వరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?


మొన్నటి వరకు వరిని పండుగగా చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం .. ఇప్పుడు వరిని దండుగ అనడం విడ్డూరంగా ఉంది. చివరి గింజ వరకు కొంటామని ఎన్నోసార్లు పరకటించిన రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు వరి పండించవద్దని, వరి వేస్తే ఉరే అని చెప్పడం, కేసులు పెడతామని బెదరించడం ఎంత వరకు సమంజసం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని బలవంతం చేయడం, వరి విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో నలుగురికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. 

తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. గతంతో పోలిస్తే 2020- –21 రబీలో వరి విస్తీర్ణం 235 శాతం పెరిగిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. సాధారణంగా రబీలో 23 నుంచి 30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. గత ఏడాది ఇది 53 నుంచి 55 లక్షల ఎకరాలకు పైగా పెరిగింది. వరి సాగు విపరీతంగా పెరగడం, వడ్ల కొనుగోలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిగ్గా వివరించ లేకపోవడం, కేంద్రం చెప్పే మాటలను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం వివాదానికి కారణమయ్యాయి. 
వరి.. ఉరిగా ఎందుకు మారింది?
తెలంగాణలో వరి సమస్యను రాజకీయాలు చుట్టుముట్టాయి. వరి పండుగ నుంచి దండుగగా ఎందుకు మారిందని ఆలోచిస్తే.. రాజకీయ లబ్ధి తప్ప మరేది లేదని అర్థమవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వర్షాలు పెరిగి చెరువులు, కుంటలు కళకళలాడాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తికావడంతో పుష్కలంగా నీరు అందుబాటులో వచ్చింది. మన నేలలు వరికి అనుకూలంగా ఉండటంతో రికార్డు స్థాయిలో పంటలు పండించడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ ఏడాది వరి సాగు ఎవరూ  ఊహించని స్థాయికి చేరుకుంది. బాయిల్డ్​ రైస్​ కొనబోమని రా రైస్​ అయితే కొనుగోలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా చెపుతూ వస్తోంది. ఇందుకు కేసీఆర్ ఒప్పుకుని సంతకం పెట్టిన తర్వాత మాటమార్చడం, కేంద్రం బెదిరింపులతోనే అలా చేయాల్సి వచ్చిందని సీఎం స్థాయి వ్యక్తి అనడం సమాఖ్య స్ఫూర్తికి మంచిది కాదు. కేంద్రం కొంటామంటున్న రా రైస్​ ఇవ్వకుండా.. బాయిల్డ్​ రైస్​ నే కొనుగోలు చేయాలని రాష్ట్రం పట్టుబడుతోంది.
హరిత విప్లవం కారణంగానే..
నిన్నమొన్నటి వరకు దక్షిణాదితోపాటు అనేక రాష్ట్రాలకు పంజాబ్, హర్యానా నుంచి బియ్యం ఎగుమతి అవుతున్నది. నిజానికి ఇవి రెండు వరి సాగు రాష్ట్రాలు కాదు. అక్కడి ప్రజలు కూడా బియ్యం పెద్దగా తినరు. బియ్యం ఎక్కువగా తినే ప్రజలున్న రాష్ట్రాలకు గోధుమ ఎక్కువగా తినే ప్రజలున్న రాష్ట్రాలు బియ్యం సరఫరా చేయడానికి కారణం 1960లో వచ్చిన హరిత విప్లవం. దేశంలో ఆహారభద్రత కోసం ఆ రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలను బియ్యం సరఫరా కోసం ఎంచుకుని ప్రోత్సహించారు. అప్పటికి తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో నీటిపారుదల వ్యవస్థ పెద్దగా లేకపోవడంతో పంజాబ్, హర్యానాల బియ్యమే దిక్కయ్యాయి. 1995 తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. పౌరసరఫరాల వ్యవస్థలో పంపిణీ చేయడానికి పంజాబ్ నుంచి బియ్యం తీసుకురావడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. స్థానిక బియ్యాన్ని వాడడానికి అనుమతించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఫలితంగా వరి సేకరణ వికేంద్రీకరణకు దారి తీసింది. రాష్ట్రాలే వడ్లు సేకరించి తమ అవసరాలకు పోను మిగతాది కేంద్రానికి పంపించాలి. దాంతో పంజాబ్, హర్యానా నుంచి బియ్యం రవాణా తగ్గిపోయింది. అక్కడ వరి వేయొద్దని రైతులకు చెప్పలేకపోవడం, అక్కడి లాబీయింగ్ బలంగా పనిచేయడంతో వరిని పండించడం, సేకరించడం యధావిధిగా కొనసాగుతోంది. 
ఇతర పంటలను ప్రోత్సహించంది ప్రభుత్వాలే
వరి సాగులో రాజకీయాల కారణంగా పంటల విషయంలో ముందుచూపు లోపిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ఏ ప్రభుత్వాలూ ప్రయత్నాలు చేయటం లేదు. వ్యవసాయం పండుగ ధోరణి ప్రత్యేక తెలంగాణలో కూడా ఎక్కువగా ఉంది. కోటి ఎకరాల మాగాణి అని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. రోజుకు మూడు పూటలా అన్నం తిన్నా కూడా.. తెలంగాణకు కావాల్సింది 70 లక్షల టన్నులు మాత్రమే. కానీ రాష్ట్రంలో నేడు వరి ఉత్పత్తి కోటి టన్నులకు మించింది. దీంతో బియ్యం నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కూడా వరినే ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బలవంత పెట్టడం సబబు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కోటి ఎకరాల పంటలను పండించేందుకే కడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెపుతూ వచ్చింది. తెలంగాణ వరి సాగు వైపు వెళుతోందని, దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని రెండేండ్ల కిందటే హెచ్చరికలు వినపడ్డాయి. వ్యవసాయంపై నేటికీ కూడా భవిష్యత్​ ప్రణాళికలు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలకు సంబంధించి సరైన కార్యాచరణ కావాలి. రైతులను రాజకీయంలో ఆటవస్తువుగా చేయొద్దు.
ప్రభుత్వ విధానాలే చిన్నాభిన్నం చేస్తున్నాయా?
ఏ విధంగా చూసినా రైతులు ఇప్పుడు కాకపోయినా.. ఆ తర్వాతైనా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపకతప్పదు. అయితే వరి పొలాలు ఇతర పంటలు వేయడానికి పనికిరావు. వరి సాగు నీళ్లు నిల్వ ఉండేలా భూమిని మార్చేస్తుంది. ఇలాంటి భూములు ఇతర పంటలకు పనికి రావని, వీటిలో ఇతర పంటలు పండించాలంటే కొంత సమయం పడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం మరవద్దు. అయితే పంట మార్పిడి జరిగేంత వరకు రైతులకు ప్రభుత్వం సాయం చేయాలి.

