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకు గానీ ప్రత్యామ్నాయ కూటమికి గానీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే బలమైన జాతీయ జెండా కావాలి. అందుకే కేసీఆర్ తన వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా రైతు సమస్యలే జాతీయ ఎజెండాగా మార్చి బీజేపీని ఎదుర్కోవాలనే ప్రయత్నంతో ముందుకెళుతున్నారు. బీజేపీ ఎక్కడ విఫలమైందో అక్కడ నుంచే ప్రయాణం మొదలు పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని, రైతును కేంద్రంగా చేసుకుని నూతన వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని ప్రతిపాదనలు తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన పోరులో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. సాగు చట్టాల రద్దు ప్రకటన రోజు చెప్పినట్టుగా 600 మంది రైతు కుటుంబాలకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయం చేయనున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోవడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోవడం లాంటి అంశాలను కేసీఆర్​వివిధ రాష్ట్రాల సీఎంలతో కలిసి చర్చించనున్నారు. బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం, మద్దతు ధరలపై స్పష్టత, సమగ్ర నూతన వ్యవసాయ విధానం రూపొందించటం, రైతు బంధును దేశవ్యాప్తం చేయడం లాంటి డిమాండ్ల ద్వారా బీజేపీని ఎదుర్కోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.
 

ఫ్రంటా- పార్టీనా?

జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. మరి ఆ శక్తి ఏ రూపంలో ఉండబోతోందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జాతీయస్థాయిలో ఏర్పడబోయేది ఫ్రంటా, పార్టీనా అనే చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటులో కేసీఆర్​వ్యూహంతో ముందుకెళ్ల బోతున్నట్లు కనిపిస్తోంది. మొదట వ్యూహంలో భాగంగా దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఫ్రంట్ ఏర్పాటు చేయటం ఆ దిశగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేశ్​ యాదవ్, తేజస్వి యాదవ్, దేవగౌడలతో ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అయితే కేవలం వీరితోనే జాతీయ స్థాయిలో మార్పు తీసుకురావడం కష్టమే. ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్ తో భాగస్వామ్య పక్షాలుగాయూపీఏలో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు ఉద్ధవ్ థాక్రే, శరద్​ పవార్, స్టాలిన్, హేమంత్ సొరేన్ లాంటి వారు కలిసి రాకపోతే కేసీఆర్ లక్ష్యం నెరవేరక పోవచ్చు. ఒకవేళ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఆ పార్టీతో ఉన్న భాగస్వామ్య పక్షాలు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. అప్పుడు కేసీఆర్ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రాజకీయాలను లోతుగా విశ్లేషణ చేసే వారెవరూ కేసీఆర్ ను, ఆయన రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయరు.


హ్యాట్రిక్ విజయం సాధిస్తేనే

జాతీయ రాజకీయాల్లో బలమైన నేతగా ఎదగాలన్నా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాలన్నా తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ హ్యాట్రిక్ విజయం సాధించడం కేసీఆర్​కు అంత తేలికైన విషయం కాదు. 2014 , 2018 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన సులభ పరిస్థితులు 2023 శాసనసభ ఎన్నికల్లో ఉండవు. బలం పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ లపై విజయం సాధించటం అంత తేలిక కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంతో పోలిస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షాల బలం పెరిగింది. కేసీఆర్​ను గద్దెదించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా సంస్థాగత నిర్మాణం, అధికారంలో ఉండటం ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక, కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు టీఆర్ఎస్ ను ఏమేరకు విజయతీరాలకు చేరుస్తుందో చూడాలి. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నందమూరి తారక రామారావు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన విధంగానే మరొకసారి మరో తెలుగు నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిరగాలంటే ముందు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలవాలి. చక్రం తిప్పాలంటే బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ తో కలిసి రావాలి.                                         - డా. తిరునాహరి శేషుఅసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