బ్రిటీష్ ప్రభుత్వం 1936లో మొదటిసారిగా ఇండియాలో ప్రత్యేక చట్టం ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితా ప్రకటించింది. అంతకుముందు వీరిని డిప్రెస్డ్ తరగతులుగా పరిగణించేవారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సీ), ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టీ)ను ప్రకటిస్తారు. ఒక కులాన్ని ఎస్‌సీగా గుర్తించాలంటే వారు సామాజిక, విద్య, ఆర్థిక వెనుకబాటుతోపాటు అస్పృశ్యతను అనుభవిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎస్‌టీగా గుర్తించాలంటే ఆ తెగకు ప్రత్యేక భాష, ఆచారాలు, అడవుల్లో తిరుగుతూ, అక్కడే కులవృత్తి చేసుకునే వారై ఉండాలి. ఒక కులాన్ని వెనుకబడిన తరగతి(ఓబీసీ) గా గుర్తించాలంటే వారు సామాజికంగా, విద్యాపరమైన వెనుకబాటును అనుభవిస్తూ ఉండాలని నిర్ధారించారు.
1950లో ఎస్‌సీ.. 1956లో ఎస్‌టీ జాబితా..
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వులతో ఎస్‌సీ జాబితాను దేశంలో విడుదల చేశారు. ఉత్తర్వుల్లోని పేరా–3లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిన వారందరూ తప్పనిసరిగా హిందూ మతంలోనే కొనసాగాలనే నిబంధన పెట్టారు. పంజాబ్‌లోని రాందాసి, కాబిరపంతి, మజాబి, సిక్లిగర్ కులాలు మాత్రం సిక్కు మతంలో కొనసాగవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ.. షెడ్యూల్డ్ కులాల వారు తప్పనిసరిగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలో మాత్రమే కొనసాగాలని నిబంధన పెట్టారు. ఒకవేళ ఇతర మతాలలోకి మారితే ఎస్‌సీ హోదా కోల్పోయి ఓబీసీగా గుర్తింపు పొందుతారు. హిందూ మతానికి చెందిన అతిశూద్రులు అంటరానితనాన్ని అనుభవించడమే షెడ్యూల్డ్ కులాల వారికి మత నిబంధన పెట్టడానికి కారణం. క్రైస్తవ, ముస్లిం మతాలలో అయితే అంటరానితనం లేదు. చర్చిలో పాస్టర్‌గా, మసీదులో ఇమామ్‌లుగా ఎవరైనా ఉండవచ్చు.. కానీ హిందూ దేవాలయాలలో పూజారులుగా బ్రాహ్మణులే ఉంటారు. ఇక దేశంలో ఎస్‌టీ జాబితాను 1956లో ప్రకటించారు. వీరికి ఎలాంటి మత నిబంధనలు లేవు. వీరు ఏమతంలోనైనా ఉండవచ్చు.
ఓబీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన తీర్పుల్లేవు
ఓబీసీలు మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని ఇప్పటివరకు మన దేశంలో ఏ కోర్టులూ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. అయితే, 2013 లో మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఎస్.యాస్మిన్ వర్సెస్ ది సెక్రటరీ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు తీర్పులో పిటిషనర్ ఓబీసీ కులానికి చెందిన క్రైస్తవ నాడార్. ఆమె ముస్లిం మతానికి మారింది కనుక బీసీ రిజర్వేషన్ కోల్పోతుందని తీర్పు ఇచ్చారు.
మతం మారినా అంటరానితనం అట్లనే..
మతం మారినంత మాత్రాన అసమానత్వం, అంటరానితనం పోవడం లేదు. కేవలం కొందరు షెడ్యూల్డ్ కులాల వారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక హోదాలో ఎలాంటి మార్పు రావడం లేదు. షెడ్యూల్డ్ కులానికి చెందినవారు మతం మారితే షెడ్యూల్డు కులాలకు దక్కే హోదా మరియు రిజర్వేషన్లు కోల్పోతారని ఇండియన్ కాన్‌స్టిట్యూషన్‌లో ఎటువంటి క్లాజులు లేవు. కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే ఈ నిబంధన ఉంది. మొదట హిందూమతంలో కొనసాగాలని చెప్పారు. తరువాత సవరించి సిక్కు లేదా బౌద్ధ మతాలలో కూడా కొనసాగవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు 1950 లోని పేరా–3ను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకొని వీరికి న్యాయం చేయాలి.
షెడ్యూల్డ్ కులానికి చెందినవారు క్రిస్టియన్ లేదా ముస్లిం లేదా ఇతర మతాల్లోకి మారితే వారికి షెడ్యూల్డ్ కులాలకు కల్పిస్తున్న ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని 1975లో కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. కొంతకాలం తర్వాత వారు తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి మారితే వారికి మళ్లీ షెడ్యూల్డ్ కుల హోదా, వాటితో వచ్చే రిజర్వేషన్లు పొందే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి 1976లో సుప్రీంకోర్టు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వర్సెస్ వై.మోహన్ రావు కేసు తీర్పులో స్పష్టంగా తెలిపింది. 1976 నుండి 2020 వరకు పలు కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం తల్లి, తండ్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై , క్రైస్తవ మతంలోకి మారినప్పుడు వారు షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారు. ఒకవేళ వారి సంతానం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారినట్లయితే తిరిగి షెడ్యూల్డ్ కులాల హోదా పొంది రిజర్వేషన్లు కూడా పొందుతారు. అదే షెడ్యూల్డ్ తెగలు ఏ మతంలోకి మారినా వారి హోదా, రిజర్వేషన్లు మారవు.-కోడెపాక కుమారస్వామి, ప్రముఖ సామాజిక విశ్లేషకులు.