ఇలాంటి ప్రణాళికలు ఏమీ లేకుండా ఉన్నట్టుండి వెంటనే ప్రత్యామ్నాయ పంటలు పండించాలని హుకుం జారీ చేసినా.. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వరి మీద లభించే రాయితీ ఏ పంట మీద కూడా రాదు. పంజాబ్​లో ఎకరాకు అత్యధికంగా రూ.29 వేల సబ్సిడీ అందిస్తుంటే, తెలంగాణలో రూ.24 వేల సబ్సిడీ అందిస్తున్నారు. అలాంటప్పుడు రైతులు వరి మానడం చాలా కష్టం. నిజానికి పర్యావరణ కోణంలో వరి విస్తీర్ణం తగ్గించాలని శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచీ చెబుతున్నారు. అయితే వరి రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ముందుకెళ్లాలని చూస్తున్నారే తప్ప, రైతుల గోస పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది.
పథకాలు ఎంత మేలు చేస్తున్నాయి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంతో పెద్ద భూస్వాములకు మాత్రమే లాభం చేకూరుతోందనే వాదన బలంగా ఉంది. చిన్న, సన్నకారు రైతులకు ఏమాత్రం లాభం చేకూరడం లేదన్నది నగ్నసత్యం. రాష్ట్రంలోని మొత్తం  రైతుల్లో 60 శాతానికిపైగా కౌలుదారులే. కానీ, ఈ పథకం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా.. ఆ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చిందో రైతులకు తెలియదు. వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నా.. ఆ మేరకు దిగుబడి రావడం లేదు. సాగు కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. దీనికి తోడు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం తదితర కారణాల వల్ల అప్పులు మరింతగా పెరుగుతున్నాయి. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చైనాలో సాధ్యమైంది మన దగ్గర ఎందుకు కాదు?
వరి డిమాండ్, పర్యావరణం మీద వరి సాగు ప్రభావం తదితర కారణాల రీత్యా రైతులు ఇతర పంటల వైపు మళ్లడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తూ ఉండాల్సిందే అని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రానికి వ్యవసాయంపై ముందుచూపు, ప్రణాళిక లేకపోవడమే వరి సమస్యకు కారణమని చాలా మంది వాదిస్తున్నారు. ధాన్యం సేకరణ అనేది ఆహార భద్రతకు సంబంధించిన అంశం. అనేక గోడౌన్లలో ధాన్యం మగ్గిపోతోంది. అందుకే వరిని సేకరించలేమని అనడం కూడా సరికాదు.

గోడౌన్లలో మురిగిపోతున్న ధాన్యాన్ని ముందు ఖాళీ చేయించాలి. యునైటెడ్​ నేషన్స్​ రిపోర్ట్​ ప్రకారం మనదేశంలో ఆహార సమస్య తీవ్రంగా ఉంది. ఇంటర్నేషనల్​ హంగర్​ ఇండెక్స్​లో 116 దేశాల లిస్ట్​లో మనది 101వ స్థానం. ఆహారం దొరక్క అల్లాడుతున్న వారికి ఉచితంగా లేదా మరో రూపంలోనో ఆహార ధాన్యాలను పంచితే గోడౌన్లు ఖాళీ అవుతాయి. కరోనా కాలంలో చైనా 100 మిలియన్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. తాజాగా మళ్లీ ధాన్యం సేకరించడం మొదలు పెట్టింది. అలా మనదేశం కూడా చేయాలని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు, మేధావులు కోరుతున్నారు.
తెలంగాణ వచ్చాక 
రైతుల ఆత్మహత్యలు 7,400పైనే
బడా సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదిస్తుంటే.. నలుగురికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. తెలంగాణలో రైతు కుటుంబాలు వరి రాజకీయం మూలాన దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో రైతులంతా కేసీఆర్​తో కలిసి పాల్గొన్నారు. కానీ నేడు రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ ఏడేండ్ల కాలంలో 7,400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రెస్ మీట్​ పెట్టి.. యాసంగిలో రైతులు ఎవరూ వరి సాగు చేయకూడదని ప్రకటించారు. దీంతో రైతులు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. 

వరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా మంది రైతులు, మేధావులు, వరి కొనుగోలు బాధ్యత రాష్ట్రానిదే అని అనుకుంటున్నారు. కానీ నేడు ధాన్యం కొనుగోలు విషయంలో అసలు కొనుగోలుదారు కేంద్రమే అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శల మూలంగా రైతులకు తెలిసింది. పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే బాధ్యత వహిస్తుందనే విషయం భవిష్యత్తు రాజకీయాలను, తెలంగాణ రాజకీయాల్లోనూ పెను మార్పులను కలిగించే ఆస్కారం ఉంది. నేటి రాజకీయ దుమారం వల్ల పంటలు కొనుగోలు చేస్తున్నది, రైతులను ఆదుకోబోయేది కేంద్రమే అన్నవిషయం ప్రతి రైతుకు తెలియడం బీజేపీకి అనుకూలంగా మారబోతోంది.

ఇన్నాళ్లూ రైతులకు సహాయం  చేస్తున్నది కేసీఆర్ అనే భ్రమ తొలగిపోయింది. రైతులను ఆదుకోవాలంటే ఆ శక్తి కేంద్రానికి మాత్రమే ఉందన్న విషయం తేటతెల్లం కావడంతో భవిష్య్తులో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలే తెలంగాణలో కూడా గెలిచినట్లయితే రైతులకు మేలు జరుగుతుందని, ఇక్కడ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నట్లయితే రైతులు బాధపడాల్సి వస్తుందని అర్థమైపోతుంది. ఇన్నాళ్లుగా రైతులకు తెలియని రహస్యాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం వల్ల అందరికీ అర్థమవుతున్నాయి. ఈ వరి రాజకీయం భవిష్యత్తులో బీజేపీకి అనుకూలంగా.. టీఆర్ఎస్ ను ముంచేలా మారబోతోన్నాయా అనేది కాలమే నిర్ణయించాలి. -డా.బి.కేశవులు, మనో రాజకీయ విశ్లేషకుడు